ఆరిన జ్యోతి
వ్యాంప్ అన్న పదానికి అందాన్ని అద్దిన నృత్యతార జ్యోతిలక్ష్మి. శృంగారానికి చిరునామా ఈ తారే. నాటి నుంచి నేటి వరకూ జ్యోతిలక్ష్మి చిందేస్తే యువత గుండెల్లో గుబులే. అంతే కాదు యాక్షన్ చిత్రాల్లో జ్యోతిలక్ష్మి రియాక్షన్స్ అదుర్స్. నటనలోనూ, నృత్యంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్న నటి జ్యోతిలక్ష్మి.
తమిళసినిమా: 60వ శతాబ్దం నాటి నలుపు-తెలుపు చిత్రాల నుంచి నేటి డిజిటల్ చిత్రాల వరకూ జ్యోతిలా వెలిగిన ధ్రువతార. కొరడారాణి అంటూ కొరడాన ఝళిపించినా, జ్యోతిలక్ష్మి చీర కట్టింది అంటూ శృంగారాన్ని ఒలికించినా అది జ్యోతిలక్ష్మికే సాధ్యమైంది. అప్పట్లోనే పళ్లూడిన ముసలివాళ్లు కూడా గుడ్లప్పగించి చూసేలా చేసిన సొగసులకు సొంతదారి జ్యోతిలక్ష్మి. ఆమె నటనలో లయ ఉంటుంది. అది ప్రేక్షకుల్లో ఆనందతాండవం చేయిస్తుంది. జ్యోతిలక్ష్మిలోని శృంగార రసం వయసు కుర్రాళ్ల నుంచి వయసు మళ్లిన వారి వరకూ యమ కిక్ ఇస్తుంది.
బొబ్బిలిపులి చిత్రంలో ఓ అప్పారావో, ఓ సుబ్బారావో అన్న పాటలో తన సోదరి జయమాలిని మరిద్దరితో ఆడిన ఆట ఇప్పటికీ యువకులకు ఒక మైకమే. ఏ రికార్డింగ్ డాన్స్ కార్యక్రమంలోనైనా ఈ పాట ఉండాల్సిందే. ఇక జ్యోతిలక్ష్మి చీర కట్టింది అంటూ తన పేరునే పల్లవిగా మార్చుకున్న అరుదైన నటి జ్యోతిలక్ష్మి. ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను నింపుతుంది. ఇలా ఒక పక్క కొరడారాణిగా, మరో పక్క సూపర్ డ్యాన్సర్‌గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటి జ్మోతిలక్ష్మి. 80 ప్రాంతంలో జ్యోతిలక్ష్మి పాటలేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు.
ఆమె పాట కోసం ఆడిన చిత్రాలు ఉన్నాయంటే నమ్మితీరాలి. అప్పట్లో చిత్రం విడుదలవుతుందంటే అందులో జ్యోతిలక్ష్మి పాట ఉందా? అని బయ్యర్లు అడిగేవారంటే ఆమె డాన్స్ ప్రభావం ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జ్యోతిలక్ష్మి పాటలతోనే నిర్మాతల, బయ్యర్ల గల్లాపెట్టెలు నిండేవి. వ్యాంప్ పాత్రలకు పేరు మోసిన నటిగా పేరొందిన నటి జ్యోతిలక్ష్మి.ప్రఖ్యాత నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలు ఆ తరువాత తరం అంటూ అందరు నటులతోనూ నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది.
అదే విధంగా తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్‌ల నుంచి రజనీకాంత్, కమలహాసన్ ప్రస్తుత హీరోలతోనూ నటించి మెప్పించారు. నిన్నటి వరకూ ఏ మాత్రం జోష్ తగ్గకుండా నటిస్తూ వచ్చిన జ్యోతిలక్ష్మి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆమె ఖ్యాతి మాత్రం సినిమా ఉన్నంత వరకూ సజీవంగా ఉంటుంది.ఒక తారగా జ్యోతిలక్ష్మి సాధనకు సెల్యూట్.
జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి ఘన నివాళి
మంగళవారం వేకువజామున మృతిచెందిన ప్రఖ్యాత నటి జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమిళం, తెలుగు సినీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు.అదేవిధంగా బుల్లి తెర నటీనటులు,రాజకీయప్రముఖులు,అంజిలి ఘటించారు.వారిలో నటి అంబిక,షకీలా,లలితాకుమారి,కోవైసరళ,ఫిలించాంబర్ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నటుడు టీ.రాజేందర్, మనోబాలా, సీఐడీ.శకుంతల, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ తదితర ప్రముఖులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరఫున సమాచార, ప్రచార శాఖామాత్యులు కడంబూర్‌రాజా నివాళులర్పించారు.
అక్క సగం - అమ్మ సగం - సోదరి జయమాలిని
జ్యోతిలక్ష్మి నాకు సగం అక్క సగం అమ్మ. మా కుటుంబంలో నేనే చిన్నదానిని. అందుకు అక్కకు నేనంటే ప్రత్యేక ప్రేమ. అక్కడ మంచి డాన్సర్. ఆమె నుంచే నేను నేర్చుకున్నాను. అక్క ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేది. ఎప్పుడూ తనే బెస్ట్. జ్యోతిలక్ష్మి తరువాతే. జయమాలిని చివరి వరకు నటించాలని ఆశించింది. అలానే నటిస్తునే కన్నుమూసింది. నటిగానే కాకుండా ఇంటిలో అన్ని పనులు తనే చేసేది. మధ్యలో అక్క నటనకు దూరం అయితే మళ్లీ నేనే రీ ఎంట్రీ క ల్పించాను. నేను సిఫార్సు చేయడం వలనే పించెల సుబ్బారావు నిర్మించిన మహాశక్తి చిత్రంలో అక్క రీ ఎంట్రీ అయ్యింది.
తెలుగులో అగ్ర హీరోలకు దీటుగా:
తెలుగులో అగ్ర హీరోల చిత్రాలకు ధీటుగా జ్యోతిలక్ష్మి చిత్రాలు కలెక్షన్ల ను సాధించాయి. తమిళంలో కంటే తెలుగులో పెద్ద స్టార్ ఆమె. నృత్యానికి పెద్ద ఉదాహరణ జ్యోతిలక్ష్మి. నేను చేసిన రెండు చిత్రాలలో తను న టించారు. అందులో ఒకటి రాగం తేడుం పల్లవి చిత్రం ఒకటి. నటిగా జ్యోతిలక్ష్మి ఒక తుఫాన్. తెలుగులో పలు యాక్షన్ కథా చిత్రాలను చేశా రు. ఆమెకు నటన దైవం ఇచ్చిన వరం. మనసున్న మనిషి. ఆమె మనసు బంగారం. జ్యోతిలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
ఎంజీఆర్‌కు నచ్చిన నటి: మనోబాల
జ్యోతిలక్ష్మి మంచి నటి, అంతకంటే మంచి డాన్సర్. మాస్ చిత్రాలు చేశారు. పలు సీరియల్స్ చేశారు. నటుడు ఎంజీఆర్ నటించిన పలు మాస్‌కథా చిత్రాలతో నటించారు. ఆయనకు బాగా నచ్చిన నటి జ్యోతిలక్ష్మి. ఆమెతో కొన్ని సీరియల్స్‌లో నటించిన అనుభవం నాకు మిగిలింది.