ధ్యాన కేంద్రాలుగా పంచమఠాలు
శ్రీశైలం: ఒకప్పుడు విద్య, వైద్య కేంద్రాలుగా ప్రభవిల్లిన పంచమఠాలను ధ్యాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సూచించారు. ఇటీవల ఘంటామఠం, వీరభద్రమఠాల జీర్ణోద్ధరణ పనులను దేవస్థానం ప్రారంభించింది. ఈ పనులను దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త, ఈఈ శ్రీనివాసులు, ఉద్యానవనశాఖ అధికారి వెంకట్రాఘవరావులతో కలిసి ఆయన పరిశీలించారు. మాడ వీధుల విస్తరణ పనులు, పుష్కరిణి వద్ద ఉద్యానవన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జెఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. పంచమఠాలన్నీ ఒకే సముదాయ ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
ఆయా మఠాల చుట్టూ ఉద్యానవనాలను పెంచాలన్నారు. మఠాల వద్ద ఉన్న సహజ నీటి గుండాలను పరిరక్షించి వాటి ప్రాచీనతను కాపాడాల్సిందిగా ఈఓకు సూచించారు. మాడ వీధుల్లో భక్తులు నడిచేందుకు వీలుగా పుట్‌పాత్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అతిథిగృహాలు, కాటేజీల్లో సౌర విద్యుత్ వినియోగానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సౌర విద్యుత్ వినియోగంపై స్థానిక సత్రాల యజమానులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.