సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘48 గంటల సినిమా తయారీ పోటీ’లను వైభవంగా నిర్వహించేందుకు గాను విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక షార్ట్‌ఫిల్మ్ తీయాలంటే మామూలుగా నిడివిని బట్టి తక్కువలో తక్కువ నెలరోజులైనా పడుతుంది. కానీ 48 గంటల్లో స్క్రిప్టు రాయడం, షూటింగ్, ఎడిటింగ్ లాంటివి పూర్తి చేసి సినిమా తీయడానికి తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ కొత్త ఒరవడికి తెరలేపింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా అనే కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
ఫిల్మోత్సవం.. : గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ఫిల్మోత్సవం పేరిట షార్ట్ ఫిలిం పోటీల ను నిర్వహిస్తున్నారు. ఈసారి అవతరణ ఫిల్మోత్స వాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్’ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్‌కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ మే 24 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మొదలై 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు ముగియనుంది. శుక్రవారం సాయంత్రం భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా క్యారెక్టర్‌ని వాడి 4 నుంచి 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. మే 27న పోటీదారుల జాబితాను వెల్లడిస్తారు. విజేతలను జూన్ 3న రవీంద్రభారతిలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు.
ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం: తమ ప్రతిభను నిరూపించుకునేందుకు గాను ఔత్సాహిక సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని ఆసక్తి ఉన్న యువత అందరూ వినియోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, తమ ప్రతిభను మెరుగు పరచడానికి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. తద్వారా తమ ప్రతిభకు వారు మెరుగులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఔత్సాహిక సినిమా దర్శకులు 91 8919997465 నంబర్‌ను సంప్రదించవచ్చు.
- మామిడి హరికృష్ణ,భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు
48 అవర్స్ చాలెంజ్!
Published Sun, May 12 2019 3:26 AM | Last Updated on Sun, May 12 2019 3:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment