అప్పట్లో నా సామిరంగా.. జయమాలిని డాన్సు చేస్తే!!
నీ ఇల్లు బంగారం కానూ... నా ఒళ్లు సింగారం కానూ.. అంటూ అలనాటి ప్రేక్షకులను తన మేని విరుపులతో ఉర్రూతలూగించిన మేటి డాన్సర్ జయమాలిని. ఆ రోజుల్లో ఆమె ఒక్క డాన్సు చేశారంటే తామంతా కళ్లు తెరకు అప్పగించి మరీ చూసేవాళ్లమని అంటున్నారు.. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. ఇటీవల హైదరాబాద్లో జరిగిన 'సంతోషం' సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి జయమాలిని వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రులకు ఆమె తన దర్శన భాగ్యం కల్పించారు. గులాబిరంగు చుడీదార్ ధరించి.. ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా కనిపించిన జయమాలిని అందరినీ అలరించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం.. ఆమె డాన్సుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రోజుల్లో ఆమె డాన్సు చేశారంటే కుర్రాళ్లను పట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. 'గు.. గు... గుడెసుంది' అంటూ డ్రైవర్ రాముడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆమె ఒక్క డాన్సు చేశారంటే అప్పట్లో నా సామిరంగా.. అంటూ ప్రేక్షకులందరితో పాటు జయమాలినిని కూడా నవ్వుల్లో ముంచెత్తారు.
1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు యువప్రేక్షకులకు తన డాన్సులతో ఓ రేంజ్లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్లో చాలా హాట్ హాట్గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అయితే, జయమాలిని వెండితెరకు దూరమైన తర్వాత పబ్లిక్లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించి అందరినీ అలరించారు.