జయమాలిని
వెండితెరను 15 ఏళ్లు ఏలిన హాట్ లేడీ. ఆ నాటి యువతను ఉర్రూతలూగించిన భామ. ఎవరు తెరపై కనిపిస్తే గుండె వేగం పెరుగుతుందో, ఎవరు చిందేస్తే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో, ఎవరు కవ్విస్తే వంట్లో నరాలు జివ్వుమంటాయో ఆమే అందల సుందరి 'జయమాలిని'. నాటి తరం ప్రేక్షకుల్లో జయమాలిని అంటే తెలియనివారుండరు. 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు యువప్రేక్షకులను తన డాన్సులతో, సెక్సీ రోల్స్తో ఓ రేంజ్లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్లో చాలా హాట్ హాట్గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అసలు జయమాలిని ప్రత్యేకత ఏంటి?
ఐటమ్ సాంగ్స్లో రికార్డ్ జయమాలినిదే!
నేటి తరం ఐటమ్ డాన్సర్స్లా జయమాలిని సన్నగా, మెరుపు తీగలా ఉండేవారు కాదు. బొద్దుగా, ముద్దుగా, కళ్లు జిగేల్మనిపించే అందంతో ఉండేవారు. ఆమె దక్షిణ, ఉత్తరాది భాషల్లో మొత్తం 500 సినిమాలలో నటించారు. అది కూడా కేవలం ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ రోల్స్ మాత్రమే చేశారు. అదే నేటి తరంలో ప్రత్యేక పాటలు చేసే తారలను తీసుకుంటే... పట్టుమని 50 సినిమాలు చేయడం గగనమవుతోంది. అలాగే, వచ్చిన నాలుగైదేళ్లకే కనుమరుగవుతున్నారు. కానీ జయమాలిని అత్యధిక ఐటమ్ సాంగ్స్ చేసి రికార్డ్ సాధించారు. వెండితెరను ఆమె ఏలినన్ని సంవత్సరాలను ఏ ఐటమ్ తార ఏలలేదు.
'సంతోషం' వేదికపై మెరవనున్న జయమాలిని
నాటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయమాలిని వెండితెరకు దూరమైన తర్వాత పబ్లిక్లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. కానీ, జయమాలిని నాటి తరం అభిమానులతో పాటు.. నేటి తరం వారికి కూడా ఆమెను చూసే భాగ్యం కలుగుతోంది. అందుకు ఈరోజు హైదరాబాద్లో జరిగే 'సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్' వేడుక వేదిక కానుంది. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జయమాలిని వస్తున్నారు.