తెలుగుపై ఫ్రెంచి వెలుగు | Daniel negers has introduced telugu to french people | Sakshi
Sakshi News home page

తెలుగుపై ఫ్రెంచి వెలుగు

Published Thu, Aug 14 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

తెలుగుపై ఫ్రెంచి వెలుగు

తెలుగుపై ఫ్రెంచి వెలుగు

భాషా పరిశోధకుడు:  డానియల్ నేజెర్స్.. ఫ్రాన్స్ దేశస్థుడు! కానీ.. తెలుగులో ఛందోబద్ధ పద్యాలనూ అవలీలగా చదవగలరు. అంతే అందంగా.. అంతకన్నా అర్థవంతంగా ఫ్రెంచ్‌లోకి అనువదించగలరు. ఇప్పుడు గిరిజన పాటలనూ ఫ్రెంచ్ అక్షరాల్లో పొదగడానికి ప్రయత్నిస్తున్నారు! ఈ తపన లక్ష్యం.. ఫ్రాన్స్‌కి తెలుగు గొప్పదనాన్ని పరిచయం చేయడమే అంటారు. అచ్చ తెలుగులో ‘సిటీప్లస్’తో ఆయన ఎన్నో భావాలు పంచుకున్నారు.
 - సరస్వతి రమ
 
 మా ప్రొఫెసర్ ఒలివ్యే ఎరెంజ్‌మిత్ గురువు గారు లూజ్యుమో ఆంధ్రలో గడిపారు. మా ప్రొఫెసర్ కూడా తెలుగునేలపై కొంతకాలం ఉన్నారు. ఆ శిష్యపరంపరలో నేనూ ఉన్నాను. థియరిటికల్‌గా ఇతర భాషాసంస్కృతులకు సంబంధించి కొంత వర్క్ చేయాలనిపించింది. ఆ అంశం మీదే ఎంఫిల్ చేయాలనుకున్నాను. దీనికి సంబంధించి మా గురువుగారు ఒలివ్యేని సలహా అడిగితే తెలుగుభాష మీద చేయమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం వెళ్లమని సూచించారు. ఆయన మాటతో 1983లో నా భార్యతో సహా పెద్దాపురం వెళ్లాను. తెలుగుతో నా అనుబంధం అలా మొదలైంది. అక్కడే తెలుగు నేర్చుకుని సాహిత్యం చదవడం ప్రారంభించా! తర్వాత పీహెచ్‌డీ కోసం ఫ్రాన్స్ వెళ్లిపోయాను. అయినా తెలుగు నేర్చుకోవడం మానలేదు. 1986లో బుర్రకథలు, జానపద కళారూపాల మీద రీసెర్చ్ చేయడానికి ఇండోఫ్రెంచ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద కుటుంబంతో సహా మళ్లీ పెద్దాపురం వచ్చాను. అప్పటికి మాకు ఐదు నెలల బాబు.
 
 తెలుగు.. ఫ్రెంచ్ నిఘంటువు
 పెద్దాపురంలో పరిశోధన పూర్తయ్యాక తిరిగి పారిస్ వెళ్లి అక్కడ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగంలో కుదురుకున్నాను. కానీ నా మనసంతా తెలుగు మీదే. ఈ తియ్యని భాష మీద పూర్తి పట్టు సాధించాలనే తపన నన్ను మళ్లీ ఇక్కడకు రప్పించింది. ఈసారి మజిలీ హైదరాబాద్ అయింది. నేరుగా హిమాయత్‌నగర్‌లో ఉన్న తెలుగు అకాడమీకి వెళ్లాను. ఆ సమయంలో ఆవుల మంజులత డెరైక్టర్‌గా ఉన్నారు. నా ఆసక్తి గమనించిన ఆమె ‘తెలుగు - ఫ్రెంచ్’ నిఘంటువు రూపొందిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. తొలుత వద్దనుకున్నా.. మా ప్రొఫెసర్ ప్రోత్సాహంతో.. నిఘంటువు పని మొదలు పెట్టాను. 2005 వరకు సాగిన ప్రయత్నంలో తెలుగు కన్నా ఫ్రెంచ్ పదసంపదే ఎక్కువ నేర్చుకున్నాను(నవ్వుతూ).
 
