షో మాన్ | Indian men's grooming market had better results than Women's grooming market | Sakshi
Sakshi News home page

షో మాన్

Published Tue, Nov 18 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

షో మాన్

షో మాన్

నీల్సన్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 34 శాతంగా ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్‌కు ఇప్పుడు ఊపునిస్తోంది మగవాళ్ల సౌందర్యస్పృహే. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట. మగాడికి ఏముందిలే ఎలా కనపడినా చెల్లిపోతుంది. ఆడది కాస్త కంటికి నదురుగా కనపడకపోతే ఎలా... ఇలాంటి పాత కాలపు భావాలకు కాలం చెల్లిందిక. ఇప్పుడు అందాల వేటలో ఆడవారిని ఆవలకు నెట్టేంత వేగంగా మగాడు ముందుకొచ్చేస్తున్నాడు. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

గ్లామర్ మేనియా వెనుక..
అందమైన కేశాలివిగో అంటూ గార్నియర్‌కు జాన్ అబ్రహాం, చర్మ సౌందర్యానికి నివియా టాక్ వాడాలని అర్జున్ రామ్‌పాల్ వంటి బాలీవుడ్ నటులు ప్రకటనల సాక్షిగా చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్న మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో మగవాళ్లపై దృష్టి సారించాయి బ్రాండ్స్. ఐపీఎల్ సమయంలో మగవాళ్ల బ్యూటీ కాస్మెటిక్స్ గురించి గార్నియర్ రాజస్థాన్ రాయల్స్‌తో అసోసియేట్ అయింది. ‘ నిర్విరామంగా ఎండకి గురయ్యే పురుషుల చర్మంపై సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ తీవ్ర ప్రభావం చూపుతాయి. చక్కగా కనిపించడం మగవాళ్లకి అవసరం’- ఆ టీమ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చిన్నితెరపై చేసే ఇలాంటి ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బారులు తీరేలా చేస్తున్నాయి.

మరోవైపు పెరుగుతున్న ఆదాయాలు కూడా ఒక కారణం. కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీంతో అందంగా, హుందాగా కనపడడం ఇప్పుడు పురుషులకు తప్పనిసరైంది. విభిన్న నేపధ్యాల నుంచి ఐటీ రంగంలోకి ఎంటరయ్యే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా సిటీలోని ఐటీ కంపెనీలు గ్రూమింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి.

బెస్ట్ డ్రెస్డ్ ఎంప్లాయ్ ఆఫ్ ది వీక్ వంటి అవార్డ్స్‌తో మగవాళ్లలో సెల్ఫ్‌లుక్‌పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. చక్కగా పనిచేయడం మాత్రమే కాదు చక్కగా కనపడడమూ అంతే ముఖ్యమని పలు సంస్థలు స్పష్టం చేస్తుండడం కూడా వీరిపై ప్రభావం చూపిస్తోంది. రియాలిటీ టీవీ షోస్, ఫ్యాషన్ షోస్‌లో మేల్ మోడల్స్‌కు డిమాండ్ పెరగడం, పురుషులకు ప్రత్యేకించిన బ్యూటీ కాంటెస్ట్‌లు దీనికి దోహదం చేస్తున్నాయి. ఈ విషయంలో ముంబయి, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా తర్వాత హైదరాబాద్ ముందంజలో ఉన్నాయి.

పార్లర్స్‌లో పార్ట్‌టైమ్...
వారాంతాల నుంచి దాదాపు రోజూ పార్లర్‌కు వెళ్లే మగవాళ్లు కూడా సిటీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజువారీ మీటింగ్‌లు, పార్టీస్‌కి అటెండవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్‌కు పురుషులు అలవాటు పడుతున్నారు. ‘హెయిర్‌స్టైల్‌ని సెట్ చేసుకోవడం, షేవింగ్‌ల కోసం రోజూ మా సెలూన్‌కి వచ్చి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ హవర్ స్పెండ్ చేసే మగవాళ్లకి కొదవలేదు’ అని బంజారాహిల్స్‌లోని మేనియా సెలూన్ నిర్వాహకులు సచిన్ అంటున్నారు. పురుషులకు ఉపకరించే స్కిన్ లెటైనింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్స్‌లో తప్పనిసరి ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి.

క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్కర్బ్స్, షవర్ జెల్స్ వంటివి వాడకానికి సిటీ మగాళ్లు గతంలోలా సిగ్గుపడడం లేదు. దేశంలోనే మొత్తం స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27 శాతం కాగా మేల్ స్కిన్ క్రీమ్ 41శాతంతో అత్యంత వేగంగా పెరుగుతోంది. ‘మేల్ స్కిన్ కేర్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్‌లో ఒకటి. ఎక్సర్‌సైజ్, ఈటింగ్ రైట్‌లతో పాటుగా గ్రూమింగ్ రొటీన్ కూడా పురుషుల దినచర్యలో భాగమైంది’ అని ది బాడీషాప్ ఇండియా సీనియర్ మేనేజర్ సంజాలి గిరి అంటున్నారు.  

షాపింగ్‌కు సై...
బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి సిటీ మగవాళ్లలో కొత్తగా షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందని ఓ కంపెనీ చేసిన స్టడీ వెల్లడించింది. ఈ కారణంగా గత దశాబ్ద కాలంలో సిటీ మగవాళ్లలో షాపింగ్ సరదా కూడా పెరిగింది. ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులైన మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. ఐటిసి లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు చెందిన బిజినెస్ హెడ్ నిరంజన్ ముఖర్జీ చెప్పిన ప్రకారం.. ‘మగవాళ్లు తమకు మాత్రమే ప్రత్యేకించిన ఉత్పత్తుల కోసం ఇన్నోవేటివ్ గ్రూమింగ్ కోసం చూస్తున్నారు’’.అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (అసోచామ్) చేసిన సర్వే ప్రకారం.. ఈ విషయంలో మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

ఇదే సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 85 శాతం మంది తమ గ్రూమింగ్ ప్రొడక్ట్స్‌ను ఇంటి అవసరాలతో, భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందని అసోచామ్ ప్రతినిధులు అంటున్నారు. వెటైనింగ్- ఫెయిర్‌నెస్ అంశాల్లో ఎదుగుతున్న పట్టణాలకు చెందిన పురుషులు ఆసక్తి చూపుతున్నారు అని నివియా ఇండియా రక్షిత్ హర్గావె అంటున్నారు.

షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్‌ఫొలయేటర్స్, హెయిర్‌కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్ వంటి వి పురుషుల ఎంపికగా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్స్, ఫేస్ వాష్, డియోడరెంట్స్... తదితర అవసరమైన బాతింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement