heiress of politics
-
Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కిమ్ వారసురాలు ఆమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జుయే వయసు కేవలం పదేళ్లు మాత్రమే. తన తోటి వయసు పిల్లల కంటే పొడవుగా పెద్దదానిలా జుయే కనిపిస్తుందని గతంలోనే దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. అంత చిన్న వయసున్న జుయే ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగాలకు హాజరు కావడం విస్మయ పరుస్తోంది. ఆ ప్రయోగాల సమయంలోనే తొలిసారిగా మీడియా కంటపడింది. తాజాగా ఆదివారం కిమ్, తన కుమార్తెతో కలిసి శాస్త్రవేత్తలు, ఇతర అధికారులతో చర్చిస్తున్న ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది. -
వారసులకు.. నో చాన్స్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఓటర్లు ఇప్పటి దాకా వారసులకు జై కొట్టనే లేదు. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహించినా, వారి వారసులకు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. కొందరు నేతల తనయులు ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించినా, కనీసం పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతల తనయులకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వారు కూడా కేవలం ఒకే ఒక్క గెలుపునకు పరిమితమై పోయారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన వరుస విజయాలు సాధించిన తిప్పన చిన కృష్ణారెడ్డి తనయుడు తిప్పన విజయ సింహారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కినా గెలవలేక పోయారు. ఇదే తరహాలో మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994 ఎన్నికల్లో వరసగా విజయాలు సాధించారు. ఆయన తనయుడు ఉజ్జిని యాదగిరిరావు 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచారు. ఆ మరుసటి ఎన్నికల్లో ఆయన రెండోసారి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఇక, ఏ నేత తనయుడు కానీ, కూతురు కానీ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకుని చట్టసభలకు వెళ్లలేక పోయారు. అవకాశాలు దక్కని వారసులు జిల్లాలో సీనియర్ నేతల వారసులు కొందరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడిన వారే. కానీ వారికి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి రెండు పర్యాయాలుగా ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించారు. ప్రధానంగా ఈసారి మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషం దాకా ఢిల్లీలో ఏఐసీసీ నేతల వద్ద పావులు కదిపారు. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించిన రఘువీర్ రెడ్డి అప్పుడు దక్కక పోవడంతో ఆశగా దాదాపు ఐదేళ్లు ఎదురు చూశారు. చివరకు ఆయనకు 2018 ఎన్నికలు సైతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. మిర్యాలగూడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన ఎన్.భాస్కర్‌రావు, టీఆర్ఎస్లో చేరడం, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఈ సారి ఇక్కడినుంచి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి గత ఎన్నికల సమయంలోనే భువనగిరి టికెట్ ఆశించారు. చివరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి కూడా సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డికే టికెట్ లభించింది. దీంతో సర్వోత్తమ్ ఎన్నికల అరంగేట్రం వాయిదా పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోమాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు సందీప్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినా, ఎన్నికల గోదాలోకి దిగే అవకాశమే దక్కలేదు. జిల్లాల విభజన జరిగాక ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయన తన తల్లి వెంటే గులాబీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి భువనగిరి నుంచి మాధవరెడ్డి నాలుగు పర్యాయాలు, ఉమా మాధవరెడ్డి మూడు సార్లు మొత్తంగా ఎలిమినేటి కుటుంబం ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించింది. 1985 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం ఈ కుటుంబం చేతిలోనే ఉండింది. 2014లో మాత్రమే ఇక్కడినుంచి టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంత పట్టున్న నియోజకవర్గం నుంచి ఎలిమినేటి వారసుడికి మాత్రం అవకాశం దక్కలేదు. మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేక ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఎవరూ చట్ట సభలకు వెళ్లలేక పోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుటుంబం నుంచి ఆయన తనయుడు, కూతురు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికలకు మాత్రం వారికి కలిసిరాలేదు. గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో ఆమె రెబల్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక, గోవర్ధన్‌రెడ్డి తనయుడు పాల్వాయి శ్రవణ్ రెడ్డి ఈ సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా, జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఎవరూ ఎన్నికల రంగంపై లేకుండా అయ్యారు. -
రాజకీయాల్లోకి రానున్న వారసురాలు
నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం ఈసారి వారసులతోనే నడిచేట్లుగా ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడు గౌతంరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇక ఎన్నికలలో పోటీ చేయడమే ఆలస్యం. మరో పక్క మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచనలతో పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇంకోపక్క బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె దీప కూడా 2014 ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ నిజమైతే నెల్లూరు జిల్లాలో ఈసారి వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతాయి. వెంకయ్య నాయుడు - జాతీయ స్థాయిలో ఓ పెద్ద నేత - నిత్యం జాతీయ నేతలో బిజీగా ఉంటారు - ఓ మాటల మాత్రికుడు - మీడియా ముందుకు వచ్చారంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏ భాషలోనైనా ప్రాస తన్నుకొస్తుంది. ఆయన మాటల్లో విషయంతోపాటు ప్రాసకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన ఈ సారి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బిజెపి తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి బిజెపి జాతీయ నేతగా ఎదిగిన వెంకయ్యనాయుడు 1978లో, 1983లో రెండుసార్లు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఆత్మకూరు నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అచ్చిరాలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రజల ఆశీస్సులు లభించలేదు. బాపట్ల, ఆ తరువాత హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. వెంకయ్యకు బిజెపి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం. జాతీయ నేతగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు. దాంతో అద్వానీని ప్రసన్నం చేసుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధాని వాజ్ పేయిని, ఉప ప్రధాని అద్వానీని, పాతిక మంది కేంద్ర మంత్రులను జిల్లాకు తీసుకువచ్చారు. 2004లో ఎన్నికలలో తెలుగుదేశం పొత్తుతో బిజెపి నెల్లూరు లోక్‌సభ స్థానంలో, అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది. రాజకీయ వారసులుగా తన పిల్లలను తీసుకురానని వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పేవారు. అయితే ఆయన మనసులో మాత్రం తన కూతురును ప్రజా ప్రతినిధిగా చూడాలనే బలమైన కోరిక ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో తన కుమార్తె దీపను నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని వెంకయ్య నాయుడు భావించారు. ఇందు కోసం సర్వే కూడా చేయించారు. టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో చివరి దశలో ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తె దీపను తప్పనిసరిగా ఎన్నికల బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సారి కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి తన కూతురిని ఎన్నికల బరిలో దింపేందుకు వెంకయ్య నాయుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీప ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అక్షర విద్యాలయ పేరుతో స్కూలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.