 భాష.. సంస్కృతి..
 ఓ రీసెర్చ్ సంస్థ తరఫున పరిశోధన కోసం నేను మరోసారి పెద్దాపురం వెళ్లాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. ఆరోగ్యం బాగోలేక పారిస్ వెళ్లిపోయాను. అదే సమయంలో పారిస్‌లోని ప్రాచ్యభాష, నాగరికతల జాతీయ సంస్థ నాకు జాబ్  ఆఫర్ చేసింది. దక్షిణాసియా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా! హిందీ, బెంగాలీ, తమిళం, సింహళ, నేపాలీ, టిబెటన్ భాషలకు శాఖలున్నాయి. తెలుగు శాఖ స్థాపన కోసం నన్ను పిలిచారు. నాతో పాటు కన్నెగంటి అనురాధ అనే తెలుగావిడ కూడా పనిచేస్తున్నారు. తెలుగులో ఉన్న పదసంపత్తి, సాహిత్య ప్రక్రియలను ఫ్రెంచ్‌లోకి అనువదించడం.. వాటిని నేర్పే పద్ధతిని రూపొందించడం మా పని. ఈ క్రమంలో నాకొచ్చిన తెలుగు చాలా తక్కువని అర్థమైంది.
 
 భాషా సంపత్తిని పెంచుకోవడానికి యానాం దగ్గరున్న సాలగ్రామ రాధాకృష్ణ      జగన్నాథ గురువుగా మారి సహాయం చే స్తున్నా రు. ఈ ప్రక్రియలో నావి రెండు లక్ష్యాలు. తెలుగులో ఉన్న పదాలకు ఫ్రెంచ్‌లో సమానార్థకాలను వెదకడం ఒకటి.. తెలుగు భాష, సంస్కృతిని గొప్పదనాన్ని చాటడం రెండోది. అందుకే అనువాదం కన్నా అనుసృజన  మీద దృష్టి పెడుతున్నాను. బుర్రకథలు, గురజాడ, కందకూరి, రాయప్రోలు రచనలతో పాటు జానపదాలనూ ఫ్రెంచ్‌లో అనువదించాను. వేమన పద్యాలనూ ఫ్రెంచ్‌లో అనువదిస్తున్నా.  చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలను.. అమరావతి కథలు, దాట్ల దేవదానంరాజు యానాం కథలనూ ఫ్రెంచ్‌లోకి అనువదిస్తున్నాను.
 
 గిరిజన పాటలు
 జయధీర్ తిరుమలరావు నాకు మంచి స్నేహితుడు. ఆయన్ని ఒకసారి కలిసినప్పుడు .. ‘గిరిజనుల పాటలనూ మీరు అనువాదం చేయాలి’ అని అడిగారు. ఆయన వినిపించిన పాటలు నన్ను కదిలించాయి. వెంటనే అనువాదం ప్రారంభించాను. ఆ ప్రక్రియ మొదలై నాలుగురోజులే అయింది. నాలుగు పాటలు అనువదించాను.
 
 లేతపసుపు హెదరాబాద్..
 నేను ఫస్ట్ టైమ్ 1976లో స్టూడెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చాను. ఇస్తాంబుల్ నుంచి సముద్రయానం, బై రోడ్ ఇండియా వచ్చాను. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో పర్యటించాను యాజ్ ఎ టూరిస్ట్‌గా. అప్పుడు.. హైదరాబాద్ లేత పసుపు రంగులో భలే ముద్దొచ్చింది. అప్పటి హైదరాబాద్‌ను నేనెప్పుటికీ మరిచిపోలేను. ఇక్కడ నాకు బాగా నచ్చిన ప్లేసెస్..అబిడ్స్, చార్మినార్! ఎప్పుడొచ్చినా అబిడ్స్‌లోని సిద్ధార్థ హోటల్లో బసచేసేవాడిని. తాజ్‌మహల్ హోటల్‌లో భోజనం చేసేవాడిని. నా భార్యకు కూడా ఇక్కడి వంటలు ఎంతో ఇష్టం. నా కొడుక్కిప్పుడు 28 ఏళ్లు. డాక్టర్. వాడిప్పటికీ ఇక్కడి రుచులంటే ఆహా అంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement