పురానా హవేలీ
నాలుగొందల ఏళ్లు పైబడిన హైదరాబాద్ నగర చరిత్రకు సాక్షిగా... నాటి రాచరికపు వైభవానికి ప్రతీకగా... కుతుబ్‌షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా... నేటికీ అలనాటి సిరులొలికిస్తోంది ‘పురానా హవేలీ’. సాలార్‌జంగ్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్యాలెస్... సందర్శకులెందర్నో ఆకర్షిస్తోంది. ఐదో కులీకుతుబ్‌షా నవాబ్ మహ్మద్‌కులీ పాలనా కాలం (1580-1612) నాటిది ‘పురానా హవేలీ’. కుతుబ్‌షాహీల ప్రధానమంత్రి మీర్ మోమీన్ నివాస గృహంగా ఈ ప్యాలెస్ ప్రతీతి.
ప్యాలెస్ చుట్టూ సుమారు మైలు దూరం పొడవున, దృఢమైన ఎత్తయిన ప్రహరీ నిర్మించారు. రెండో నిజాం, నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ తన కుమారుడు సికిందర్‌జా కోసం ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం ఈ ప్యాలెస్‌లో పలు కొత్త భవన సముదాయాలను నిజాం నిర్మించారు. అయితే.. మూడో నిజాం ప్రభువుగా
నవాబ్ సికిందర్‌జా సింహాసనం అధిష్టించాక (1803-1829) ఈ ప్యాలెస్‌లో ఆయన నివాసముండనే లేదు. ఆయన చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ మహల్‌లో ఉన్నారు. దీన్నే చౌమొహల్లా అని కూడా పిలుస్తున్నారు. ఆ మాదిరిగా మూడో నిజాం ఖిల్వత్ మహల్‌లో ఉండటంతో, రెండో నిజాం ప్రభువు నివాసమున్న ఈ ప్యాలెస్‌కు పాత ప్యాలెస్ లేదా ‘పురానా హవేలీ’ అని స్థానికులు పిలవనారంభించారు.
అయితే ఐదో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించిన నవాబ్ అఫ్జద్దౌలా... పురానాహవేలీ భవనాల్లోనే జన్మించారు. అలాగే, ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ తిరిగి పురానా హవేలీని తన అధికార నివాస గృహంగా చేసుకుని తన అధికార కార్యకలాపాలు నిర్వహించారు. పురానా హవేలీలో మొత్తం పదకొండు భవనాల సముదాయం ఉంది. ఇందులోని ప్రధాన భవనం 18వ శతాబ్దపు ఇండో-యూరోపియన్ ఆర్కిటెక్చర్‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఆరో నిజాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారనేది చరిత్రకారుల అభిప్రాయం.
ఆరో నిజాం కాలంనాటి పలు విశేష వస్తువుల ప్రదర్శనశాల ‘సిటీ మ్యూజియం’ కూడా ప్రస్తుత పురానా హవేలీ ప్రాంగణంలోనే ఉంది. ఎన్నో అద్భుత కళారీతుల ప్రదర్శనశాలగా ప్రఖ్యాతి చెందిన ఈ నిజాం మ్యూజియంను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. అయితే... నేడు పురానా హవేలీలోని పలు భవనాల్లో ముఖరంజా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న పురానా హవేలీ... నేడు గొప్ప వారసత్వపు కట్టడంగా అలరారుతోంది.
- మలాది కృషానంద్ malladisukku@gmail.com