పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి! | Ex Miss Universe, Bollywood beauty Sushmita Sen turns 38 | Sakshi

పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి!

Published Tue, Nov 19 2013 1:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి! - Sakshi

పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి!

పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించటం సాధ్యమేనా? అవును.. మనసున్న మనిషిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని, వారిలో ఒకరికోసం న్యాయపోరాటం కూడా చేసిన ధీర.. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్. అందాల పోటీల్లో విజేత కావడం, బాలీవుడ్ అభిమానుల హృదయాలు కొల్లగొట్టడమే కాదు.. సేవా కార్యక్రమాల్లో ముందుండి మహిళలకు స్ఫూర్తినిచ్చిన సుస్మిత.. 38వ పడిలోకి అడుగుపెట్టింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది.

సుమారు పదకొండేళ్ల క్రితం యానీ అనే చిన్నారిని సుస్మితా దత్తత తీసుకుంది. రెండేళ్ల క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. న్యాయస్థానంలో పోరాటం చేసి విజయం సాధించింది. అయితే వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, తమ మధ్య అది ఎప్పటికీ అడ్డు కాదని స్పష్టం చేసింది.

1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్‌ సేన్‌ భారత వైమానిక దళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్‌ నగల డిజైనర్‌. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.  ఆ తర్వాత మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి ప్రవేశించింది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది.  ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. సమయమంతా పిల్లలకే కేటాయిస్తోంది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్‌ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది.

పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి  కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపించిన సుస్మితా సేన్, ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.  మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించాలన్నా, బిడ్డలకు రుచి చూపాలన్నా పేగు తెంచుకున్న బంధమే అక్కర్లేదని నిరూపిస్తోంది సుస్మిత. ఇప్పటికీ అప్పుడప్పుడు లవ్‌ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఆ ఊహాగానాలకు పుల్స్టాప్ పెడుతూ ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుస్మితానే ఓ కార్యక్రమంలో ప్రకటించింది కూడా.  అయితే వరుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement