దీప
నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం ఈసారి వారసులతోనే నడిచేట్లుగా ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడు గౌతంరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇక ఎన్నికలలో పోటీ చేయడమే ఆలస్యం. మరో పక్క మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచనలతో పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇంకోపక్క బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె దీప కూడా 2014 ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ నిజమైతే నెల్లూరు జిల్లాలో ఈసారి వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతాయి.
వెంకయ్య నాయుడు - జాతీయ స్థాయిలో ఓ పెద్ద నేత - నిత్యం జాతీయ నేతలో బిజీగా ఉంటారు - ఓ మాటల మాత్రికుడు - మీడియా ముందుకు వచ్చారంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏ భాషలోనైనా ప్రాస తన్నుకొస్తుంది. ఆయన మాటల్లో విషయంతోపాటు ప్రాసకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన ఈ సారి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బిజెపి తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా నుంచి బిజెపి జాతీయ నేతగా ఎదిగిన వెంకయ్యనాయుడు 1978లో, 1983లో రెండుసార్లు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఆత్మకూరు నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అచ్చిరాలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రజల ఆశీస్సులు లభించలేదు. బాపట్ల, ఆ తరువాత హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. వెంకయ్యకు బిజెపి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం. జాతీయ నేతగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు. దాంతో అద్వానీని ప్రసన్నం చేసుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధాని వాజ్ పేయిని, ఉప ప్రధాని అద్వానీని, పాతిక మంది కేంద్ర మంత్రులను జిల్లాకు తీసుకువచ్చారు. 2004లో ఎన్నికలలో తెలుగుదేశం పొత్తుతో బిజెపి నెల్లూరు లోక్సభ స్థానంలో, అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది. రాజకీయ వారసులుగా తన పిల్లలను తీసుకురానని వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పేవారు. అయితే ఆయన మనసులో మాత్రం తన కూతురును ప్రజా ప్రతినిధిగా చూడాలనే బలమైన కోరిక ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో తన కుమార్తె దీపను నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని వెంకయ్య నాయుడు భావించారు. ఇందు కోసం సర్వే కూడా చేయించారు. టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో చివరి దశలో ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తె దీపను తప్పనిసరిగా ఎన్నికల బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సారి కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తన కూతురిని ఎన్నికల బరిలో దింపేందుకు వెంకయ్య నాయుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీప ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అక్షర విద్యాలయ పేరుతో స్కూలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.