'ఆమె ఎవరితోనైనా తలదించుకునే మాట్లాడేది'
‘సాక్షి’ తో అలనాటి కథానాయకుడు నరసింహరాజు
పెద్ద వాల్తేర్: అలనాటి వెండితెర రాకుమారుడు...జానపద జగన్మోహనుడు. నలుపు తెలుపు నుంచి రంగుల తెరపై మహేంద్రజాలం చేసిన మాంత్రికుడు విఠలాచార్యుడి చేతిలో కత్తి లాంటి హీరో. నిలువెత్తు నట కౌశలానికి నిదర్శనగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ‘నట’రాజు నరసింహరాజు. శతాధిక చిత్రాల్లో నటించి నేడు బుల్లితెరపై బిజీగా ఉన్నారు. విశాఖ నగరంలో ఓ చిత్రం షూటింగ్‌కు వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై గాడ్(గ్రాండ్) ఫాదర్‌గా కనిపిస్తూ నేటి ట్రెండ్‌కు సరిపడేలా తన నటనా ట్రెండ్‌ను సెట్ చేసుకున్నానని చెబుతున్న నరసింహారాజు ముచ్చట్లు ఆయన మాటల్లోనే...
ట్రెండీ డాడీలకే నేటి తరం కనెక్ట్ అవుతారు...
మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా మన నటనా ట్రెండ్ సెట్ చేసుకోవాలి. నేటి ఆటా పాటా తీరుతెన్నులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. నాటి నటన ఒక తీరుంటే నేటి యాక్టింగ్‌కి ఒక ట్రెండ్ ఉంది. నాటి డైలాగ్‌లు మీనింగ్‌ఫుల్‌గా ఉంటే... నేటి మాటలకు పాటలకు చాలా మీనింగ్‌లు ఉంటున్నాయి. ఇప్పటి చిత్రాలన్నింటినీ మ్యూజిక్ డామినేట్ చేస్తున్నది. హోరెత్తించే బ్రాక్‌డ్రాప్ మ్యూజిక్‌లో మీనింగ్‌లు, డైలాంగ్‌లకు అంతగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. చాలా ట్రెండీ డాడీలకే నేటి తరం బాగా కనెక్ట్ అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో కొనసాగాలంటే మనమే మారాలి అంతే..
అనుకోకుండా హీరోను అయ్యాను..
డ్రామా లాంటి అనుభవం ఏమీ లేకుండానే నేను అనుకోకుండా హీరోనయ్యాను. అప్పటి దర్శకుడు ఏం చెబితే చాలా చేయడం. వారు చెప్పిన డైలాగ్‌లను చెప్పడమే మావంతు. ఫైట్‌లు, డ్యాన్స్‌లు పూర్తిగా రావు, అన్నీ పూర్తిగా వచ్చిన తరువాత అవకాశాలు లేకుండా పోయాయి. అందువల్లనే మా చిత్రాలు బాగా ఆడాయని చెప్పలేము, లేదనీ చెప్పలేం. ఆనాటి రోజులు చాలా మంచికథ...అందులోనూ కుటుంబ కథాచిత్రాలంటే బాగా ఆదరించేవారు.
అభిమాన నటీనటులంటూ ఎవరూ లేరు...
నాకు ప్రత్యేకంగా అభిమాన నటులు, నటీమణులంటూ ఎవరూ లేరు. నా పాత్ర వరకు వారితో కలిసి నటించడం తప్ప ఎలాంటి సంబంధాలుండేవి కావు. ఓ షూటింగ్ తరువాత మరో షూటింగ్‌లో మరొకరితో నటించడం..అంతే తప్ప ఫలానా వారంటే ప్రత్యేకంగా ఇష్టమనేది లేదు. అలాగే ఆనాటి నటీమణులు కూడా సహనటులతో వారి పాత్రల వరకే పరిమితమయ్యేవారు. జయమాలిని గురించి చెప్పాలంటే షూటింగ్‌లో ఆమె ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా తలదించుకునే మాట్లాడేది. ఎవరితో అంత చనువుగా ఉన్నట్టు చూడలేదు. చివరికి ఆమె షూటింగ్‌ల నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియా సైతం ఆమెతో మాట్లాడడానికి ఎంతో కష్టపడి ఉంటారు.
వెరైటీ పాత్రతో కొత్త చిత్రం షూటింగ్
ప్రస్తుతం విశాఖలో కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నా పాత్ర హీరోయిన్‌ల తండ్రి పాత్ర. ఇది పూర్తి వెరైటీ పాత్ర. ఇది నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇంత వరకూ నేను జైహింద్, చందమామ కథలు వంటి చిత్రాల్లో నటించాను. ఇక బుల్లి తెరపై చాలా సీరియల్స్‌లో నటిస్తున్నాను.
హీరో కంటే పాత్రకే ప్రాముఖ్యత...
నాతో చిరంజీవి కలిసి నటించిన చిత్రం పునాదిరాళ్లు. ఆ చిత్రంలో నేను హీరో కాగా, మరో నలుగురు యువకుల్లో చిరంజీవి ఒకరు. ఆ తరువాత మేమిద్దరం కలిసి నటించిన చిత్రం ‘పున్నమి నాగు’. అందులో చిరంజీవిది యంగ్ రోల్. ఆ చిత్రంలో నేను హీరో అయినప్పటికీ యాంటీ రోల్ చేసిన చిరంజీవే పాపులర్ అయ్యారు.
జగన్మోహిని చిత్రంలో అసలు హీరోయిన్ ప్రభ. అయితే జయమాలినే హీరోయిన్ అని అందరూ అనుకుంటారు. అలాగే పున్నమినాగులో చిరంజీవినే హీరోగా అనుకోవచ్చు. ఎవరి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందో వారే హీరో అవుతారు. ఆ చిత్రం తరువాత చిరంజీవితో ఎలాంటి సంబంధాలు లేవు. చాలాకాలం తరువాత శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రం షూటింగ్ సమయంలో ఒకసారి మేం కలిశామంతే.
వైజాగ్ వండర్‌ఫుల్ సిటీ
వండర్ ఫుల్ వైజాగ్ నాకు అత్తగారి నగరం. మాది పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గర వట్లూరు. అయితే మా బంధువులందరూ వైజాగ్‌లో డాబాగార్డెన్స్, గాజువాకలో స్థిరపడ్డారు. నా కూతురు, కొడుకు ఇద్దరూ కూడా కెనడాలో స్థిరపడ్డారు. అయితే అక్కడ ఇమడలేక నేను ఆంధ్రలోనే ఉండిపోయాను. సీరియల్స్, సినిమాలతో కాస్తా బిజీగానే గడుపుతున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నాను.