విభిన్నం.. వినూత్నం
పండుగలొస్తే చాలు ఆయన కుంచె రంగుల్లో తలమునకలవుతుంది. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే చిత్రాలను తీర్చిదిద్దుతుంది. భాగ్యనగర సంస్కృతిని కొలోగ్రఫీ చిత్రాలతో కళ్లకు కడుతున్న కళాకారుడు మడిపడగ శ్రీకాంత్ ఆనంద్. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్‌లో బీఎఫ్‌ఏ పూర్తిచేసి, కొలోగ్రఫీలో నైపుణ్యం సాధించిన శ్రీకాంత్‌కు తండ్రి నుంచి కళా వారసత్వం అబ్బింది. కళాసిగూడకు చెందిన బలరామాచార్య కుమారుడైన శ్రీకాంత్, బాల్యంలో తండ్రి వేసే చిత్రాలను చూస్తూ కళపై అభిరుచి పెంచుకున్నారు. శ్రీకాంత్ తండ్రి బలరామాచార్య 1975లో ప్రపంచ తెలుగు మహాసభల లోగోను చిత్రించారు.
వుడ్‌కట్, కొలాజ్, కొలోగ్రఫీ, లినోకట్ వంటి విభిన్న శైలుల్లో ఇప్పటికే ఆరువేలకు పైగా చిత్రాలను వేశారు. వినాయక నవరాత్రుల్లో ఆయన వేసిన వినాయకుని కొలోగ్రఫీ చిత్రాలు నగర వాసుల ప్రశంసలు పొందాయి. దసరా, దీపావళి, బోనాలు, రంజాన్, క్రిస్మస్... ఎలాంటి పండుగ వాతావరణాన్నయినా శ్రీకాంత్ సునాయాసంగా బొమ్మకడతారు. మహిళలపై అఘాయిత్యాలు వంటి సామాజిక సమస్యలపై కూడా చిత్రాలు గీశారు. ఏటా ఆగస్టు 11న తండ్రి జన్మదినం సందర్భంగా బలరామాచార్య గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి యేడూ రాజ్యశ్రీ-బలరామ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొలాజ్ చిత్ర ప్రదర్శనా నిర్వహిస్తున్నారు.
అవార్డులు
1994: విశాఖ లలిత కళా అకాడమీ ప్రదర్శనలో కొలోగ్రఫీ ప్రదర్శనకు అవార్డు
1998: ఫ్యామిలీ ప్లానింగ్ సొసైటీ నిర్వహించిన బిగ్ ఫ్యామిలీ ఆర్ట్ వర్క్‌కు అవార్డు
2006: న్యూఢిల్లీ ‘కళామఠ్’ ప్రదర్శనలో దుర్గ చిత్రానికి అవార్డు
2007: తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనలో సంక్రాంతిపై గీసిన చిత్రానికి అవార్డు
2009: ‘నిన్న నేడు రేపు’ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గీసిన చిత్రానికి విశాఖ లలిత కళా అకాడమీ ప్రదర్శనలో ఉత్తమ చిత్రం అవార్డు
- ఎం.తిరుపతి