jayamalini
-
సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని
క్షణికావేశం, విరక్తి.. మనిషి జీవితాన్ని కోల్పోవడానికి కారణం అవుతుంటాయి. మరి ఏమైందో ఏమో గానీ శృంగార తార సిల్క్ స్మిత అప్పట్లో ఇలానే బలవన్మరణానికి పాల్పడింది. 35 ఏళ్ల వయసులోనే అంటే 1996లోనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అప్పట్లో స్మితతో పాటు పలు సినిమాలు చేసిన జయమాలిని.. తాజాగా స్మిత మరణం గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) 'అతి తక్కువ కాలంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాట డబ్బు సంపాదించిన నటి సిల్క్ స్మిత. షూటింగ్ స్పాట్లో ఆమె నాతో మాట్లాడేదే కాదు. ఓ సినిమాలో హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత నటించాం. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అది ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు' 'ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకూడదు. ఎందుకంటే సిల్క్ స్మిత.. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. ఒకవేళ తల్లిదండ్రులు పక్కనుంటే బాధలో అండగా ఉండేవారు. సొంతవాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్ స్మిత బలైపోయింది' అని జయమాలిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయాయి. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్ హారిక నారాయణ్) -
పెళ్లిపీటలెక్కుతున్న జయమాలిని తనయుడు!
స్పెషల్ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసిన నిన్నటితరం హీరోయిన్ జయమాలిని. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్ ఉండేది. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది. కెరీర్ ప్రారంభంలో ఒకటీరెండు సినిమాల్లో హీరోయిన్గా నటించినా తర్వాత మాత్రం డ్యాన్సర్‌గానే అభిమానులను ఉర్రూతలూగించింది. పోలీస్ అధికారి పార్తీబన్‌ను పెళ్లాడిన తర్వాత ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించింది. కాగా జయమాలిని తనయుడు శ్యామ్ హరి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న చెన్నైలోని వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్‌లో శ్యామ్ పెళ్లి జరగనుందంటూ ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయట. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినీప్రముఖులు సైతం మండపానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారట. చదవండి: ఆ కష్టం విలువ తెలుసు, మా పిల్లల్ని అలానే పెంచుతాం: ఉపాసన -
ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని
సీనియర్ నటి జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన స్పెషల్ సాంగ్‌లో నటించి అలరించారు. అలనాటి నటి, డాన్సర్ జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జయమాలిని అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. బెసిగ్గా సినిమాల్లో డాన్సర్ అయిన ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. దాదాపు రెండు దశబ్దాలకు పైగా వెండితెరపై డాన్సర్‌గా అలరించిన ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. చదవండి: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.: హీరోయిన్ ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానళ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిర విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు చాలామంది ప్రపోజ్ చేశారని చెప్పారు. ‘అప్పట్లో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. పెళ్లి కూడా చేసుకుంట అని వెంటపడ్డారు. ఇక నాకు వచ్చే లవ్ లెటర్స్ చూడటానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉండేవారు. ఇంక కొందరైతే బ్లడ్తో రాసేవారు. ఓ మిలిటరి ఆఫీసర్ కూడా నాకు లవ్ లెటర్ రాశారు. పెళ్లి గురించి మా అమ్మ-నాన్నతో కూడా మాట్లాడతా అన్నారు. ఇంక కొందరు మాత్రం మా అమ్మను అడిగే ధైర్యం లేక మా అక్క(జ్యోతి లక్ష్మితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవారు’ అంటూ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఇక తన వెంట అంత మంది పడితే తాను మాత్రం ఓ స్టార్ హీరోని ప్రేమించానంటూ సీక్రెట్ బయటపెట్టారు. ‘నేను ఓ స్టార్ హీరోను ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించారు. కానీ ఇద్దరం బయటక పడలేదు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు. ఓ సారి షూటింగ్లో రాత్రి నా దగ్గరి వచ్చి చెప్పడానికి చూశారు. చదవండి: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! కానీ ధైర్యం లేక గొంతు సవరించి చెప్పకుండానే వెళ్లిపోయారు. నేను కూడా ధైర్యం లేక ఈ విషయం ఆయనకు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నాది రియల్ లవ్. నాకు వయసై చనిపోయేలోపు ఆ హీరో కలిసి ఈ విషయం చెబుతాను. ఆయన ఇప్పటికి బతికే ఉన్నారు. ఆయనకు పెళ్లయింది, భార్య పిల్లలు కూడా ఉన్నారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరూ, ఏ భాషకు చెందినవారనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే తనకు పెళ్లయిందని, తన భర్త తనని బాగా చూసుకుంటారని ఆమె పేర్కొంది. -
ఐటమ్ క్వీన్
నేల క్లాసు ప్రేక్షకుడు శ్రీదేవి పాటకు ఒక ఈల వేస్తేఈమె పాటకు రెండు ఈలలు వేస్తాడు.సెకండ్ హాఫ్‌లో మారువేషంలో ఉన్న హీరో క్లబ్లో ఈమెతో ఆడిపాడితేనే నిర్మాతకు నాలుగు పైసలు వస్తాయి.కాకాహోటళ్ల వేలాది తడికలు ఈమె పోస్టర్లనే ఒళ్లంతా కప్పుకునే బజ్జీలు, పునుగులు అమ్ముకున్నాయి.అశ్లీలతను దరి చేరకుండా శృంగారాన్ని ఒలకబోయడం ఎలాగో ఈమె మాత్రమే నేర్పించింది. ఇవాళ్టి వేలాది ఐటమ్ సాంగ్స్‌కి తొలి స్టెప్ వేసింది ఈమే.ఐటమ్ క్వీన్... జయమాలిని. నిన్న పుట్టినరోజు ఎలా జరుపుకున్నారు? ఇప్పటివరకూ జరిగినవాటిలో మీకు బాగా గుర్తుండిపోయిన బర్త్‌డే గురించి? జయమాలిని: గుర్తుండిపోయినదంటే.. ఒకసారి నా బర్త్‌డేకు జయప్రద, విఠలాచార్య, రామానాయుడుగార్లు.. ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చారు. అప్పట్లో మేమంతా చెనై్నలో ఉండేవాళ్లం. వాళ్ల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా అనిపించింది. ఇప్పుడంటే అందరం వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నాం. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చాలామంది అక్కడికెళ్లిపోయారు. మేం కొంతమంది చెన్నైలో ఉండిపోయాం. ఇక ఈ పుట్టినరోజు గురించి చెప్పాలంటే ఎప్పటిలానే కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకున్నాను. మహాలింగపురం (చెన్నై)లోని అయ్యప్ప గుడిలో అభిషేకం చేయించాం. మామూలుగా మా ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా, నా పెళ్లి రోజైనా, వేరే ఏ వేడుక చేసుకున్నా అనాధాశ్రమంలోని వారికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఈసారి కూడా అలానే చేశాం. బర్త్‌డేలు గ్రాండ్‌గా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేదా మీకు? అప్పట్లో చెన్నైలో న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్ ఫేమస్. నా ప్రతి బర్త్‌డేని దాదాపు మా అమ్మగారు అక్కడే చేసేవారు. తర్వాత తర్వాత ఎందుకమ్మా ఇదంతా? అని అడిగితే, ఏదో నా ముచ్చట కోసం అని అమ్మ అనేవారు. మీరేమో మా తెలుగమ్మాయి అనుకుంటాం. కానీ చెన్నైలో పుట్టి పెరిగినట్లు తెలిసింది. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? మా తాతగారు, అమ్మమ్మలది కర్నూల్. తర్వాత మా అమ్మమ్మ వాళ్లు తమిళనాడు కాంచీపురంలో సెటిల్ అయిపోయారు. మా అమ్మ (శాంభవి)గారికి పన్నెండేళ్లకే పెళ్లి చేసేశారు. నాన్న (టీకే రామరాజన్)గారు తమిళ్. మా ఇంట్లో ఎక్కువగా తమిళంలో మాట్లాడతాం. ఊహ తెలిశాక అమ్మమ్మ తెలుగులో మాట్లాడుతుంటే నాకు అర్థం అయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత అడిగితే తాతయ్య, అమ్మమ్మ తెలుగువాళ్లని అమ్మ చెప్పారు. నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. నేను తెలుగింటి అమ్మాయిని, తమిళ పొన్నుని కూడా (నవ్వుతూ). సినిమా ఇండస్ట్రీలో నాన్నగారిది పెద్ద పేరున్న ఫ్యామిలీ. ఆయనకు ఐదుగురు సిస్టర్స్. మా అత్త కూతుళ్లల్లో ఒక కూతురు టీఆర్ రాజకుమారి తమిళ సినిమా ఇండస్ట్రీలో ‘ఫస్ట్ డ్రీమ్ గర్ల్’గా పేరు తెచ్చుకున్నారు. రాజకుమారి సోదరుడు టి.ఆర్. రామన్న అప్పట్లో తమిళంలో పెద్ద పేరున్న దర్శకుడు. మరో అత్త కూతురు కుచలకుమారికి కూడా నటిగా మంచి పేరుంది. రాజకుమారి, కుచలకుమారి తెలుగు సినిమాల్లోనూ చేశారు. మా నాన్నగారు నిర్మాత. వినాయక పిక్చర్స్ బేనర్ మీద చాలా సినిమాలు తీశారు. మీ తోడబుట్టినవాళ్ల గురించి? జ్యోతిలక్ష్మిగారు నాకు అక్క. ఆ తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. నేను లాస్ట్ అమ్మాయిని. అమ్మానాన్నలకు మేం మొత్తం ఎనిమిది మంది సంతానం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులేవైనా ఉండేవా? నాన్నగారు సినిమాల్లో అన్నీ పోగొట్టేశారు. మేం ఉంటున్న ఇంటిని కూడా అమ్మాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సినిమాల్లోకి వచ్చాను. ఆ ఇల్లుని నేనే కొనేశాను. అప్పట్లో నాకేం తెలియదు. వాహినీ స్టూడియోలో యాక్ట్ చేయడం ఒక్కటే తెలుసు. ఎంత తీసుకుంటున్నాం? ఎంత ఖర్చవుతోంది? అనే విషయాలు కూడా తెలియదు. డ్యాన్స్ మూమెంట్లు బాగా రావాలని దేవుడిని మొక్కుకునేదాన్ని. అదొక్కటే తెలుసు. అనుకున్నట్టుగానే స్టెప్స్ అన్నీ బాగా వచ్చేవి. ‘మీరు చాలా త్వరగా పూర్తి చేస్తారు కాబట్టే మిమ్మల్ని తీసుకుంటున్నాం’ అని నిర్మాతలు అనేవారు. అవి చిన్న చిన్న సంతోషాలు. అవన్నీ దేవుడు ఇచ్చినవే.. మనం చేసిందేం లేదని నమ్ముతాను. ఎవరైనా అడిగితే కాదనకుండా సహాయం చేసేదాన్ని. ఆర్థిక వ్యవహారాలన్నీ అమ్మ చూసుకునేవారు. బ్రదర్స్, సిస్టర్స్‌ని సెటిల్ చేయడంలో మీ చేయి ఉందన్న మాట.. అలా కాకుండా ఉండి ఉంటే... డబ్బు మొత్తం మీకే మిగిలి ఉండేదనే ఫీలింగ్ ఏమైనా? అస్సలు లేదు. డబ్బులది ఏముంది? డబ్బు మీద ప్రేమ ఎప్పుడూ లేదు నాకు. ఇంటికి ఏం చేయాలో మా అమ్మగారే చూసుకునేవారు. దేవుడు, అమ్మ. నాకు ఈ ఇద్దరే. దేవుడు ఆడిస్తున్నాడు... మనం ఆడుతున్నాం అనుకునేదాన్ని. ఇప్పుడు మావాళ్లంతా బాగున్నారు. అది నాకు ఆనందంగా ఉంటుంది. మీరెంత వరకు చదువుకున్నారు? ఏడో తరగతి వరకు చదువుకున్నాను. నాన్నవైపు అందరూ సినిమాల్లోనే ఉన్నారు కాబట్టి అమ్మకి నన్ను సినిమాల్లో చేయించాలని ఉండేది. నాకు డ్యాన్స్ నేర్పించారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను డ్యాన్స్‌లు చేసేదాన్ని. నా ఫస్ట్ సినిమా విఠలాచార్యగారి ‘ఆడదాని అదృష్టం’ (1975). ‘చిన్న అమ్మాయి కదా.. ఏదైనా క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది’ అని అమ్మ అంటే.. ‘ఫుల్ సినిమా అయిపోయింది. సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. ఎలానూ డ్యాన్స్ బాగా చేస్తుంది కదా.. చేయించండి’ అన్నారు. చేశాను. ఆ సినిమాలో ‘మొన్ననే వయసు వచ్చింది..’ అనే పాట చేశాను. ఆ తర్వాత ‘భక్త కన్నప్ప’, ‘ముత్యాల ముగ్గు’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్స్ చేశాను. విఠలాచార్యగారే మళ్లీ ‘గంధర్వ కన్య’ చిత్రంలో హీరోయిన్గా పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ‘మదన మంజరి’లో రంగనాథ్గారి సరసన హీరోయిన్గా తీసుకున్నారు. విఠలాచార్యగారి ‘జగన్మోహిని’లో టైటిల్ రోల్ చేశాను. అప్పట్లో మీరు చేసినవాటిని ఇప్పుడు ‘ఐటమ్ సాంగ్స్’ అంటున్నారు. ఆ సాంగ్స్ చేస్తుంటే మీ నాన్నగారు ఏమీ అనేవారు కాదా? అప్పటికే అందరూ సినిమాలు వదిలేశారు. ఏమీ అనలేదు. ఒకవేళ ‘మదన మంజరి’ సక్సెస్ అయ్యుంటే హీరోయిన్గా కొనసాగేదాన్నేమో. ఆ పిక్చర్ యావరేజ్‌గా నడిచినట్లు గుర్తు. హీరోయిన్గా కంటిన్యూ కాలేకపోయినందుకు ఏమైనా బాధ ఉందా? అదేం లేదు. గిరిబాబుగారిని తీసుకుందాం. ఆయన హీరోగా వచ్చి విలన్‌గా కొనసాగారు. హీరోగా చేస్తున్నారు కదా.. ఈయన ఎందుకు విలన్ అయ్యారు? అనుకునేదాన్ని. అదే మాట గిరిబాబుగారితో అంటే, ‘హీరోగానే ఎంట్రీ ఇచ్చాను. క్లిక్ అవ్వలేదు’ అన్నారు. మోహన్‌బాబుగారిని తీసుకుందాం. విలన్‌గా వచ్చిన ఆయన హీరో అయ్యారు. కలిసి రావాలి కదా. అయినా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏదైనా పాట వస్తే నా స్నేహితులంతా నన్ను డ్యాన్స్ చేయమనేవారు. చేసేసేదాన్ని. అందుకని సినిమాల్లో ఇష్టంగానే డ్యాన్స్ చేశాను. నిజం చెప్పాలంటే మీరు మంచి అందగత్తె. మంచి రంగు, ఎత్తు ఉంటారు. హీరోయిన్లకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి.. (నవ్వేస్తూ) దాసరి నారాయణరావుగారు ఇదే అనేవారు. ‘ఈ అమ్మాయి రాంగ్ రూట్లో వెళ్లిపోయింది. హీరోయిన్ కావాల్సింది. అందంగా ఉంటుంది. ముఖంలో అమాయకత్వం ఉట్టి పడుతుంది’ అని! మా ఆయన (పార్తిబన్) కూడా అంటుంటారు.. ‘నీ ఫేస్ బాగుం టుంది. హీరోయిన్గా ట్రై చేసుండాల్సింది’ అని. సరే.. జరగనిదాని గురించి అనుకుని ఏం లాభం? అయితే ఒక్క విషయం మాత్రం చెబుతాను. గ్లామర్ వేషాలు వేసినా హీరోయిన్లా బ్రతికారు అని చాలామంది అంటారు. అవును... నా స్పేస్‌లో నేను హీరోయినే కదా. సావిత్రిగారు, వాణిశ్రీగారు, శారదగారు వంటి హీరోయిన్ల అభిమానులందరూ కూడా మీకు అభిమానులే. ఆ పరంగా ఆలోచిస్తే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే కదా? ఏమో.. ఆ విషయం నేను చెప్పకూడదు. ఆ సంగతలా ఉంచితే... ఆ రోజుల్లో తుపాను బాధితుల సహాయార్థం పెద్దాయన (అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్గార్లను పెద్దాయన, చిన్నాయన అనేవాళ్లం) విరాళం సేకరించాలనుకున్నారు. మేం ఆర్టిస్టులం చాలామంది వెళ్లాం. పేరున్న హీరోలు, హీరోయిన్లు, నేను.. మేమంతా ప్రజల దగ్గరకు వెళ్లాం. మిగతా ఆర్టిస్టులకు సమానంగా నాకూ పెద్ద మొత్తం వచ్చింది. ఆ విధంగా బాధితులకు నా వంతుగా సహాయం చేయగలిగినందుకు ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. మీ పేరు అలమేలు మంగ కదా? జయమాలిని అని ఎవరు మార్చారు? విఠలాచార్యగారు మార్చారు. ఆర్టిస్ట్‌గా ఓ మంచి పేరుతో రావాలన్నారు. ‘జయ మంగ’ అని పెడితే బాగుంటుందా? అని అమ్మ అన్నారు. విఠలాచార్యగారు వద్దన్నారు. ఫైనల్‌గా ‘జయమాలిని’ పేరు సెట్ అయింది. జయ అంటే జయం. మాలిని అంటే అందం. ఇలా అనుకుని మా అమ్మే ఆ పేరు పెట్టారు. సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు నేను జయమాలిని. అమ్మవాళ్లంతా ఇంట్లో అలివేలు, మంగ అని పిలిచేవారు. మీరు చేసినవన్నీ హాట్ సాంగ్స్ కాబట్టి కాస్ట్యూమ్స్ నచ్చకపోతే నేను వేసుకోను అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు షూటింగ్ అంటే భయం, పెద్ద పెద్దవాళ్ల ముందు డ్యాన్స్ చేయాలంటే భయం. పెద్దాయన, చిన్నాయన, రామకృష్ణగారిలాంటి వాళ్ల పక్కన డ్యాన్స్ చేయాలి. రామకృష్ణగారు కమాన్ అనేవారు. నా ధ్యాస డ్రెస్ మీద ఉండేది కాదు. డ్యాన్స్ బాగా చేస్తానా? లేదా? అనేదాని మీద ఉండేది. కెమెరా ముందుకెళ్లి డ్యాన్స్ చేయడం, షాట్ ఓకే కాగానే కప్పుకోవడం. అంతే.. అప్పట్లో హీరోలైనా విలన్స్ అయినా పొరపాటున కూడా ఎక్కడ పడితే అక్కడ తాకేవాళ్లు కాదు. అంత సంస్కారంగా ఉండేవాళ్లు. వాళ్లంతా మహానుభావులు. మిమ్మల్నెవరైనా వ్యాంప్ అంటే కోపం వచ్చేదా? కోపం ఎందుకు? నేను చేసిన పాత్రలకు ‘వ్యాంప్ క్యారెక్టర్’ అనే పేరుండేది. వ్యాంప్ అనే పాత్ర పోషిస్తున్నాం అనుకునేదాన్ని. అది కూడా యాక్టింగే కదా. హీరోల కోసం, హీరోయిన్ల కోసం సినిమాలు ఆడేవి. రాజబాబుగారి కామెడీ కోసం ఆడేవి. తర్వాత తర్వాత స్పెషల్ సాంగ్స్ కూడా విజయంలో భాగం అయ్యాయి. ‘ఈ అమ్మాయి చాలా స్పీడ్‌గా డ్యాన్స్ చేస్తుంది’ అని అందరూ అభినందించేవారు. మీ ప్రొఫెషన్లో మీకు ప్రశంసలు లభించినప్పుడు ఎంత ఆనందపడతారో నేనూ అంతే. అయితే సినిమాల్లో హాట్‌గా కనిపిస్తారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్.. ముఖ్యంగా లేడీస్ మిమ్మల్ని తక్కువగా చూస్తారనే ఆలోచన ఏమైనా ఉండేదా? కొంతమంది అలా చూసే అవకాశం లేకపోలేదు. అయితే నేను ఎక్కువగా బయటకు వెళ్లేదాన్ని కాదు. వెళితే గుడికి వెళ్లేదాన్ని. ఇప్పుడంతా మారిపోయింది కదా. బయట కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంతెందుకు? మా అబ్బాయి చీరలు కట్టుకోవద్దు. జీన్స్ వేసుకో అంటుంటాడు. అప్పటి జనరేషన్ వేరు. సినిమాల్లో మేం వేసుకునే డ్రెస్సుల గురించి అదోలా మాట్లాడుకునే అవకాశం ఉంది. అయితే మేం డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసేవాళ్లం. ‘పాటకు ముందు సీన్ చాలా విషాదంగా ఉంటుంది. అందుకని గ్లామరస్‌గా డ్రెస్ చేసుకోవాలి’ అనేవారు. మేం పాటించేవాళ్లం. ఒక్కోసారి నిర్మాతలే డైరెక్టర్లతో మాకు గ్లామరస్ డ్రెస్ వేయించమని చెప్పేవారట. ఆ విషయం మాకు అప్పుడు తెలియదు. తర్వాత తర్వాత తెలిసింది. పాటల సాహిత్యం విషయానికొస్తే.. ‘ఓ సుబ్బారావు.. ఓ అప్పారావు.. ఓ వెంకట్రావు.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా.. అయినా కానీ రెడీ’ వంటి లైన్స్‌కి డ్యాన్స్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారా? ఆ ఇబ్బంది కాస్త ఉంటుంది. అయితే అది కాసేపే. ఆ తర్వాత ఇది మన ప్రొఫెషన్ కదా అనిపించేది. హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ‘ఈ అమ్మాయి ఇలా డ్రెస్ చేసుకుంటే మేం సినిమా చెయ్యం. ఈ పాట ఇలా ఉండటానికి వీల్లేదు’ అనలేదు కదా. సినిమాకి అలానే కావాలన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే కథ చెప్పేటప్పుడే నిర్మాతలు జయమాలినితో కచ్చితంగా సాంగ్ ఉండాలని అన్నారేమో. కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చేసినా అది సినిమా కోసమే. ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్‌ని తీసుకుందాం. హండ్రెడ్ పర్సంట్ దానికి న్యాయం చెయ్యాలనుకుంటారు. మరి.. మేం కూడా మా వృత్తికి న్యాయం చేయాలి కదా. మీ అక్క జ్యోతిలక్ష్మిగారు కూడా స్పెషల్ సాంగ్స్ చేసేవారు.. మీ ఇద్దరికీ పోటీ ఉండేదా? లేదండి. పోటీ అని మేమనుకోలేదు. అప్పట్లో అలా రాసి ఉంటారేమో. కానీ మేం మాత్రం మా ఇద్దరిలో ఎవరికి ఏ అవకాశం వచ్చినా హ్యాపీగానే ఉండేవాళ్లం. నిజానికి జ్యోతిగారి రీ ఎంట్రీ నా వల్లే అయింది. తల్లయ్యాక జ్యోతిగారు బ్రేక్ తీసుకున్నారు. ఆ సమయంలో నన్ను ఓ పాత్రకు ఒక దర్శకుడు అడిగితే ‘జ్యోతిగారు రీ–ఎంట్రీ ఇస్తానంటున్నారు. ఆమెని తీసుకుంటారా’ అనడిగితే.. ఓకే అన్నారు. ఆ తర్వాత అక్క చాలా సినిమాలు చేశారు. మేం ఇద్దరం కలసి చేసిన పాటలకు ఇద్దరూ ఒకేసారి ఒకేలా ట్రైనింగ్ తీసుకునేవాళ్లం. ఇద్దరం రాజీపడకుండా చేసేవాళ్లం. మీ పెళ్లి విషయానికి వద్దాం... వ్యాంప్ క్యారెక్టర్స్ చేస్తున్నాం.. పెళ్లవుతుందో లేదో అనే భయం ఉండేదా? ఆ భయం ఎప్పుడూ లేదు. ఇంట్లో నా బ్రదర్స్, సిస్టర్స్ అందరి పెళ్లిళ్లూ అయిపోయాయి. నాక్కూడా మంచి సంబంధం చూసి చేయాలని అమ్మ అనుకునేవారు. పార్తిబన్గారు నాకు మంచి భర్త అవుతారని అమ్మ అనుకున్నారు. ఆవిడ అనుకున్నట్టుగానే పార్తిబన్గారు నాకు మంచి భర్త అయ్యారు. ఆ సంబంధం ఎలా వచ్చింది? మేం ఉండే పక్క వీధిలో వాళ్లు ఉండేవాళ్లు. మా అన్నయ్యకి ఫ్రెండ్. అలా ఆ ఇంటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా కనిపించాను కానీ విడిగా నేను సింపుల్‌గా ఉండేదాన్ని. చీరలు కట్టుకునేదాన్ని. మగవాళ్లతో మాట్లాడేదాన్ని కాదు. అన్నయ్య ఫ్రెండ్ వచ్చినా పట్టించుకునేదాన్ని కాదు. కానీ అమ్మ మాత్రం పార్తిబన్గారిని గమనిస్తుండేవారట. చెడు అలవాట్లు లేవు, మంచి అబ్బాయి అనుకున్నారట. అల్లుడిని చేసుకోవాలనుకున్న తర్వాత ఆ విషయాలు నాతో చెప్పారు. అటు పార్తిబన్గారి అమ్మగారికి కూడా నేను కామ్‌గా ఉండటం నచ్చేది. అందుకే పెళ్లి ప్రస్తావన తేగానే ఒప్పుకున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎవరూ చెప్పలేదా? లవ్ అన్నవాళ్లు ఉన్నారు. లవ్ లెటర్స్ కూడా వచ్చేవి. చదవడానికి బాగుండేవి కానీ ఆ ప్రేమను అంగీకరించాలనిపించేది కాదు. ఎందుకంటే అప్పుడు నా మనసంతా నా ఫ్యామిలీ మీదే ఉండేది. ప్రేమ కంటే ఫ్యామిలీ అనిపించింది. మీకెంతమంది పిల్లలు? ఒకే ఒక్క బాబు. న్యూయార్క్‌లో ఉన్నాడు. నేను చదవలేదు కాబట్టి మా అబ్బాయిని బాగా చదివించాలన్నది నా కోరిక. మీరు చేసిన పాటల్లో మీవారికి, మీ అబ్బాయికి నచ్చిన పాట గురించి? ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలోని ‘కౌగిలిలో ఉయ్యాల.. కన్నులలో జంపాల...’ పాట అంటే ఇద్దరికీ ఇష్టం. ఆ పాట బాగా చూస్తారు. చూసినప్పుడల్లా ‘నువ్వు హీరోయిన్గా చేసి ఉంటే బాగుండేది’ అని మావారు అంటుంటారు. నా పాటలు ఇప్పుడు చూస్తుంటే.. నాక్కూడా బాగా అనిపిస్తుంది. ఆ పాటలు చూసి ఎంజాయ్ చేసినవాళ్లందరూ మన జీవితంలో ఓ భాగమే కదా అనుకుంటాను. ఫైనల్లీ.. జీవితం పట్ల ఏదైనా నిరాశ? లేనే లేదు. చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చాను. ఏడో తరగతి తర్వాత చదువుకోలే పోయాను. అయితే చదువుకోవాలని కెరీర్‌ని వదిలేసుంటే పెద్ద పెద్దవాళ్లతో సినిమాలు చేయగలిగేదాన్నా? అభిమానులను సంపాదించుకోగలిగేదాన్నా? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో చేశాను. అన్ని చోట్లా మంచి పేరే తెచ్చుకున్నాను. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? చాలా ఆనందంగా ఉన్నాను. అప్పట్లో నటీమణులు ఆల్మోస్ట్ బొద్దుగానే ఉండేవారు. మీరు తగ్గాలని అనుకునేవారు కాదా?అసలు ఆ ఆలోచనే ఉండేది కాదు. ఫస్ట్ సినిమాలో నేను చాలా సన్నగా ఉంటాను. అప్పుడు ఆర్టిస్ట్ లతగారి అమ్మగారు ‘ఇలా పీలగా ఉంటే ఎలా? పప్పు, నెయ్యి పెట్టండి. హల్వా తినిపించండి. అప్పుడే మనిషి బాగా కనపడుతుంది’ అని మా అమ్మతో అనేవారు. అప్పట్లో సన్నగా ఉన్నవాళ్లను బరువు పెరగమనేవాళ్లు. మేం కూడా శుభ్రంగా తినేవాళ్లం. ఎక్సర్సైజ్ అంటే.. మెరీనా బీచ్‌కి వెళ్లేవాళ్లం. కాసేపు నడిచేవాళ్లం. అదే ఎక్సర్సైజ్ అన్నమాట. నటిగా మీ ఎదుగుదలకు, వ్యక్తిగా మీ మంచీ చెడూ చూసిన మీ అమ్మగారి లేని లోటు గురించి? నాన్నగారు 2006లో చనిపోయారు. 2012లో అమ్మ చనిపోయారు. ఎనిమిది మంది పిల్లలను పెంచి, పెద్ద చేసి అందరి జీవితాలను చక్కదిద్దడానికి అమ్మ చేసిన కృషి అంతా ఇంతా కాదు. నాన్న గురించి తక్కువ చెప్పడానికి లేదు. అమ్మ తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరదు. ఆవిడ చనిపోయాక ఓ ఏడాది వరకూ నేను మామూలు మనిషి కాలేకపోయాను. తర్వాత తర్వాత తేరుకున్నాను. అప్పట్లో తిరుపతి వెళ్లినవాళ్లు అట్నుంచి చెన్నై వెళ్లి సినిమా ఆర్టిస్టులను చూడటం జరిగేది. అలా మిమ్మల్ని చూడ్డానికి కూడా అభిమానులు వచ్చేవారా?ఎన్టీఆర్‌గారు, అల్లు రామలింగయ్యగారు, కృష్ణగారు, దాసరి నారాయణరావుగారు, సుమలతగారు, విజయ శాంతిగారు.. ఇలా అందరం టి.నగర్లో ఉండేవాళ్లం. తిరుపతి నుంచి చెన్నై వచ్చి ముందు ఎన్టీఆర్గారింటికి వచ్చేవాళ్లు. ఆయన బయటికొచ్చి అందరికీ నమస్కారం పెట్టి, మాట్లాడేవారు. అల్లు రామలింగయ్యగారు, ఇంకా మిగతా ఆర్టిస్టుల ఇళ్లకు కూడా వెళ్లేవాళ్లు. మా ఇంటికీ వచ్చేవాళ్లు. చాలా ఆనందంగా ఉండేది. ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్‌బాబు.. ఇలా పెద్ద పెద్ద స్టార్స్‌తో చేశారు కదా? వాళ్లు మీతో ఎలా ప్రవర్తించేవారు? పెద్దాయన, చిన్నాయన బాగా మాట్లాడేవారు. అంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ భేషజం ఉండేది కాదు. శోభన్బాబుగారైతే నేను లొకేషన్లోకి అడుగుపెట్టగానే ‘ఎక్స్పర్ట్ వచ్చింది. వాళ్ల అమ్మ కడుపులో ఉన్నప్పుడే డ్యాన్స్ నేర్చేసుకుంది’ అనేవారు. ఇప్పుడు కావాల్సినంత ఖాళీ దొరుకుతోంది కాబట్టి పాత సినిమాలు చూస్తుంటాను. వీళ్లంతా ఎంత త్వరగా దూరమైపోయారు అనిపిస్తుంది. -
ఆరిన జ్యోతి
వ్యాంప్ అన్న పదానికి అందాన్ని అద్దిన నృత్యతార జ్యోతిలక్ష్మి. శృంగారానికి చిరునామా ఈ తారే. నాటి నుంచి నేటి వరకూ జ్యోతిలక్ష్మి చిందేస్తే యువత గుండెల్లో గుబులే. అంతే కాదు యాక్షన్ చిత్రాల్లో జ్యోతిలక్ష్మి రియాక్షన్స్ అదుర్స్. నటనలోనూ, నృత్యంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్న నటి జ్యోతిలక్ష్మి. తమిళసినిమా: 60వ శతాబ్దం నాటి నలుపు-తెలుపు చిత్రాల నుంచి నేటి డిజిటల్ చిత్రాల వరకూ జ్యోతిలా వెలిగిన ధ్రువతార. కొరడారాణి అంటూ కొరడాన ఝళిపించినా, జ్యోతిలక్ష్మి చీర కట్టింది అంటూ శృంగారాన్ని ఒలికించినా అది జ్యోతిలక్ష్మికే సాధ్యమైంది. అప్పట్లోనే పళ్లూడిన ముసలివాళ్లు కూడా గుడ్లప్పగించి చూసేలా చేసిన సొగసులకు సొంతదారి జ్యోతిలక్ష్మి. ఆమె నటనలో లయ ఉంటుంది. అది ప్రేక్షకుల్లో ఆనందతాండవం చేయిస్తుంది. జ్యోతిలక్ష్మిలోని శృంగార రసం వయసు కుర్రాళ్ల నుంచి వయసు మళ్లిన వారి వరకూ యమ కిక్ ఇస్తుంది. బొబ్బిలిపులి చిత్రంలో ఓ అప్పారావో, ఓ సుబ్బారావో అన్న పాటలో తన సోదరి జయమాలిని మరిద్దరితో ఆడిన ఆట ఇప్పటికీ యువకులకు ఒక మైకమే. ఏ రికార్డింగ్ డాన్స్ కార్యక్రమంలోనైనా ఈ పాట ఉండాల్సిందే. ఇక జ్యోతిలక్ష్మి చీర కట్టింది అంటూ తన పేరునే పల్లవిగా మార్చుకున్న అరుదైన నటి జ్యోతిలక్ష్మి. ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను నింపుతుంది. ఇలా ఒక పక్క కొరడారాణిగా, మరో పక్క సూపర్ డ్యాన్సర్‌గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటి జ్మోతిలక్ష్మి. 80 ప్రాంతంలో జ్యోతిలక్ష్మి పాటలేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె పాట కోసం ఆడిన చిత్రాలు ఉన్నాయంటే నమ్మితీరాలి. అప్పట్లో చిత్రం విడుదలవుతుందంటే అందులో జ్యోతిలక్ష్మి పాట ఉందా? అని బయ్యర్లు అడిగేవారంటే ఆమె డాన్స్ ప్రభావం ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జ్యోతిలక్ష్మి పాటలతోనే నిర్మాతల, బయ్యర్ల గల్లాపెట్టెలు నిండేవి. వ్యాంప్ పాత్రలకు పేరు మోసిన నటిగా పేరొందిన నటి జ్యోతిలక్ష్మి.ప్రఖ్యాత నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలు ఆ తరువాత తరం అంటూ అందరు నటులతోనూ నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది. అదే విధంగా తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్‌ల నుంచి రజనీకాంత్, కమలహాసన్ ప్రస్తుత హీరోలతోనూ నటించి మెప్పించారు. నిన్నటి వరకూ ఏ మాత్రం జోష్ తగ్గకుండా నటిస్తూ వచ్చిన జ్యోతిలక్ష్మి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆమె ఖ్యాతి మాత్రం సినిమా ఉన్నంత వరకూ సజీవంగా ఉంటుంది.ఒక తారగా జ్యోతిలక్ష్మి సాధనకు సెల్యూట్. జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి ఘన నివాళి మంగళవారం వేకువజామున మృతిచెందిన ప్రఖ్యాత నటి జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమిళం, తెలుగు సినీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు.అదేవిధంగా బుల్లి తెర నటీనటులు,రాజకీయప్రముఖులు,అంజిలి ఘటించారు.వారిలో నటి అంబిక,షకీలా,లలితాకుమారి,కోవైసరళ,ఫిలించాంబర్ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నటుడు టీ.రాజేందర్, మనోబాలా, సీఐడీ.శకుంతల, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ తదితర ప్రముఖులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరఫున సమాచార, ప్రచార శాఖామాత్యులు కడంబూర్రాజా నివాళులర్పించారు. అక్క సగం - అమ్మ సగం - సోదరి జయమాలిని జ్యోతిలక్ష్మి నాకు సగం అక్క సగం అమ్మ. మా కుటుంబంలో నేనే చిన్నదానిని. అందుకు అక్కకు నేనంటే ప్రత్యేక ప్రేమ. అక్కడ మంచి డాన్సర్. ఆమె నుంచే నేను నేర్చుకున్నాను. అక్క ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేది. ఎప్పుడూ తనే బెస్ట్. జ్యోతిలక్ష్మి తరువాతే. జయమాలిని చివరి వరకు నటించాలని ఆశించింది. అలానే నటిస్తునే కన్నుమూసింది. నటిగానే కాకుండా ఇంటిలో అన్ని పనులు తనే చేసేది. మధ్యలో అక్క నటనకు దూరం అయితే మళ్లీ నేనే రీ ఎంట్రీ క ల్పించాను. నేను సిఫార్సు చేయడం వలనే పించెల సుబ్బారావు నిర్మించిన మహాశక్తి చిత్రంలో అక్క రీ ఎంట్రీ అయ్యింది. తెలుగులో అగ్ర హీరోలకు దీటుగా: తెలుగులో అగ్ర హీరోల చిత్రాలకు ధీటుగా జ్యోతిలక్ష్మి చిత్రాలు కలెక్షన్ల ను సాధించాయి. తమిళంలో కంటే తెలుగులో పెద్ద స్టార్ ఆమె. నృత్యానికి పెద్ద ఉదాహరణ జ్యోతిలక్ష్మి. నేను చేసిన రెండు చిత్రాలలో తను న టించారు. అందులో ఒకటి రాగం తేడుం పల్లవి చిత్రం ఒకటి. నటిగా జ్యోతిలక్ష్మి ఒక తుఫాన్. తెలుగులో పలు యాక్షన్ కథా చిత్రాలను చేశా రు. ఆమెకు నటన దైవం ఇచ్చిన వరం. మనసున్న మనిషి. ఆమె మనసు బంగారం. జ్యోతిలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఎంజీఆర్‌కు నచ్చిన నటి: మనోబాల జ్యోతిలక్ష్మి మంచి నటి, అంతకంటే మంచి డాన్సర్. మాస్ చిత్రాలు చేశారు. పలు సీరియల్స్ చేశారు. నటుడు ఎంజీఆర్ నటించిన పలు మాస్కథా చిత్రాలతో నటించారు. ఆయనకు బాగా నచ్చిన నటి జ్యోతిలక్ష్మి. ఆమెతో కొన్ని సీరియల్స్‌లో నటించిన అనుభవం నాకు మిగిలింది. -
'ఆమె ఎవరితోనైనా తలదించుకునే మాట్లాడేది'
‘సాక్షి’ తో అలనాటి కథానాయకుడు నరసింహరాజు పెద్ద వాల్తేర్: అలనాటి వెండితెర రాకుమారుడు...జానపద జగన్మోహనుడు. నలుపు తెలుపు నుంచి రంగుల తెరపై మహేంద్రజాలం చేసిన మాంత్రికుడు విఠలాచార్యుడి చేతిలో కత్తి లాంటి హీరో. నిలువెత్తు నట కౌశలానికి నిదర్శనగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ‘నట’రాజు నరసింహరాజు. శతాధిక చిత్రాల్లో నటించి నేడు బుల్లితెరపై బిజీగా ఉన్నారు. విశాఖ నగరంలో ఓ చిత్రం షూటింగ్‌కు వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై గాడ్(గ్రాండ్) ఫాదర్‌గా కనిపిస్తూ నేటి ట్రెండ్‌కు సరిపడేలా తన నటనా ట్రెండ్‌ను సెట్ చేసుకున్నానని చెబుతున్న నరసింహారాజు ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ట్రెండీ డాడీలకే నేటి తరం కనెక్ట్ అవుతారు... మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా మన నటనా ట్రెండ్ సెట్ చేసుకోవాలి. నేటి ఆటా పాటా తీరుతెన్నులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. నాటి నటన ఒక తీరుంటే నేటి యాక్టింగ్‌కి ఒక ట్రెండ్ ఉంది. నాటి డైలాగ్‌లు మీనింగ్‌ఫుల్‌గా ఉంటే... నేటి మాటలకు పాటలకు చాలా మీనింగ్లు ఉంటున్నాయి. ఇప్పటి చిత్రాలన్నింటినీ మ్యూజిక్ డామినేట్ చేస్తున్నది. హోరెత్తించే బ్రాక్‌డ్రాప్ మ్యూజిక్‌లో మీనింగ్లు, డైలాంగ్లకు అంతగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. చాలా ట్రెండీ డాడీలకే నేటి తరం బాగా కనెక్ట్ అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో కొనసాగాలంటే మనమే మారాలి అంతే.. అనుకోకుండా హీరోను అయ్యాను.. డ్రామా లాంటి అనుభవం ఏమీ లేకుండానే నేను అనుకోకుండా హీరోనయ్యాను. అప్పటి దర్శకుడు ఏం చెబితే చాలా చేయడం. వారు చెప్పిన డైలాగ్‌లను చెప్పడమే మావంతు. ఫైట్లు, డ్యాన్స్‌లు పూర్తిగా రావు, అన్నీ పూర్తిగా వచ్చిన తరువాత అవకాశాలు లేకుండా పోయాయి. అందువల్లనే మా చిత్రాలు బాగా ఆడాయని చెప్పలేము, లేదనీ చెప్పలేం. ఆనాటి రోజులు చాలా మంచికథ...అందులోనూ కుటుంబ కథాచిత్రాలంటే బాగా ఆదరించేవారు. అభిమాన నటీనటులంటూ ఎవరూ లేరు... నాకు ప్రత్యేకంగా అభిమాన నటులు, నటీమణులంటూ ఎవరూ లేరు. నా పాత్ర వరకు వారితో కలిసి నటించడం తప్ప ఎలాంటి సంబంధాలుండేవి కావు. ఓ షూటింగ్ తరువాత మరో షూటింగ్లో మరొకరితో నటించడం..అంతే తప్ప ఫలానా వారంటే ప్రత్యేకంగా ఇష్టమనేది లేదు. అలాగే ఆనాటి నటీమణులు కూడా సహనటులతో వారి పాత్రల వరకే పరిమితమయ్యేవారు. జయమాలిని గురించి చెప్పాలంటే షూటింగ్లో ఆమె ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా తలదించుకునే మాట్లాడేది. ఎవరితో అంత చనువుగా ఉన్నట్టు చూడలేదు. చివరికి ఆమె షూటింగ్‌ల నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియా సైతం ఆమెతో మాట్లాడడానికి ఎంతో కష్టపడి ఉంటారు. వెరైటీ పాత్రతో కొత్త చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖలో కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నా పాత్ర హీరోయిన్ల తండ్రి పాత్ర. ఇది పూర్తి వెరైటీ పాత్ర. ఇది నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇంత వరకూ నేను జైహింద్, చందమామ కథలు వంటి చిత్రాల్లో నటించాను. ఇక బుల్లి తెరపై చాలా సీరియల్స్‌లో నటిస్తున్నాను. హీరో కంటే పాత్రకే ప్రాముఖ్యత... నాతో చిరంజీవి కలిసి నటించిన చిత్రం పునాదిరాళ్లు. ఆ చిత్రంలో నేను హీరో కాగా, మరో నలుగురు యువకుల్లో చిరంజీవి ఒకరు. ఆ తరువాత మేమిద్దరం కలిసి నటించిన చిత్రం ‘పున్నమి నాగు’. అందులో చిరంజీవిది యంగ్ రోల్. ఆ చిత్రంలో నేను హీరో అయినప్పటికీ యాంటీ రోల్ చేసిన చిరంజీవే పాపులర్ అయ్యారు. జగన్మోహిని చిత్రంలో అసలు హీరోయిన్ ప్రభ. అయితే జయమాలినే హీరోయిన్ అని అందరూ అనుకుంటారు. అలాగే పున్నమినాగులో చిరంజీవినే హీరోగా అనుకోవచ్చు. ఎవరి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందో వారే హీరో అవుతారు. ఆ చిత్రం తరువాత చిరంజీవితో ఎలాంటి సంబంధాలు లేవు. చాలాకాలం తరువాత శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రం షూటింగ్ సమయంలో ఒకసారి మేం కలిశామంతే. వైజాగ్ వండర్ఫుల్ సిటీ వండర్ ఫుల్ వైజాగ్ నాకు అత్తగారి నగరం. మాది పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గర వట్లూరు. అయితే మా బంధువులందరూ వైజాగ్‌లో డాబాగార్డెన్స్, గాజువాకలో స్థిరపడ్డారు. నా కూతురు, కొడుకు ఇద్దరూ కూడా కెనడాలో స్థిరపడ్డారు. అయితే అక్కడ ఇమడలేక నేను ఆంధ్రలోనే ఉండిపోయాను. సీరియల్స్, సినిమాలతో కాస్తా బిజీగానే గడుపుతున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నాను. -
అప్పట్లో నా సామిరంగా.. జయమాలిని డాన్సు చేస్తే!!
నీ ఇల్లు బంగారం కానూ... నా ఒళ్లు సింగారం కానూ.. అంటూ అలనాటి ప్రేక్షకులను తన మేని విరుపులతో ఉర్రూతలూగించిన మేటి డాన్సర్ జయమాలిని. ఆ రోజుల్లో ఆమె ఒక్క డాన్సు చేశారంటే తామంతా కళ్లు తెరకు అప్పగించి మరీ చూసేవాళ్లమని అంటున్నారు.. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'సంతోషం' సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి జయమాలిని వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రులకు ఆమె తన దర్శన భాగ్యం కల్పించారు. గులాబిరంగు చుడీదార్ ధరించి.. ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా కనిపించిన జయమాలిని అందరినీ అలరించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం.. ఆమె డాన్సుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రోజుల్లో ఆమె డాన్సు చేశారంటే కుర్రాళ్లను పట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. 'గు.. గు... గుడెసుంది' అంటూ డ్రైవర్ రాముడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె ఒక్క డాన్సు చేశారంటే అప్పట్లో నా సామిరంగా.. అంటూ ప్రేక్షకులందరితో పాటు జయమాలినిని కూడా నవ్వుల్లో ముంచెత్తారు. 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు యువప్రేక్షకులకు తన డాన్సులతో ఓ రేంజ్లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్‌లో చాలా హాట్ హాట్‌గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అయితే, జయమాలిని వెండితెరకు దూరమైన తర్వాత పబ్లిక్‌లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించి అందరినీ అలరించారు. -
సంతోషంగా దక్షిణ భారత సినీ పురస్కారాల వేడుక
నృత్యతారగా ఒక తరాన్ని ఉర్రూతలూగించిన జయమాలిని దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో కనబడ్డారు. ‘సంతోషం’ సినీవారపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారత సినీ అవార్డుల వేడుకలో జయమాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహమయ్యాక సంసార బాధ్యతల్లో నిమగ్నమై ఇంటికే పరిమితమైన జయమాలిని తొలిసారిగా పాల్గొన్న సినీ వేడుక ఇదే కావడం విశేషం. అంతేకాదు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వేదికపై నర్తించి, ఆహూతులందరిలో ఆనందాన్ని నింపారు. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఏయన్నార్ స్మారక పురస్కారాల్ని సూపర్‌స్టార్ కృష్ణ (తెలుగు), షావుకారు జానకి (తమిళం), బి.సరోజాదేవి (కన్నడం), అంబిక (మలయాళం) అందుకున్నారు. అలాగే షావుకారు జానకి, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, చంద్రమోహన్, జయమాలిని, అంబికలకు జీవితకాల సాఫల్య పురస్కారాలను అందించారు. ఈ వేడుకలో భాగంగా ‘దర్శకేంద్రుని సినీ స్వర్ణోత్సవ సత్కారం’ పేరిట కె.రాఘవేంద్రరావును ఘనంగా సత్కరించారు. తెలుగు నుంచి ఉత్తమ చిత్రం పురస్కారాన్ని ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి అందించగా, ఉత్తమనటుడు, ఉత్తమ నటిగా అవార్డులు ఆ సినిమా హీరో హీరోయిన్లు పవన్‌కల్యాణ్, సమంతలను వరించాయి. ఉత్తమ దర్శకుని పురస్కారం ఆ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌కు దక్కింది. ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్‌గా ‘సాక్షి’ సీనియర్ సినిమా రిపోర్టర్ డి.జి.భవాని పురస్కారం అందుకున్నారు. ఇంకా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన చిత్రాలకు సంబంధించిన ముఖ్య శాఖలన్నింటికీ ఈ పురస్కారాలందించారు. ‘సంతోషం’ పత్రికాధినేత సురేశ్ కొండేటి ఈ వేడుకను దిగ్విజయంగా నిర్వహించారు. -
హాట్‌లేడీ హైదరాబాద్ రాక!
వెండితెరను 15 ఏళ్లు ఏలిన హాట్ లేడీ. ఆ నాటి యువతను ఉర్రూతలూగించిన భామ. ఎవరు తెరపై కనిపిస్తే గుండె వేగం పెరుగుతుందో, ఎవరు చిందేస్తే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో, ఎవరు కవ్విస్తే వంట్లో నరాలు జివ్వుమంటాయో ఆమే అందల సుందరి 'జయమాలిని'. నాటి తరం ప్రేక్షకుల్లో జయమాలిని అంటే తెలియనివారుండరు. 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు యువప్రేక్షకులను తన డాన్సులతో, సెక్సీ రోల్స్‌తో ఓ రేంజ్లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్‌లో చాలా హాట్ హాట్‌గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అసలు జయమాలిని ప్రత్యేకత ఏంటి? ఐటమ్ సాంగ్స్‌లో రికార్డ్ జయమాలినిదే! నేటి తరం ఐటమ్ డాన్సర్స్లా జయమాలిని సన్నగా, మెరుపు తీగలా ఉండేవారు కాదు. బొద్దుగా, ముద్దుగా, కళ్లు జిగేల్మనిపించే అందంతో ఉండేవారు. ఆమె దక్షిణ, ఉత్తరాది భాషల్లో మొత్తం 500 సినిమాలలో నటించారు. అది కూడా కేవలం ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ రోల్స్ మాత్రమే చేశారు. అదే నేటి తరంలో ప్రత్యేక పాటలు చేసే తారలను తీసుకుంటే... పట్టుమని 50 సినిమాలు చేయడం గగనమవుతోంది. అలాగే, వచ్చిన నాలుగైదేళ్లకే కనుమరుగవుతున్నారు. కానీ జయమాలిని అత్యధిక ఐటమ్ సాంగ్స్ చేసి రికార్డ్ సాధించారు. వెండితెరను ఆమె ఏలినన్ని సంవత్సరాలను ఏ ఐటమ్ తార ఏలలేదు. 'సంతోషం' వేదికపై మెరవనున్న జయమాలిని నాటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయమాలిని వెండితెరకు దూరమైన తర్వాత పబ్లిక్‌లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. కానీ, జయమాలిని నాటి తరం అభిమానులతో పాటు.. నేటి తరం వారికి కూడా ఆమెను చూసే భాగ్యం కలుగుతోంది. అందుకు ఈరోజు హైదరాబాద్‌లో జరిగే 'సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్' వేడుక వేదిక కానుంది. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జయమాలిని వస్తున్నారు.