Culture and traditions
-
ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా..
ఆర్టీసీ అనగానే.. పాతబడిన, కండీషన్లో లేని డొక్కు బస్సులే సహజంగా గుర్తుకొస్తాయి. వాటి రూపం కూడాఆ భావనకు బలం చేకూర్చుతుంది. వెలిసిపోయిన రంగులు, శుభ్రత లోపించడం, వ్యాపార ప్రకటనలతో నిండిపోవడం వంటి దృశ్యాలే కళ్లముందు కదలాడతాయి. ఇప్పుడా పరిస్థితి మారనుంది. రంగురంగుల వర్ణచిత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా వాటి రూపం మారనుంది. ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ప్రజారవాణ శాఖను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు చేపట్టింది. మన రాష్ట్ర, తెలుగువారి సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే వర్ణరంజితమైన చిత్రాలు.. ఇప్పుడున్న వ్యాపార ప్రకటనల స్థానంలో కనువిందు చేయనున్నాయి. అలాగే డొక్కు బస్సులన్న అపప్రదను తొలగించేందుకు రీకండీషన్ కూడా చేయిస్తున్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతోపాటు.. బహుమతులు పొందిన చిత్రాలను.. సంబంధిత విద్యార్థి, పాఠశాల పేరుతో సహా బస్సులపై ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సీఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. వర్ణ చిత్రాలతో అలంకరించిన 21 బస్సులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల రూపురేఖలను దశలవారీగా మార్చనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం): ప్రగతి చక్రం కొత్త ‘కళ’ను సంతరించుకుంటోంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సొబగు లద్దుకుంటోంది. మన పండగలు, దర్శనీయ ప్రదేశాలు, కళలు, రమణీయ దృశ్యాలతో చిత్రీకరించిన బస్సులు ఇకపై కళ్లెదుటే సాక్షాత్కరించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ ‘మన బస్సు.. మన సంస్కృతి’ పేరిట అందంగా పెయింట్ చేస్తున్నారు. విశాఖ రీజియన్‌లోని 600 బస్సులను దశలవారీగా రీ కండిషన్ చేసి, పెయింటింగ్ వేయించనున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా.. చూడముచ్చటగా రూపొందిన 21 బస్సులను వాల్తేరు డిపో ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ కమిషనర్ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇకపై బస్సులపై ఎటువంటి అడ్వర్టై ్జజ్మెంట్స్ కనిపించవు. ఏడాది పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళలు, పండుగలు, దర్శనీయ ప్రాంతాలను చిత్రీకరించిన పెయింటింగ్స్‌తో ఆర్టీసీ బస్సులు రూపుదిద్దుకోనున్నాయి. ఆరు నెలల్లో అన్ని బస్సులకూ కొత్త సొబగులు నిర్జీవంగా ఉన్న బస్సులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన పిమ్మట, ప్రజల మనసులకు హత్తుకునేలా స్థానిక కళాకారులచే కళాకృతులను బస్సులపై చిత్రీకరించామని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో నగరంలోని బస్సులన్నీ కొత్త సొబగులు అద్దుకుంటాయన్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, అందుకు తగినట్లుగా బస్సులకు కొత్త కళను తెస్తున్నామన్నారు. నగరంలో 600 బస్సులున్నాయని, ప్రతి బస్సు రోజుకు 220 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయని తెలిపారు. బస్సులన్నింటినీ సంస్కృతి, సంప్ర దాయాలు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతామన్నా రు. ఇది పెద్దగా ఖర్చయిన వ్యవహారం కాదని, నిర్జీవమైన వాహనాలను రీ కండీషన్ చేసి పెయింట్లు అద్దడంతోనే కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పారు. ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ఆ విభాగానికి తొలి కమిషనర్‌గా నియమించారని, దానిని నిలబెట్టుకుని ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తానన్నారు. తాను ఏయూలోనే చదువుకున్నానని తెలిపారు. అనంతరం డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడారు. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, డ్రైవర్లు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని, వారికి పలు సూచనలు చేశారు. డ్రైవర్లు వేసుకుంటున్న యూనిఫాంపై స్పందిస్తూ టీ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుదన్నారు. కార్యక్రమంలో ఈడీ రవికుమార్, రీజనల్ మే నేజర్ ఎం.యేసుదానం, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(అర్బన్) సుధాబిందు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(రూరల్) కె.వెంకట్రావు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(అర్బన్) బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(రూరల్) అప్పలనారాయణ, వాల్తేర్ డిపో మేనేజర్ గంగాధర్‌తో పాటు పలు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కొలువుదీరిన కళాకృతులు ఆర్టీసీ బస్‌పై చక్కని ఆకృతులు, రమణీయ దృశ్యాలెన్నో సాక్షాత్కరిస్తున్నాయి. ‘అందాల కైలాసగిరి.. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు సిరి’, ‘ప్రకృతి ఒడిలో జీవన పోరాటం’, ‘భారతదేశ అన్నపూర్ణ .. మన ఆంధ్రప్రదేశ్’, ‘రైతే మన దేశానికి వెన్నెముక’, ‘డాల్ఫిన్ నోస్ .. విశాఖ సాగర తీర అద్భుతం’, బాపూ బొమ్మలు, చేనేత వస్త్రాల సోయగం, ‘ఉభయ గోదావరి పెన్నిధి..గోదావరి’, ‘అణువణువునా ప్రకృతి..అందమైన అనుభూతి’, ‘విహంగాల సోయగాలు.. కొల్లేటి సరస్సు’, ‘వివాహ భోజనంబు.. పసందైన వంటకాలు’, ‘అబ్దుల్ కలాం కలల కోట .. శ్రీహరికోట’, ‘పక్షి జాతులకు అలవాలం.. పులికాట్ సరస్సు’.. అరకు నృత్యం థింసా.. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రత్యేకతలు.. కళలు బస్సులపై కొలువుదీరుతున్నాయి. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు ప్రతి జిల్లాలో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి, వాటిలో ఉన్నత స్థానంలో నిలిచిన పెయింటింగ్‌లను బస్సులపై చిత్రీకరిస్తూ..పెయింటింగ్ వేసిన విద్యార్థి పేరు, స్కూల్ పేరు కూడా పెడతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ముఖ్యంగా డ్రీమ్ అ»ౌట్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై పెయింటింగ్స్ ఉంటాయన్నారు. అమరావతి సర్వీసులతో పాటు 14.5 మీటర్ల పొడవు గల 18 వోల్వో బస్సులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాటికి డాల్ఫిన్ నోస్‌పై ఆర్టీసీ ఎంబ్లెమ్‌తో కూడిన బొమ్మలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. -
48 అవర్స్ చాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘48 గంటల సినిమా తయారీ పోటీ’లను వైభవంగా నిర్వహించేందుకు గాను విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక షార్ట్‌ఫిల్మ్ తీయాలంటే మామూలుగా నిడివిని బట్టి తక్కువలో తక్కువ నెలరోజులైనా పడుతుంది. కానీ 48 గంటల్లో స్క్రిప్టు రాయడం, షూటింగ్, ఎడిటింగ్ లాంటివి పూర్తి చేసి సినిమా తీయడానికి తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ కొత్త ఒరవడికి తెరలేపింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా అనే కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఫిల్మోత్సవం.. : గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ఫిల్మోత్సవం పేరిట షార్ట్ ఫిలిం పోటీల ను నిర్వహిస్తున్నారు. ఈసారి అవతరణ ఫిల్మోత్స వాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్’ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్‌కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ మే 24 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మొదలై 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు ముగియనుంది. శుక్రవారం సాయంత్రం భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా క్యారెక్టర్ని వాడి 4 నుంచి 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. మే 27న పోటీదారుల జాబితాను వెల్లడిస్తారు. విజేతలను జూన్ 3న రవీంద్రభారతిలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు. ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం: తమ ప్రతిభను నిరూపించుకునేందుకు గాను ఔత్సాహిక సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని ఆసక్తి ఉన్న యువత అందరూ వినియోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, తమ ప్రతిభను మెరుగు పరచడానికి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. తద్వారా తమ ప్రతిభకు వారు మెరుగులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఔత్సాహిక సినిమా దర్శకులు 91 8919997465 నంబర్‌ను సంప్రదించవచ్చు. - మామిడి హరికృష్ణ,భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు -
స్వీటెత్తిన జనం..
సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భాగ్య నగరవాసులకు మధురానుభూతిని పంచాలని భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం అధికారులు ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. పరేడ్ మైదానం మూడురోజుల పాటు మిఠాయిలతో ఘుమఘుమలాడింది. వెరసి సిటీజనులు ఎంతో ఎంజాయ్ చేశారు. అధికారులు ఊహించిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా జనం తరలిరావటం విశేషం. దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. నోరూరించిన బెంగాలీ రసగుల్ల.. స్వీట్ ఫెస్టివల్లో తొలిరోజు 800 రకాలు ప్రదర్శించా రు. గంటన్నరలోనే 70 శాతం అమ్ముడు పోయా యి. రెండోరోజు 1000 రకాలు ఉంచారు. రాత్రి 9 గంటలకే అన్ని అమ్ముడు పోయాయి. చివరిరోజైన 15వ తేదీన 1200 రకాలు స్వీట్లు ఉంచారు. సాయంత్రం జనం ఒక్కసారిగా ఎగబడడంతో అవి కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ప్రధానంగా జాతీయ స్థాయి మిఠాయిల్లో కొంకణి స్వీట్లు, బీహార్ స్వీట్లు బాగా అమ్ముడు పోయా యి. బీహార్‌కి తెలంగాణ స్వీట్లకు దగ్గరి పోలిక ఉండటంతో నగరవాసులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రదర్శనలో ఉంచిన 74 రకాల పాయసాలు క్షణాల్లో అమ్ముపోయాయి. బెంగాలీ రసగుల్లలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇక అంతర్జాతీయంగా టర్కీ, కొరియా దేశాల స్వీట్లు అందరి మనస్సులను దొ చుకొన్నాయి. బూడిద గు మ్మడితో చేసిన స్వీట్ ప్ర జల ఫెవరేట్ కావటం విశేషం. దక్కన్ స్వీట్ల కోసం జనం క్యూ కట్టారు. హైదరాబాద్‌లో ఉ న్న బీహరీ, తమిళనాడు, మల యాళం, కర్ణాటక, కొంకణి సమాజా లు ఫెస్టివల్ విజయవంతంలో కీలకభూమిక పోషించాయి. 15వ తేదీ రాత్రి అంతర్జాతీయ పతంగుల పండగలో పాల్గొన్న కైట్ ప్లేయర్స్‌కి ప్లాజా హోట ల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఊహించని రీతిలో సందర్శకుల రాక.. 13 నుంచి 15 వరకు జరిగే స్పీట్ ఫెస్టివల్‌కు మూడు రోజులకు కలిపి లక్ష మంది జనం వస్తారని టూరిజం – సాంస్కృతిక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసు అధికారులు మందస్తుగా అడిగితే అదే సమాచారం అందించారు. కానీ పరిస్థితి మొదటి రోజే మారిపోయింది. ఊహించిరీతిలో తొలిరోజు ఇటు స్వీట్– కైట్ ఫెస్టివల్‌కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. రెండోరోజైన 14వ తేదీన ఏకంగా 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో సాయంత్రంలోగా పరేడ్ మైదానం జనస ం ద్రంగా మారింది. మూడోరోజు 2.50 లక్షల మంది హాజరవటంతో అధికారులు సైతం -
సంస్కృతిని బతికిస్తున్నది రచనే
టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పరిగి: నాటి నుంచి నేటి వరకు సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తూ వస్తున్నది రచనలేనని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలోని సత్యసాయి భవనంలో ఏర్పాటు చేసిన సాహితీ సమితి కార్యక్రమంలో వరకవుల జగన్నాధరాజు రచించిన పుండరీక చరిత్ర పద్యనాటకం పుస్తకాన్ని హరీశ్వర్‌రెడ్డితో పాటు ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కరయోగి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జయరాములు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ విజయమాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కవి, రంగస్థల నటుడు అయిన పుస్తక రచయిత వరకవుల జగనాధరాజును ఘనంగా సన్మానించారు. ఈ పుస్తకానికి ముందుమాట, ఇతివృత్తాన్ని భాస్కరయోగి వివరించగా ఆచార్యులు డాక్టర్ జయరాములు పుస్తక సమీక్ష గావించారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ..తల్లిదండ్రుల సేవ అన్నింటికంటే గొప్పది.. వారిని విస్మరించరాదనే ఇతి వృత్తంతో పద్యరచన చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలు, టీవీ షోలు నాటి సంస్కృతి సంప్రదాయాలను మరుగన పడేలా చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు సైతం టీవీ షోలకే బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కర యోగి మాట్లాడుతూ సమకాలీన అంశాలను అద్దంపట్టేలా వరకవుల జగన్నాధరాజు రచన సాగిందన్నారు. ఓ బస్టాండ్‌లో బిచ్చమెత్తుకునే వృద్ధులు తాము అడుక్కుని కొడుకులకు ఇవ్వకపోతే కొడతారని చెప్పిన మాటలకు చలించి ఈ రచన చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాటి పుండరీకుని చరిత్రి ప్రస్తుతం తల్లిదండ్రులను హింసించే పిల్లలకు తగ్గట్టుగా సరిపోతుందని తెలిపారు. అనంతరం ఈ పుస్తకాన్ని ప్రముఖ రంగస్థల నటుడు అయిన మాలెల అంజిలయ్యకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ సమితి పెద్దలు, నాయకులు కృష్ణయ్య, శ్రీశైలం, వీరకాంతం, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతురెడ్డి, భద్రప్ప, రంగాచారి, నర్సయ్య పాల్గొన్నారు. -
బతుకు భయం
కాంక్రీటు జంగిళ్లు కాబోతున్న పంట చేలు పనుల్లేక ఏమీ పాలుపోని కర్షక లోకం సమస్యలుగా మారిన కుటుంబ బాధ్యతలు గరీబులుగా మారుతున్న జరీబు రైతులు ఇదీ రాజధాని గ్రామాల్లో రేపటి చిత్రం పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదే శీయుల్లా తిరగాలి..! ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలో చిత విధానాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. రాజధాని గ్రామాల భవిష్యత్‌ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’ పొంచి ఉన్న పొల్యూషన్ ... రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య రహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు. సంస్కృతీ సంప్రదాయాలపై దాడి రాజధాని గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణ పనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముంబయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధించిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కష్టాలు రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసుల వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకొంటున్న ప్రభుత్వం రైతులు అంగీకార పత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. జగన్ రాక కోసం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’ అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృత్తి పనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి. భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్‌పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడ పాలి.. వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి. నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పూలు, కూరగాయలు, పాలను విజయ వాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు. - సాక్షి ప్రతినిధి, గుంటూరు ముంపు వచ్చినా.. నష్టం రాలేదు నాకున్న 80 సెంట్ల పొలంతో పాటు, మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. నా 80 సెంట్లు కొండవీటి వాగులో మునిగిపోయినా, పంట నష్టం వచ్చినా, నేను కౌలుకు చేస్తున్న 3 ఎకరాల్లో లక్షా50వేల రూపాయలు ఆదాయం వస్తుంది. కుటుంబ పోషణతో పాటు పిల్లలను చదివించుకుంటున్నాను. భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. - మన్నం హనుమంత రావు చౌదరి, కౌలు రైతు, పెనుమాక పూలుకోయడం తప్ప మరే పనీ తెలియదు మేం తరతరాల నుంచి పొలాన్నే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పిల్లలకు వంట చేసి క్యారేజీలు పెట్టుకుని వస్తాం. రోజుకు నాలుగైదు వందలు సంపాదిస్తాం. పిల్లలను చదివించుకుంటున్నాం. మాకు రుణమాఫీ వద్దు, డ్వాక్రా రుణాలు వద్దు మా భూములను వదిలిపెడితే చాలు. - గౌరుబోయిన జయమ్మ, బేతపూడి పూలతోటతోనే మా బతుకు పూలతోటలో కూలికి వెళ్తే వచ్చే సంపాదనపై ఆరుగురం బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా ఇబ్బందైతే రైతులు ఆదుకుంటారు. ఎందుకంటే.. మళ్లీ కూలీ చేసైనా తీరుస్తామని వారికి నమ్మకం. వారి పొలాలే పోతే మమ్మల్ని ఎలా ఆదుకుంటారు. రెండు రోజులుగా గ్రామంలో రైతులు భయపడి భూములను ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తు ఏంటో తెలియడం లేదు. - సంకూరు సబ్బులు, రైతు కూలీ, నిడమర్రు ఇప్పుడెలా? రైతులు భయపడి పొలాలను ఇచ్చేశారు. ఉదయం నాలుగు గంటలకు లేచి వంట చేసుకుని వచ్చి కూలీ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. వచ్చే నెల నుంచి ఏం చేసి బతకాలో తెలియడం లేదు. - పార్వతి, రైతు కూలీ, కురగల్లు -
సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి
సంక్రాంతి సంబరాలలో ఆర్డీఓ వినాయకం చాపాడు: సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం పేర్కొన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞాన భారతీ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ఆదివారం సంక్రాంతి సంబరాలను జరిపారు. ఈ సంబరాలకు హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాస్తవికత ఉంటుంద న్నారు. వీరి వల్లనే ఇంకా సంస్కృతి, సంప్రదాయాలు బతికి ఉన్నాయన్నారు. అనంతరం పలువురు వక్తలు సంక్రాంతి సంబరాల విశిష్టతపై ప్రసంగించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పలు రకాల క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి, రూరల్ సీఐ పురుషోత్తమరాజు, ఎస్ఐ గిరిబాబు, ప్రొద్దుటూరు వైవీయూ ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కళ: మూడు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే విధంగా చాపాడు సమీపంలోని సీబీఐటీ-వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆది వారం గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రైతులుగా.. అల్లరి చే సే కొంటెవాళ్లుగా.. సంప్రదాయ వస్త్రాలతో అచ్చతెలుగు ఆడపడుచుల్లా.. హరిదాసుల్లా.. ఇలా వివిధ వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. -
మీరు సంగీత ప్రియులు
‘మార్వాడీ, గుజరాతీ, హిందీ... భిన్నత్వంలో ఏకత్వం హైదరబాద్‌లో కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. అందుకే ‘హైదరాబాద్ ఈజ్ గ్రేట్’ అన్నారు ఇండియన్ ఐడల్ ఫేం విశాల్, బాలీవుడ్ గాయకులు అర్చనా మహాజన్, సుచిత్ర, నిగమ్ రాథోడ్ల. శంషాబాద్ మల్లిక గార్డెన్లో గురువారం నుంచి నిర్వహించే ‘దిల్దార్ దాండియా’లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా కాసేపు వారు మీడియాతో ముచ్చటించారు. ‘హైదరాబాదీలు సంగీత ప్రియులు. దాండియాతో దుమ్ము రేపి వారిని అలరించడానికి సిద్ధమయ్యాం. దిల్దార్ దాండియా నిర్వహించడం సిటీలో ఇదే మొదటిసారి. అందుకే ఇక్కడివారికి మరుపురాని దాండియా అనుభూతిని మిగిల్చేలా ఉంటుందీ కార్యక్రమం. మహిళలకు ప్రవేశం ఉచితం’ అని చెప్పారు. - శంషాబాద్ -
సంస్కృతీ సంప్రదాయాల ‘గోపురం’!
ఆచారాలు బోలెడుంటాయి. అవి ఎందుకొచ్చాయో మనకి తెలీదు. సంప్రదాయాలను బాగానే పాటిస్తాం. కానీ ఎందుకు పాటించాలి, ఏ విధంగా పాటించాలి అన్న అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెబుతున్నారని కొందరు, అందరూ పాటిస్తున్నారని కొందరు పాటించేస్తూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు బుర్రలో బోలెడన్ని సందేహాలు పుట్టుకొస్తుంటాయి. వాటన్నిటినీ తీర్చడానికి రూపొందించిందే ‘గోపురం’ కార్యక్రమం. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సంస్కృతీ సంప్రదాయాల చుట్టూ తిరుగుతుంది. డా॥సంధ్యాలక్ష్మి వివరణ ద్వారా మనం పాటించే సంప్రదాయాల వెనుక ఉన్న కథలు తెలుస్తాయి. మన విధి విధానాల్లోని పొరపాట్లు అవగతమవుతాయి. కొన్ని కొత్త విషయాలు బోధపడతాయి. సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చే వారికి నచ్చే కార్యక్రమమిది. -
హిందీతో ఉజ్వల భవిష్యత్తు
అప్‌కమింగ్ కెరీర్ : ఆంగ్లంలో ‘లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ లైక్ లెర్నింగ్ ఏ కల్చర్’ అని నానుడి ఉంది. అంటే ‘ఒక భాషలో ప్రావీణ్యం సంపాదిస్తున్నామంటే మనం ఆ భాషకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకుంటున్నట్లే’ అని అర్థం. ఇది నేటి తరానికి చక్కగా వర్తిస్తుంది. మనదేశంలో ఆంగ్లం తర్వాత అత్యధిక ఆదరణ పొందుతున్న భాష హిందీ. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఇది అనుసంధాన భాషగా పనిచేస్తోంది. ఇప్పటివరకూ సాహిత్య, పరిశోధన రంగాల్లో రాజ్యమే లిన ఆంగ్లభాషకు ధీటుగా..నేడు అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు, వివిధ రంగాల్లో పరిశోధకులు నేరుగా హిందీలోనే తమ రచనలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. హిందీతో ఉజ్వల భవిష్యత్తు హిందీని చదవడం, రాయడం, మాట్లాడం వంటి వాటిపై పట్టు సాధించినవారికి నేడు అవకాశాలు అనేకం. ఈ భాషలో మంచి ప్రావీణ్యం ఉంటే.. సాహిత్యంలోనే కాకుండా మీడియా, అనువాద రంగాల్లోనూ రాణించొచ్చు. అటు ఐటీ రంగంలోనూ హిందీకి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగా హిందీలో సాఫ్ట్వేర్ రూపకల్పన జరుగుతోంది. అడ్వర్టైజింగ్ రంగంలో స్క్రిప్ట్ రైటర్స్, స్లోగన్ రైటర్స్‌గా, జింగిల్ రైటర్స్‌గా నేడు అనేక మంది పనిచేస్తున్నారు. కోర్సులు - ఉద్యోగ అవకాశాలు ఎంఏ హిందీ(ఫంక్షనల్ హిందీ) ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లలో ఉద్యోగ అవకాశాలుంటున్నాయి. ఆయా విభాగాల్లో ట్రాన్స్లేటర్లుగా పనిచేయొచ్చు. ఎంఏ (హిందీ), బీఈడీ చేసినవారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరొచ్చు. ఇంటర్, 10+2 విద్యార్థులకు బోధించవచ్చు. ఎంఏ(హిందీ జర్నలిజం) చేసిన వారికి న్యూస్‌పేపర్లు, వార్తా చానళ్లు, సినిమా, హిందీ వెబ్‌సైట్స్ లాంటి రంగాలో అవకాశాలు పుష్కలం. నైపుణ్యం పెంచుకోవాలి కేవలం హిందీ భాషలో డిగ్రీలు ఉంటే సరిపోదు. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి. ఏ విభాగంలో పనిచేయాలన్నా.. ఉచ్ఛారణ సరిగా ఉండాలి. దోషాలు లేకుండా రాయగ లగాలి. సమకాలీన సమస్య లను, పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకుని, చక్కగా విశ్లేషించ గలగాలి. తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఆసక్తి పెంచుకొని, పూర్తిస్థాయి అవగాహన పొందాలి. అలాంటి వారికి అవకాశాల ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయి. కోర్సులను అందిస్తున్న ముఖ్య సంస్థలు హిందీలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేడు అనేక విద్యాసంస్థలు బీఏ, బీఏ(హానర్స్), ఎంఏ లాంటి కోర్సులను అందిస్తున్నాయి. వాటితోపాటు పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్, పీజీ డిప్లొమా ఇన్ హిందీ జర్నలిజం కోర్సులను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్‌యూ - న్యూఢిల్లీ బెనారస్ హిందూ వర్సిటీ అలహాబాద్ యూనివర్సిటీ పాట్నా యూనివర్సిటీ ఎంజీ అంతరాష్ర్ట హిందీ విశ్వవిద్యాలయ లక్నో యూనివర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీడియా రంగంలో అవకాశాలు కెరీర్ కోసమే ఆలోచించకుండా రాష్ట్రీయ భాషగా నేర్చుకోవాల్సిన భాష హిందీ. ఇటీవల ఐటీ, మీడియా రంగంల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. వ్యాపార, కార్పొరేట్ రంగాల్లోనూ హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేసేందుకు నిర్వహించే ఇంటర్వ్యూల్లోనూ డిగ్రీలో ఎంపిక చేసుకున్న లాంగ్వేజెస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. డీటీపీ, ట్రాన్సలేటర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగాలున్నాయి. ఇటీవల వెబ్సైట్లనూ హిందీలో ప్రారంభించారు. టూరిజం డిపార్ట్మెంట్లో గైడ్లుగా వ్యవహరించ వచ్చు. డిగ్రీలో కేవలం ఓ సబ్జెక్టుగా ఆగిపోకుండా ఉన్నతవిద్య దిశగా అడుగులేస్తే కెరీర్లో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది. - డాక్టర్ బి.వాణి, ప్రిన్సిపాల్, సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ -
విభిన్నం.. వినూత్నం
పండుగలొస్తే చాలు ఆయన కుంచె రంగుల్లో తలమునకలవుతుంది. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే చిత్రాలను తీర్చిదిద్దుతుంది. భాగ్యనగర సంస్కృతిని కొలోగ్రఫీ చిత్రాలతో కళ్లకు కడుతున్న కళాకారుడు మడిపడగ శ్రీకాంత్ ఆనంద్. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్‌లో బీఎఫ్ఏ పూర్తిచేసి, కొలోగ్రఫీలో నైపుణ్యం సాధించిన శ్రీకాంత్‌కు తండ్రి నుంచి కళా వారసత్వం అబ్బింది. కళాసిగూడకు చెందిన బలరామాచార్య కుమారుడైన శ్రీకాంత్, బాల్యంలో తండ్రి వేసే చిత్రాలను చూస్తూ కళపై అభిరుచి పెంచుకున్నారు. శ్రీకాంత్ తండ్రి బలరామాచార్య 1975లో ప్రపంచ తెలుగు మహాసభల లోగోను చిత్రించారు. వుడ్‌కట్, కొలాజ్, కొలోగ్రఫీ, లినోకట్ వంటి విభిన్న శైలుల్లో ఇప్పటికే ఆరువేలకు పైగా చిత్రాలను వేశారు. వినాయక నవరాత్రుల్లో ఆయన వేసిన వినాయకుని కొలోగ్రఫీ చిత్రాలు నగర వాసుల ప్రశంసలు పొందాయి. దసరా, దీపావళి, బోనాలు, రంజాన్, క్రిస్మస్... ఎలాంటి పండుగ వాతావరణాన్నయినా శ్రీకాంత్ సునాయాసంగా బొమ్మకడతారు. మహిళలపై అఘాయిత్యాలు వంటి సామాజిక సమస్యలపై కూడా చిత్రాలు గీశారు. ఏటా ఆగస్టు 11న తండ్రి జన్మదినం సందర్భంగా బలరామాచార్య గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి యేడూ రాజ్యశ్రీ-బలరామ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొలాజ్ చిత్ర ప్రదర్శనా నిర్వహిస్తున్నారు. అవార్డులు 1994: విశాఖ లలిత కళా అకాడమీ ప్రదర్శనలో కొలోగ్రఫీ ప్రదర్శనకు అవార్డు 1998: ఫ్యామిలీ ప్లానింగ్ సొసైటీ నిర్వహించిన బిగ్ ఫ్యామిలీ ఆర్ట్ వర్క్‌కు అవార్డు 2006: న్యూఢిల్లీ ‘కళామఠ్’ ప్రదర్శనలో దుర్గ చిత్రానికి అవార్డు 2007: తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనలో సంక్రాంతిపై గీసిన చిత్రానికి అవార్డు 2009: ‘నిన్న నేడు రేపు’ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గీసిన చిత్రానికి విశాఖ లలిత కళా అకాడమీ ప్రదర్శనలో ఉత్తమ చిత్రం అవార్డు - ఎం.తిరుపతి