హిందీతో ఉజ్వల భవిష్యత్తు | Learning a language is like learning a culture | Sakshi
Sakshi News home page

హిందీతో ఉజ్వల భవిష్యత్తు

Published Tue, Aug 5 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

హిందీతో ఉజ్వల భవిష్యత్తు

హిందీతో ఉజ్వల భవిష్యత్తు

అప్‌కమింగ్ కెరీర్ : ఆంగ్లంలో ‘లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ లైక్ లెర్నింగ్ ఏ కల్చర్’ అని నానుడి ఉంది. అంటే ‘ఒక భాషలో ప్రావీణ్యం సంపాదిస్తున్నామంటే మనం ఆ భాషకు  సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు  నేర్చుకుంటున్నట్లే’ అని అర్థం. ఇది నేటి తరానికి చక్కగా వర్తిస్తుంది.  మనదేశంలో  ఆంగ్లం తర్వాత అత్యధిక ఆదరణ పొందుతున్న భాష హిందీ. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఇది అనుసంధాన భాషగా పనిచేస్తోంది. ఇప్పటివరకూ సాహిత్య, పరిశోధన రంగాల్లో రాజ్యమే లిన ఆంగ్లభాషకు ధీటుగా..నేడు అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు, వివిధ రంగాల్లో పరిశోధకులు నేరుగా హిందీలోనే తమ రచనలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు.
 
 హిందీతో ఉజ్వల భవిష్యత్తు
 హిందీని చదవడం, రాయడం, మాట్లాడం వంటి వాటిపై పట్టు సాధించినవారికి నేడు అవకాశాలు అనేకం. ఈ భాషలో మంచి ప్రావీణ్యం  ఉంటే.. సాహిత్యంలోనే కాకుండా మీడియా, అనువాద రంగాల్లోనూ రాణించొచ్చు. అటు ఐటీ రంగంలోనూ హిందీకి  ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగా హిందీలో సాఫ్ట్‌వేర్ రూపకల్పన జరుగుతోంది.  అడ్వర్‌టైజింగ్ రంగంలో స్క్రిప్ట్ రైటర్స్, స్లోగన్ రైటర్స్‌గా, జింగిల్ రైటర్స్‌గా నేడు అనేక మంది పనిచేస్తున్నారు.
 
 కోర్సులు - ఉద్యోగ అవకాశాలు
 ఎంఏ హిందీ(ఫంక్షనల్ హిందీ) ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లలో ఉద్యోగ అవకాశాలుంటున్నాయి. ఆయా విభాగాల్లో ట్రాన్స్‌లేటర్లుగా పనిచేయొచ్చు. ఎంఏ (హిందీ), బీఈడీ చేసినవారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరొచ్చు. ఇంటర్, 10+2 విద్యార్థులకు బోధించవచ్చు. ఎంఏ(హిందీ జర్నలిజం) చేసిన వారికి  న్యూస్‌పేపర్లు, వార్తా చానళ్లు, సినిమా, హిందీ వెబ్‌సైట్స్ లాంటి రంగాలో అవకాశాలు పుష్కలం.
 
 నైపుణ్యం పెంచుకోవాలి
 కేవలం హిందీ భాషలో డిగ్రీలు ఉంటే సరిపోదు. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి. ఏ విభాగంలో పనిచేయాలన్నా.. ఉచ్ఛారణ సరిగా ఉండాలి. దోషాలు లేకుండా రాయగ లగాలి. సమకాలీన సమస్య లను, పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకుని, చక్కగా విశ్లేషించ గలగాలి. తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఆసక్తి పెంచుకొని, పూర్తిస్థాయి అవగాహన పొందాలి. అలాంటి వారికి అవకాశాల ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయి.
 
 కోర్సులను అందిస్తున్న ముఖ్య సంస్థలు
 హిందీలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేడు అనేక విద్యాసంస్థలు బీఏ, బీఏ(హానర్స్), ఎంఏ లాంటి కోర్సులను అందిస్తున్నాయి. వాటితోపాటు పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్, పీజీ డిప్లొమా ఇన్ హిందీ జర్నలిజం కోర్సులను నిర్వహిస్తున్నాయి.
 
  ప్రముఖ యూనివర్సిటీలు
  ఉస్మానియా యూనివర్సిటీ
  జేఎన్‌యూ - న్యూఢిల్లీ
  బెనారస్ హిందూ వర్సిటీ
  అలహాబాద్ యూనివర్సిటీ
  పాట్నా యూనివర్సిటీ
  ఎంజీ అంతరాష్ర్ట హిందీ విశ్వవిద్యాలయ
  లక్నో యూనివర్సిటీ
  మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం
  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 
 మీడియా రంగంలో అవకాశాలు
 కెరీర్ కోసమే ఆలోచించకుండా రాష్ట్రీయ భాషగా నేర్చుకోవాల్సిన భాష హిందీ. ఇటీవల ఐటీ, మీడియా రంగంల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. వ్యాపార, కార్పొరేట్ రంగాల్లోనూ హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేసేందుకు నిర్వహించే ఇంటర్వ్యూల్లోనూ డిగ్రీలో ఎంపిక చేసుకున్న లాంగ్వేజెస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. డీటీపీ, ట్రాన్‌‌సలేటర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగాలున్నాయి. ఇటీవల వెబ్‌సైట్లనూ హిందీలో ప్రారంభించారు. టూరిజం డిపార్ట్‌మెంట్‌లో గైడ్‌లుగా వ్యవహరించ వచ్చు. డిగ్రీలో కేవలం ఓ సబ్జెక్టుగా ఆగిపోకుండా ఉన్నతవిద్య దిశగా అడుగులేస్తే కెరీర్‌లో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది.    
- డాక్టర్ బి.వాణి, ప్రిన్సిపాల్,  
 సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement