అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి | development and welfare | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి

Published Fri, Jan 9 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి

అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి

 సమగ్ర కుటుంబ సర్వే తేల్చిన వాస్తవాలు
  దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం పట్టింది. అది ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి  దిశా నిర్దేశన చేయడమే కాదు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉన్నాయి. నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని సర్వే నిగ్గు తేల్చింది. ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

 సమగ్ర కుటుంబ సర్వే... తెలంగాణ సామాజిక స్వభావాన్ని ఒక్క రోజులో అద్దం పట్టి చూపేందుకు చేసిన బృహత్ యత్నం. ఒక్క హైదరాబాద్ మినహా కాస్త అటూ ఇటుగా తెలంగాణ జన జీవితాన్ని సర్వే ఫలితాలు ప్రతి బింభించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తెలంగాణ రాష్ట్రం ‘స్వయం నిర్ణయం - అర్హులకే సంక్షే మం’ లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ధనిక, పేద తేడాలు లేకుండా వీధి, పల్లె, పట్నం, నగరం ప్రతిచోటా సాగింది. గత అంచనాలకు కాలదోషం పట్టిం చిన ఈ సర్వే వాస్తవికతకు అతి దగ్గరగా ఉన్న తాజా అంచనాలను ప్రభుత్వం చేతుల్లో ఉంచింది. తెలంగాణ జనాభాలో బీసీ కులాలు 51.08%, బీసీ కులాలు 112%, ఉన్నత కులాలు 21.50%, దళితులు 17.50%, గిరిజను లు 9.91%, మైనారిటీలు 14.46%గా ఈ సర్వే తేల్చింది. అంతేకాదు దళితుల్లోని 56 ఉప కులాలు, గిరిజనుల్లోని 16 తెగలు, మైనారిటీల స్థితిగతులను సైతం వివరంగా వెల్లడించింది. ఈ వివరాలన్నీ అప్పుడే సర్కారు లెక్క ల్లోకి చేరిపోయాయి. కొత్త రాష్ట్రం సరికొత్త లక్ష్యంతో ముందుకు సాగడానికి సమగ్ర కుటుంబ సర్వే తాజా అంచనాలు సోపానాలు కాగలుగుతాయనడంలో సందే హం లేదు. కాకపోతే సర్వే తిరుగులేని విధంగా తేల్చి చెప్పినట్టుగా ప్రజలకు ప్రధానంగా కావాల్సింది భూమి, నీళ్లు, నీడ, ఉపాధులేనని గుర్తించి వాటిని కేంద్రంగా చేసుకుని పక్కాగా పథక రచన చేసి, తగు కేటాయిం పులు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. అదే జరిగితే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం సు సాధ్యమే అవుతుంది. సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యమూ నెరవేరుతుంది.  

 వెనుకబడిన తరగతులు సగానికి పైగానే  
 రాష్ట్ర జనాభా 3.63 కోట్లుగానూ, అందులో సగానికిపైగా వెనుకబడిన తరగతుల వారేనని (బీసీలు) సర్వే తేల్చిం ది.  మొత్తం బీసీల జనాభా 1,85,61,856 లక్షలు (51.08%). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 136 బీసీ కులాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అవి 112 కులాల కు తగ్గాయి. ఇంత పక్కాగా బీసీల జనాభా తేల్చటం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల్లో తెలంగాణలోని ఎస్సీల జనాభా 15.44%గా నమోదు కాగా, తాజా సర్వేలో అది 17.50% శాతమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలలో 62 ఉప కులాలుండగా, తెలంగాణలో అవి 56 ఉప కులాలకు తగ్గాయి. మొత్తం ఎస్సీల జానాభా 63,60,158 (17.50%). 2011 లెక్కల్లో గిరిజన జనాభా 9.34%గా ఉండగా, ఈ సర్వేలో అది 9.91%గా నమోదయింది. ఉమ్మడి రాష్ట్రంలో 36 గిరిజన తెగలుండగా, కొత్త రాష్ట్రంలో 16 గిరిజన తెగలు మాత్రమే ఉన్నాయి. తాజా సర్వేలో తెగల వారీ లెక్కలు తేలటంతో వారి అభివృద్ధికి, సంక్షేమానికి  బడ్జెట్ కేటాయింపులు చేసి, సూక్ష్మ స్థాయి ప్రణాళికలను అమలుపరచే అవకాశం లభించింది.  

  ‘భూమి’ చుట్టూ తిరిగిన సర్వే
 ఈ సర్వే ఫలితాలన్నీ ప్రధానంగా భూమి చుట్టే తిరిగాయి. తెలంగాణ పది జిల్లాల్లో గుంటెడు సాగు భూమి కూడా లేని కుటుంబాల సంఖ్య 69.19 లక్షలు (మొత్తం కుటుంబాలు 1,01,93,027). అంటే సాగు భూమి 31 శాతం మందికే పరిమితమైందని తేలింది. వీరిలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలు 9.67 లక్షలు. ఒకటి నుంచి రెండెకరాలలోపు 6.83 లక్షలు, 2-3 ఎకరాల మధ్య 5.73 లక్షలు, 3-4 ఎకరా మధ్య 3.62 లక్షలు, 4-5 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాలు 3 లక్షలున్నాయి. 6.84 లక్షల కుటుంబా లకు ఐదెకరాలకుపైగా  భూములున్నాయి.

 బోర్లు, బావులే సేద్యానికి ప్రాణాధారం
 తెలంగాణలో బోర్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 69.13 లక్షల ఎక రాల్లో సేద్యం సాగుతుండగా, అందులో 28.49 లక్షల ఎకరాలకు బోర్లు, 15.85 లక్షల ఎకరాలకు బావులే దిక్కు. కృష్ణా, గోదావరి, మూసీ కాల్వలతో సాగవుతు న్నది కేవలం 8.97 లక్షల ఎకరాలే. రాష్ట్రంలో అత్య ధికంగా మహబూబ్‌నగర్‌లో 11.08 లక్షల ఎకరాలు సాగవుతుండ గా అందులో 6.24 లక్షల ఎకరాలకు బోరు నీళ్లే ఆధారం. ఇక బావుల నీటితో సేద్యం చేసే జిల్లాల్లో కరీంనగర్‌ది మొదటి స్థానం (5.36 లక్షల ఎకరాలు). నాగార్జునసాగర్ ఎడమకాలువ సాగునీరు అందే జిల్లాల్లో నల్లగొండ (2.27 లక్షల ఎకరాలు) తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. బోరు బావుల సేద్యంలో (4.14 లక్షల ఎకరాలు) ఈ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రైతాంగ జీవనం వర్షాధారమేనని స్పష్టమైంది. కాబట్టి భారీ నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాలతో పాటు బోర్లు, బావులకు సరిపడా విద్యుత్తును అందించడం తెలంగాణ ప్రభుత్వం ముందు అతి పెద్ద సవాలుగా నిలుస్తోంది.

 అందరికీ గూడు అందరాని కలగానే...
 రాష్ట్రంలో 1,01,93,027 కుటుంబాలుండగా వారిలో 24,90,594 మందికే పక్కా ఇళ్లు ఉన్నట్లు (24%) సర్వేలో తేలింది.  మిగతా వారిలో 24,58,341 కుటుంబాలు (24%) అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. మొత్తం కుటుంబాల్లో 44%, అంటే 45,02,101 కుటుంబాలు ఒకే గది ఇంట్లో నివసిసున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల న్నిట్లో మొత్తం 3,24,312 కుటుంబాలవి ప్లాస్టిక్ పైక ప్పున్న తాత్కాలిక నివాసాలే. పెంకు లేదా రాతి పైకప్పు ఉన్న ఇళ్లలో 7,41,492 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,49,462 కుటుంబాలు కరెంటు సదు పాయానికి నోచుకోక,  కిరోసిన్ దీపాల మసక వెలుతు రులోనే వెళ్లదీస్తున్నాయి. కరెంట్ సదుపాయం లేని కుటుంబాలు అధికంగా నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 41% కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 42,10,019 కుటుంబాలకు ఆ సదుపాయం లేకపోవడం గమనార్హం. మరుగుదొడ్ల సదుపాయం లేని జిల్లాల్లో వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలు ముందు నిలిచాయి. మెట్రోపాలిటన్ నగరంగా చెప్పు కుంటున్న హైదరాబాద్‌లో కూడా ఇప్పటికీ 45,901 కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేకపోవడం మింగుపడని చేదు వాస్తవం.

 చెలిమె నీళ్లతో గొంతు తడపాల్సిందే
 అందరికీ తాగునీరు అత్యధికులకు అందని ఎండమా విగానే నేటికీ మిగిలిందన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని సర్వే బయటపెట్టింది. రాష్ట్రంలోని 69% ప్రజలు మంచి నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో 1.83 లక్షల కుటుంబాల దాహార్తిని తీర్చేవి చెలిమ నీళ్లేననేది నమ్మలేని నిజం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే నల్లా నీళ్లు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 4.14 లక్షల కుటుంబాలు తాగునీటికి బావులపైన, 9.40 లక్షల కుటుంబాలు చేతిపంపులపైన ఆధారపడుతున్నాయి. 3.43 లక్షల కుటుంబాలు బోర్లు, మరో 8.16 లక్షల కుటుంబాలకు బావులే దాహం తీరుస్తున్నాయి. 4.48 లక్షల కుటుంబాలు మంచి నీటి క్యాన్లను కొనుక్కొని గడుపుకుంటున్నాయి.  

 కుటుంబ పెద్దగా ‘ఆమె’  
 కుటుంబంలో మహిళల ప్రాధాన్యం క్రమంగా పెరుగు తున్న పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. 18,48,208 లక్షల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవ హరిస్తున్నట్లు తాజా సర్వే నిగ్గు తేల్చింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో మహిళలు 2.47 లక్షల కుటుంబాల ను ముందుండి నడిపిస్తుండటం విశేషం. ఉమ్మడి కుటుంబాల విషయానికి వస్తే ఆరుగురు సభ్యులున్న కుటుంబాలు మొత్తం 5.14 లక్షలు. మహబూబ్‌నగర్ 94,164 కుటుంబాలతో ఆ విషయంలో ముందున్నది. అలాంటి కుటుంబాలు ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా, కేవలం 18,131 ఉన్నాయి. ఆరుగురికి మించి ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో 3.56 లక్షలు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1.16 లక్షలు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 8,057 ఉన్నాయి.

 కారు యోగం నూటికి ముగ్గురికే
 పది జిల్లాల్లో ప్రతి 100 మందిలో కారున్నవారు కేవలం ముగ్గురే. 22 మందికి ద్విచక్ర వాహనాలు, ఒక్క శాతానికి మాత్రం ట్రాక్టర్లు ఉన్నాయి. అత్యధిక వాహనాలను బ్యాంకు రుణాలతో తీసుకోవటం వల్ల అవి సొంత వాహనాలుగా నమోదు కాలేదన్న వాస్తవం సర్వేను బట్టి అర్థం అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 44 లక్షల వాహనాలు ఆర్‌టీఏలో నమోదు కాగా, సమగ్ర సర్వేలో వాహన యజమానుల సంఖ్య కేవలం 10,21,899గా తేలడం విశేషం. మరీ చిత్రంగా ఆ రెండు జిల్లాల్లో నమోదైన కార్లు రెండు లక్షలు కూడా లేవు. మొత్తంగా రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు వాహనాల యాజమ్యానంలో అగ్ర స్థానంలో ఉన్నాయి. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సంబంధ యంత్రాలు ఉన్న జిల్లాల్లో నల్గొండ, కరీంనగర్,  మహబూబ్‌నగర్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడైంది.

 పట్టణాల్లోనే ఉపాధి అవకాశాలు
 తెలంగాణ జిల్లాల్లో పట్టణాలు, నగరాలే ఉపాధి కేంద్రాలుగా మారాయి. పరిశ్రమలు, సేవా సంస్థల కేంద్రీకరణతో ప్రైవేటు ఉపాధి అవకాశాలన్నీ దాదాపు అక్కడే కేంద్రీకృతమైన పరిస్థితి నెలకొంది. ప్రైవేటురంగ ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తంగా 15,55,009 మంది ప్రైవేటు ఉద్యోగులుగా నమోదు కాగా, అందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 4,99,948 మంది ఉన్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా నిజామాబాద్‌లో ప్రైవేటు రంగం కేవలం 72,882 మందికే ఉపాధిని కల్పిస్తోందని తేలింది.

 పల్లెలు జబ్బులకు నిలయాలు
 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7.58 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో, 32 వేల మంది క్యాన్సర్ తో, 1.17 లక్షల మంది గుండె జబ్బుతో, 69 వేల మంది పక్షవాతం, 75 వేల మంది ఆస్తమా, 66 వేల మంది ఫ్లోరోసిస్, 37 వేల మంది ఫైలేరియాతో బాధపడుతున్నట్లు  వెల్లడైంది. అత్యధిక బాధితులు కరీంనగర్‌లో ఉండగా, అత్యల్ప బాధితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. తెలంగాణ జనాభాలో 4% క్యాన్సర్‌తో, 16% హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. క్షయతో 1% శాతం, పక్షవాతంతో 9%, ఎయిడ్స్‌తో 1%, ఆస్తమాతో 10%, ఫ్లోరోసిస్‌తో 9%, పైలేరియాతో 5% బాధపడుతున్నట్లు తేలింది. రోగుల నిష్పత్తిలో కరీంనగర్ తొలిస్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే గుండెజబ్బుల తీవ్రత పెరిగింది. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు గుండెపోటు, క్యాన్సర్ వ్యాధుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.  

 మారిన జీవన శైలితో పల్లెల్లోనూ వ్యాధులు విజృం భిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుండె, నరాలు, క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. గుండె సంబంధమైన వ్యాధుల విషయంలో కరీంనగర్ 18,631, వరంగల్ 17,367, నల్లగొండ 17,211, ఖమ్మం 13,601 కేసులతో ముందున్నాయి. ఆహారం, ఆరోగ్యం విషయంలో పట్టణ ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా వ్యాధి నివారణ, నిర్మూలన దిశగా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్న ట్లు స్పష్టమైంది. అంటువ్యాధుల తీవ్రత కూడా పల్లెల్లోనే ఎక్కువగా ఉంటోంది. కాబట్టి గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను, పౌష్టిక ఆహారాన్ని అందించడంపై, అవగా హన కల్పించడానికి సత్వర ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ ఆవశ్యకతగా మారింది.

 సమగ్ర సర్వేకు సమష్టి కృషి తోడైతేనే...
 ఆరు దశాబ్దాల ఉద్యమ అనంతరం సాకారమైన తెలంగా ణలోని అన్ని వర్గాలు సంతులిత అభివృద్ధితో, సామ రస్యంతో జీవనం సాగించాలంటే.. సర్వే నివేదిక ఆధా రంగా సర్కారు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. భూమి, నీరు, నివాసం, ఉపాధి, విద్య, వైద్యం తదితర ముఖ్య రంగాల్లో ఆశించిన ప్రగతి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో నిగ్గు తేలింది. దృఢ సంకల్పంతో సర్వేను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ తొలి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల, వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయడమే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి ఏకైక మార్గం.
  - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ రిపోర్టర్, ‘సాక్షి’, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement