లండన్ : యూరప్‌లో తొలి అండర్‌వాటర్ రెస్టారెంట్ నార్వేలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈ రెస్టారెంట్‌లో సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన సీఫుడ్‌ను ఆస్వాదించేందుకు ఇప్పటికే ఏడు వేల మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. అండర్ పేరుతో నార్వే తీరంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ సముద్రంలో పాక్షికంగా మునిగిన బారీ కాంక్రీట్ ట్యూబ్‌లా కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్‌ను ఓస్లోలో ఒపెరా హౌస్, న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 నేషనల్ మెమోరియల్ మ్యూజియంను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ స్నోహెట్టా డిజైన్ చేసింది.
నీటిలోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌లో భారీ విండో ద్వారా సముద్ర హొయలను వీక్షించవచ్చని, ఇది ఆక్వేరియం మాదిరి ఉండదని, వాస్తవ అనుభూతిని సందర్శకులకు అందిస్తుందని స్నోహెట్టా వ్యవస్థాపకుడు జెటిల్ ట్రాడెల్ థార్సెన్ చెప్పుకొచ్చారు. రెస్టారెంట్‌లోని డైనింగ్ హాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దాదాపు 40 మంది అతిధులు కూర్చునేలా డిజైన్ చేసిన డైనింగ్ హాల్ నుంచి భారీ ట్రాన్స్‌పరెంట్ విండో ద్వారా సముద్ర అందాలను తిలకించే ఏర్పాటు ఆకట్టుకుంటోంది.
ఆకుపచ్చని నీటి రంగును రిఫ్లెక్ట్ చేస్తూ పగలంతా రెస్టారెంట్‌లో సహజ సిద్ధమైన లైటింగ్ ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. సందర్శకులకు మధురానుభూతిని మిగిల్చే అండర్ వాటర్ రెస్టారెంట్‌లో స్ధానిక రుచులు, సీఫుడ్ సహా 18 రకాల వంటకాలతో కూడిన భోజనానికి ఒక్కరికి రూ 29,610 వసూలు చేస్తారు. రెస్టారెంట్‌లో విందు ఆరగించిన వారు ఆ రాత్రికి హోటల్‌లోనే గడిపే అవకాశం కల్పిస్తారు. తొలిరోజు హోటల్ యజమానుల కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రెస్టారెంట్‌ను తెరిచిఉంచగా తొలి పేయింగ్ గెస్ట్‌లకు ఏప్రిల్ తొలివారం నుంచీ అండర్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రపంచంలో కొద్ది సంఖ్యలోనే అండర్‌వాటర్ రెస్టారెంట్‌లు అందుబాటులో ఉండగా వీటిలో మాల్దీవుల్లోనే ఈ తరహా హోటళ్లు అధికంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment