అంతర్జాలం.. ఓ ఇంద్రజాలం!
అంతర్జాలం.. ఓ ఇంద్రజాలం! పఠనాసక్తి తగ్గిపోతుందన్న మాట వట్టి అపనిందే అని రుజువుచేస్తోందిది.. సమాచారాన్ని అందించే సెర్చ్ ఇంజిన్‌ల దగ్గర్నుంచి సమాచారాన్ని పంచుకునే సోషల్‌నెట్‌వర్క్ సిస్టమ్స్ దాకా.. అన్నీ దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు కొందరు రచయితలు! వీళ్లంతా ఫేస్‌బుక్‌లో గ్రూప్‌లుగా .. చదవడం.. రాయడమనే రెండు అభిరుచులను ఏకకాలంలో ఆస్వాదిస్తున్నారు! ఔత్సాహికులకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు..
వీళ్లలో ఇంటర్నెట్ వేదికగా రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టి రచయితలుగా మారినవారు కొందరైతే.. ఈ లేటెస్ట్ టెక్నాలజీని డియరెస్ట్ ఫ్రెండ్‌గా మలచుకొని రచయితలుగా తమ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకుంటున్న సీనియర్స్ ఇంకొందరు.. ఈ సందర్భం.. ప్రస్తావనకు ప్రముఖ రచయిత్రి డాక్టర్ మంథా భానుమతి ‘జీవనవాహిని’, ‘గ్లేషియర్’ అనే పుస్తకాల ఆవిష్కరణ సమావేశం నాంది అయింది. ఆ చర్చ ఇలా సాగింది....
స్థలం.. బేగంపేట్‌లోని ఉమానగర్..
‘అందరిమాట ఏమోగాని నాకు మాత్రం ఇంటర్నెట్ చాలా యూజ్‌ఫుల్ అయింది. ఏజీ ఆఫీస్‌లో అంకౌట్స్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాక కాలక్షేపం ఏంటా అనుకుంటున్నప్పుడు ఫేస్‌బుక్ పరిచయమైంది. ఇందులోని ప్రమదాక్షరి గ్రూప్ నాకు ఎందరో రచయితలను, కొత్త రచనలను పరిచయం చేసింది. ఈ గ్రూప్‌లోని వాళ్లలో కాంపిటేటీవ్ స్పిరిట్‌ను చూస్తున్నాను’ అంటూ ఉపోద్ఘాతం ఇచ్చారు సీఎస్‌ఎమ్ లక్ష్మీ.
‘బ్లాగ్‌లో.. ఫేస్‌బుక్ గ్రూప్‌లో రచనలు రాయడంలో నేను జూనియర్‌నే అయినా రచయిత్రిగా మాత్రం మీ అందరికన్నా సీనియర్‌నే’ అంటూ ఈ చర్చలోకొచ్చారు పొత్తూరి విజయలక్ష్మి..‘ మేం కథలు, నవలలు రాసే కాలంలో పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం వారాలకు వారాలు ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడలాకాదు ఇలా ఓ వాక్యం రాశామో లేదో అలా లైక్‌లూ.. కామెంట్లు వచ్చిపడుతున్నాయ్. పుస్తకాలు చదివేవాళ్లు, రాసేవాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని ఇట్లా ఉపయోగించుకుంటున్నారు. అందుకే పఠనాసక్తి తగ్గిందంటే నేనొప్పుకోను’అని కరాఖండిగా చెప్పారామె.
‘అవును నేనూ ఒప్పుకోను. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర అంతాఇంతా కాదు మరి. మీలాంటి సీనియర్స్ సీరియస్‌గా రచనా వ్యాసంగంలో ఉన్న రోజుల్లో మీ రచనలకు ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, సింగపూర్‌లాంటి దేశాల్లో పాఠకులుండేవారా? కానీ ఇప్పుడు ఈ ఇంటర్‌నెట్ పత్రికలకు ప్రపంచవ్యాప్త పాఠకులున్నారు. కథను పోస్ట్ చేసిన క్షణంలోనే దాన్ని చదివేవాళ్లున్నారు. వెంటనే తమ స్పందననూ తెలుపుతున్నారు’అంటూ పొత్తూరి విజయలక్ష్మి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ తన అభిప్రాయాన్నీ చెప్పారు మంథా భానుమతి.
‘ఇదివరకు రచయితలు తక్కువ, పాఠకులు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు రచయితలు ఎక్కువయ్యారు. రచన ఎవరి సొత్తు కాదని ఇవి నిరూపిస్తున్నాయి’అని స్వాతి శ్రీపాద అంటుంటే ‘పాఠకులూ రచయితలు అవుతున్నారన్న మాట.. రచయితలు మంచి పాఠకులుగా కూడా ఉంటున్నారు’ అని తన వాక్యాన్ని ఆమె మాటకు జోడించారు ప్రముఖ రచయిత్రి, వాన చినుకులు బ్లాగ్ రైటర్ వారణాసి నాగలక్ష్మి. ‘మా మనవడితో మాట్లాడటానికని ఇంటర్నెట్ యూజ్ చేయడం నేర్చుకున్నాను. అలా ప్రమదావనం అనే గ్రూప్‌తో పరిచయం ఏర్పడింది.
దానివల్లే ఫొటోషాప్ నేర్చుకున్నాను. నాలుగు కథలూ రాశాను’అని తన వాణి వినిపించారు మాలాకుమార్. ‘పుస్తకాలు తగ్గిపోతున్న ఈ కాలంలో అంతర్జాల పత్రికలతో చెలిమైంది. ప్రమదావనంలో మెంబర్‌అయి సొంతంగా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. వెంటనే వచ్చే రెస్పాన్స్ ఈ వయసులో కూడా నాలో రచనా ఉత్సాహాన్ని నింపింది’ అని విశ్రాంత సమయాన్ని వినియోగపర్చుకుంటున్న తీరును పంచుకున్నారు జీఎస్ లక్ష్మీ.
‘ఇంటర్నెట్ పత్రికలను ఏ ఫోన్‌లోనైనా. ట్యాబ్‌లోనైనా చదువుకోవచ్చు. నా మటుకు నాకు పత్రికలు, ఫేస్‌బుక్ గ్రూప్స్ వల్ల కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, పాత ఫ్రెండ్‌షిప్ మరింత సన్నిహితమైంది’ అని వివరించారు కే బీ లక్ష్మి. ‘మీ అందరి స్నేహాన్ని నేను పొందగలిగానంటే ఫేస్‌బుక్కే కారణం. అంతేకాదు నాలో ఉన్న రచనాసక్తిని వెలికితీసి కథలు రాయగలిగేలా చేసిందీ ఈ గ్రూప్‌లే. పదాల పందిరి లాంటి ఆటలను పరిచయం చేశాను’ అని తన జ్ఞాపకాన్ని పంచుకుంది నండూరి సుందరీనాగమణి.
‘తీరిక సమయాల్లో కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తున్న నేను పిల్లల చదువుకోసం ఇంటర్నెట్‌ను పరిచయం చేసుకున్నాను. పచారీ కోసం దినుసుల పేర్లు రాయడం తప్ప ఇతర రాతలు అలవాటు లేని నేను ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగ్ రైటర్‌గా మారాను. దినపత్రికల్లో ఫుడ్‌కాలమిస్ట్‌గా.. చివరకు కథారచయిత్రిగా, పబ్లిషర్‌గా ఎదిగాను. అంతర్జాల పత్రికకు సంపాదకురాలినయ్యాను. ఇలా ఇంటర్నెట్ వల్ల నా కన్నా ఎక్కువ ఉపయోగపడినవారు లేరనుకుంటా’ అంటూ చర్చకు ముగింపు పలికారు రచయిత్రి జ్యోతి వలబోజు.