చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్ | Hash House Harriers | Sakshi
Sakshi News home page

చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్

Published Wed, Mar 25 2015 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్

చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్

హాష్ హౌస్ హారియర్స్.. ఈ క్లబ్‌లో చేరితే చక్కగా ఓ  సాయంత్రం సిటీ శివార్లలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్‌కి వెళ్లొచ్చు. అక్కడ మీతో కలసి నడవడానికి, పరుగులు తీయడానికి, ముచ్చట్లు పంచుకోవడానికి దేశ విదేశీయులు సిద్ధంగా ఉంటారు. ఆటలు పాటలతో అలసి సొలసి సేదతీరాలనుకుంటే బీర్‌తో చీర్స్ చెప్పే ఫ్రెండ్సూ ఉంటారు. పాతికేళ్ల వయసున్న ఈ క్లబ్  గురించి తెలిసింది తక్కువ మందికే.    
 ..:: ఎస్.సత్యబాబు
 
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పే బదులు చేసి చూపించడమే మేలనుకుంటున్నారీ క్లబ్ సభ్యులు. ఈ క్లబ్ పేరు హైదరాబాద్ హాష్ హౌజ్ హారియర్స్.. హాషర్స్ గ్రూప్‌నకు మూలం 1938లో జరిగిన సోల్జర్స్ ఈవెంట్ అని చెబుతారు. 1938 ప్రాంతంలో మలాయ్ స్టేట్స్(ఇప్పటి మలేషియా)లో బ్రిటిష్ ఆర్మీ అధికారులు హాషింగ్‌ను ప్రారంభించారు. హాషింగ్ అంటే కోసుకు తినడం లేదా వికారమైన పని అనే అర్థం ఉంది. వీకెండ్స్‌లో కలిగే వికారాన్ని తొలగించుకునేందుకు ఈ ఆఫీసర్లు సోమవారం సాయంత్రాల్లో కలసి పరుగులు తీసేవారట. కుందేలు తరహా జంతువుల్ని వేటాడే కుక్కల్ని హారియర్స్ అంటారు.

తాము కూడా వేటాడే వాళ్లమే అనే అర్థం ధ్వనించేలా హాష్ హౌజ్ హారియర్స్ అని క్లబ్‌కు పేరు పెట్టారు. వీరిలో మహిళల్ని హారియస్ అని పిలిచేవారు. వీకెండ్ హ్యాంగోవర్స్ నుంచి బయటపడటానికి, బెస్ట్ ఫిట్‌నెస్ కోసం ఆటలాడి, నోరెండిపోతే దానిని బీర్‌తో చల్లార్చడం, తమకు వయోభారం లేదనిపించేలా చేయడం వంటివి ఈ క్లబ్ ప్రాథమిక లక్ష్యాలు.

ప్రారంభమైన కొన్నాళ్లకే ముగిసిపోయిన ఈ హాషింగ్.. 1948లో పునఃప్రారంభమైంది. మళ్లీ కొంత గ్యాప్‌తో 1962లో మరోసారి ప్రారంభమై... అక్కడి నుంచి ఫార్‌ఈస్ట్, సౌత్ పసిఫిక్, నార్త్ అమెరికా... అలా ప్రపంచ వ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు రెండు వేలకు పైగా ఈ క్లబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఆయా చాప్టర్లు న్యూస్‌లెటర్స్, మ్యాగజైన్స్ ప్రచురిస్తూ, ప్రాంతీయ, ప్రపంచస్థాయి హాషింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి.
 
జరిగే విధంబిదీ..
ఈ రన్ కమ్ వాక్ కమ్ జాగ్..  ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆటలు, పాటలు, తినడం, తాగడం.. అన్నీ ఇందులో భాగమే. ప్రతి ఆదివారం సాయంత్రం మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఎంచుకున్న స్థలంలో ఒక రోజు ముందుగా కొండల్లో గుట్టల్లో లేక్స్ దగ్గర ఇలా పలు చోట్ల .. పిండి లేదా ముగ్గుపొడితో మార్క్స్ వేస్తారు. వీటిని కనిపెట్టడమే ఈవెంట్ స్పెషాలిటీ. ఈ క్రమంలో గుంపుగా బయలు దేరి, మార్గం మధ్యలో విడిపోతారు. స్లో అయి వెనక పడ్డవాళ్లు ముందున్నవాళ్లని చేరుకోవడం.. మధ్యలో రకరకాల సరదా ఆటలు.. ఇలా గంట నుంచి నాలుగు గంటల దాకా మస్తీ మజా చేస్తారు.

ఈవెంట్‌కి విజిల్ నోట బెట్టుకున్న గ్రాండ్‌మాస్టర్ హెడ్. రన్ పూర్తయ్యాక ఆయన అందర్నీ సర్కిల్‌లో నిలబెడతాడు. ఈ సమయంలోనే కొత్తవారి పరిచయం... పాతవారు సాధించినవి షేర్ చేసుకోవడం ఉంటాయి. ఈ సర్కిల్‌లో ఉన్నవారు తమాషా పాటలు పాడతారు. ఆటలు ఆడతారు. ఒక్కోసారి ఫన్ కోసం ఐస్‌బ్లాక్స్ మీద కూచోపెట్టడం వంటి సరదాలుంటాయి. వీరికో రెలిజియస్ అడ్వయిజర్ ఉంటారు. లారీలు, ఆటోలకూ వినియోగించే హారన్ ఈ అడ్వయిజర్ దగ్గర ఉంటుంది. రన్‌లో వెనకపడినవారిని అప్రమత్తం చేయడానికి హారన్ మోగిస్తారు.
 
ఏజ్.. ట్వంటీఫైవ్...
ఈ క్లబ్‌లో సిటీజనులతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఉజ్బెకిస్తాన్, కెన్యా, నైజీరియా సభ్యులు సైతం ఉన్నారు. హైదరాబాద్‌కి పాతికేళ్ల క్రితమే వచ్చినా.. ఇప్పుడిప్పుడే దీని యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. జోరువానైనా.. మండే ఎండ ఉన్నా.. ఈ ఈవెంట్ వాయిదా పడదు, రద్దు కాదు. ఈ 25 ఏళ్లలో యాక్టివిటీ జరగని ఆదివారం లేదు. ఈ ఫన్నీ ఈవెంట్ కోసం హిమాయత్ సాగర్ లేక్‌బెల్ట్, గండిపేట నుంచి లంగర్‌హౌస్‌కి వచ్చే దారి, చేవెళ్ల ఫారెస్ట్, అనంతగిరి కొండలు.

రాచకొండ గుట్టలు.. వంటివన్నీ వీరు ఓ రౌండ్ వేసేశారు. గత ఆదివారం శామిర్‌పేటలో రన్ నిర్వహించారు. కనీసం 30 మందికి తగ్గకుండా వీటిల్లో పాల్గొంటారు. ఒక్కోసారి వీరి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. 6 కి.మీ నుంచి 10 కి.మీ రన్ చేస్తారు. ఈ సరదా టైమ్‌లో కూల్‌డ్రింక్సేకాదు... బీర్ కూడా కొడతారు. ఈ హాషర్స్‌కి ఒక బుక్ ఉంది. ఇందులో వీళ్లు విజిట్ చేసిన ప్లేసెస్ గురించి రాస్తారు. పాశ్చాత్యశైలి ఈవెంట్ కాబట్టి.. సిటీలోవిదేశీయులు అధికంగా పాల్గొంటారు.
 
ఎంట్రీట్...
ఈ క్లబ్‌లో ఎంట్రీకి రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.50. అయితే ఫస్ట్ టైమ్ వస్తే గెస్ట్‌గా ట్రీట్ చేస్తారు. అలాగే  50, 100, 150వ రన్స్.. ఇలా మైలురాళ్లు చేరుకున్నప్పుడల్లా సదరు సభ్యులకు గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ క్లబ్‌లో ఉన్నవారిలో ఇండస్ట్రియలిస్ట్ వెంకట్ అత్యధికంగా 900 రన్‌లలో పాల్గొన్నారు. ‘వారమంతా బిజీగా ఉండేవారికి ఇదొక చక్కని వీకెండ్ వినోదం. నేను ఇప్పటికి ఈ క్లబ్ నిర్వహించిన 200 పైగా ఈవెంట్లలో హాజరయ్యాను’ అని చెబుతారు ప్రసాద్. ఏడాదికోసారి అన్ని సిటీస్ కలిపి నేషనల్ ఈవెంట్ నిర్వహిస్తాయి. క్లబ్ ప్రారంభించి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఆగస్టులో చెన్నై, హైదరాబాద్, బెంగళూరులు కలిపి సౌతిండియా ఈవెంట్ జరుపుతున్నారు. ఇందులో నగరం నుంచీ పార్టిసిపేట్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement