కోటలో తోట | garden in golkonda fort | Sakshi
Sakshi News home page

కోటలో తోట

Published Sun, Nov 2 2014 10:51 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

కోటలో తోట - Sakshi

కోటలో తోట

తాజ్‌మహల్‌ను చూశారా.. పాలరాతి అద్భుతం రెప్పవాల్చనీయదు. ఆ నిర్మాణ కౌశలం అంత గొప్పది మరి. కానీ దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది మాత్రం ఆ కట్టడం ముందు పరుచుకున్న మొఘల్ గార్డెనే. పచ్చిక బయళ్లు... తాజ్‌మహల్ అంత ఎత్తుకు ఎదగాలని తాపత్రయపడుతున్నట్టుండే వృక్షాలు.. మధ్యలో నీటి హొయలు.. దానిక సొగసులద్దే ఫౌంటెయిన్లు.. ఆ పూదోటను చూస్తుంటే మనల్ని మొఘల్ చరిత్ర వాకిట నిలబెడుతుంది.
 - గౌరీభట్ల నరసింహమూర్తి
 
మరి అలాంటి అద్భుత ఉద్యానవనం మన భాగ్యనగరంలో కూడా ఉండేదంటే నమ్ముతారా..? అద్భుత నిర్మాణ శైలితో ప్రపంచ ఖ్యాతినార్జించిన చారిత్రక గోల్కొండ కోట వద్దే అది ఉంది. అదేంటి గోల్కొండకు ఇన్నిసార్లు వెళ్లినా ఆ సుందరవనం కనిపించలేదంటారా..? నాలుగు వందల అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని చుంబించేలా అలరారుతున్న గోల్కొండ కోట సాక్షిగా ఆ ఉద్యానవనం కాలగర్భంలో కలసిపోయింది. మొఘలాయీ గార్డెన్స్‌కు పతిబింబంగా రూపుదిద్దుకున్న ఉద్యానవనం.. సాగుభూమిగా మారిపోవడంతో ఆ పూవనాన్ని చూసే భాగ్యం మనకు లేకుండా పోయింది.

చరిత్ర గమనంలో వాడిపోయిన ఉద్యానవనం ఇప్పుడు వెలుగు చూసింది. ఆనాటి సుందర నిర్మాణ శిథిలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజాం జమానాలో పురావస్తు నిపుణిడిగా ఖ్యాతిపొందిన గులామ్ యాజ్దానీ రాసిన ఓ పుస్తకంలోని కథనాలు ఇక్కడి పూర్వవైభవాన్ని తెలియజేశాయి. వాటి ఆధారంగా కేంద్ర పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో ఆనాటి అపురూప ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. చరిత్రలో వర్ణించిన తీరు వెలుగు చూస్తుండటంతో.. ఈ ఉద్యానవనానికి పూర్వవైభవం కల్పించాలంటూ అధికారులు కేంద్రానికి నివేదించారు.
 
అనాటి అపురూపం
కాకతీయుల కాలంలో నిర్మితమైన గోల్కొండ కోటలో అడుగడుగూ అద్భుతమే. రాచరికాలు మారే కొద్దీ కోటలో మార్పులు, చేర్పులు ఎన్నో జరిగాయి. బహమనీల తర్వాత కోటలో పాగా వేసిన కుతుబ్‌షాహీలు.. గోల్కొండ ఖిల్లాకు కొత్త సొబగులు అద్దారు. కోట అంటే పరిపాలన కేంద్రంగా మాత్రమే కాదు అది చూడముచ్చటగా ఉండాలని భావించారు. అందుకే మొఘల్ గార్డెన్ తరహాలో ఇక్కడ కూడా ఓ అందమైన తోటను తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రస్తుతం నయాఖిల్లా ప్రాంతంలోని ఖాళీ భూముల్లో పర్షియా నమూనాలో అందమైన వనం  28 నుంచి 32 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. చుట్టూ పచ్చిక.. మధ్యలో జలధార.. అందులో ఫౌంటైన్లు.. మళ్లీ పచ్చిక.. నీళ్లు.. ఫౌంటైన్లు.. ఇలా దొంతరలుగా దీన్ని నిర్మించారు.

గోల్కొండ కోట చుట్టూ విస్తరించి ఉన్న మూడు చెరువులతో వీటిని అనుసంధానించారు. ఇందుకోసం ప్రత్యేక నీటి మార్గాలు, టైట పైపులైన్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం నిరంతరం ఉండేలా డిజైన్ చేశారు. వీటి నిర్మాణానికి అప్పట్లోనే విదేశీ నిపుణులను పిలిపించారు. తాజ్‌మహల్‌తోపాటు ఔరంగాబాద్‌లోని ప్రఖ్యాత బీబీకా మఖ్బారా తరహాలో వీటిని రూపొందించారని చెబుతారు. దీన్ని కుతుబ్‌షాహీ గార్డెన్ అని, డెక్కనీ గార్డెన్ అని పిలిచేవారు.
 
కాలగర్భంలోకి..
కుతుబ్‌షాహీల హయాంలో 1590 వరకు ఈ అద్భుతవనం పరిమళాలతో విరాజిల్లింది. అసఫ్‌జాహీల జమానాలో కొంతకాలం ఉద్యానవనం కళకళలాడినా.. తర్వాత నిర్వహణ లోపంతో పతనమవుతూ.. చివరకు కాలగర్భంలో కలసిపోయింది. నిజాం ప్రభుత్వంలోని కొందరు ఈ భూములను ఇతరులకు ధారాదత్తం చేయడంతో విరుల తోట కాస్తా.. సాగుభూమిగా మారింది. కాలక్రమంలో పూర్తిగా వ్యవసాయ క్షేత్రంగా మారిపోయింది. పాత రికార్డుల్లో అది సర్కార్ జమీన్‌గా ఉండటం.. అది కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందా.. రాష్ట్ర ప్రభుత్వానిదా అన్న స్పష్టత లేకపోవడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ల కిందట భూమిని స్వాధీనం చేసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థకు కేటాయించింది. అప్పటి నుంచి అక్కడ సాగు నిలిచిపోయింది.
 
స్వచ్ఛంద సంస్థల పోరాటం..
హైదరాబాద్ స్టేట్‌లో పురావస్తు విభాగానికి మూలవ్యక్తిగా నిలిచిన గులామ్ యాజ్దానీ పరిశోధించి నయాఖిల్లా ప్రాంతంలో గొప్ప ఉద్యానవనం ఉండేదని వెలుగులోకి తెచ్చారు. తాను రాసిన పుస్తకంలో కూడా దాన్ని గొప్పగా ప్రస్తావించారు. ఇప్పట్లో మనకున్న చారిత్రక ఆధారం అదే. దాని ఆధారంగా ఆ వనాన్ని మళ్లీ వెలుగులోకి తేవాలంటూ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలెన్నో పోరాటం చేసినా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య విషయాన్ని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు వివరించి అక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించారు. దీనికి ఇటీవలే అనుమతి రావటంతో వారం క్రితం పనులు మొదలుపెట్టారు.
 
అద్భుత వనమది..
మొఘల్ గార్డెన్స్ తరహాలోనే ఈ కుతుబ్‌షాహీ గార్డెన్‌ను నిర్మించినట్టు తాజా ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి 10 ఎకరాల విస్తీర్ణంలో శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నాం. మరింత లోతుగా పరిశోధన జరుపుతాం. ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చి అక్కడి ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం వందమంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ గార్డెన్‌ను పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి మూడు నెలల కాలాన్ని గడువుగా పెట్టుకుని పని చేస్తున్నాం. కొద్దిరోజుల్లోనే అపురూప కట్టడం పూర్తిగా బయటపడుతుంది.
 -  కృష్ణయ్య, ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్
 
ఆనవాళ్లు ఇలా..

* దాదాపు 28 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ వనంలోకి వెళ్లేందుకు విశాలమైన మెట్ల వరస నిర్మించారు. ఇందులో పై రెండు రాళ్లు మాత్రమే కనిపించేవి. తాజా తవ్వకాల్లో ఆ వరస బయటపడింది.
* వనం మధ్యలో నీటితో నిండి అలరించిన విశాలమైన భారీ రాతి ట్యాంకులు బయటపడ్డాయి. ఇందులో 100 మీటర్ల పొడవు, వెడల్పున్న భారీ ట్యాంకుతో పాటు 37 మీటర్ల వైశాల్యంతో ఉన్న మరొకటి వెలుగు చూసింది.
* వీటిల్లోకి నీటిని తరలించే కొన్ని కాలువల ఆనవాళ్లు కూడా వెలుగు చూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement