సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా? | Kanna laxminarayana likely as PCC chief to woo Kapu voters? | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా?

Published Mon, Nov 11 2013 8:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM

సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా?

సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా?

పీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి ముందే తెలంగాణ, సీమాంధ్రులకు వేర్వేరుగా పీసీసీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పదవులకు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు దాదాపు ఖరాయినట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి ఆయన పిలుపువచ్చినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన హస్తిన పర్యటనకు వెళ్లిరావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకే హైకమాండ్ పెద్దలు శ్రీధర్‌బాబును ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

ఇక సీమాంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హైకమాండ్ పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమవడంతో కన్నాకు పీసీసీ పగ్గాలు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధినేత్రి సోనియా గాంధీతో కన్నా సమావేశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మేడమ్తో నేడు ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకుడు తీపి కబురుతో తిరిగొస్తారని కన్నా వర్గీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జోడు పదవులు అనుభవిస్తున్న బొత్స సత్యనారాయణ నుంచి పీసీసీ పీఠాన్ని వేరొకరికి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన నిర్ణయాన్ని హైకమాండ్ అమలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా పదవికి అప్పగిస్తే కాపు ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉంటుందని అధిష్టానం అంచనా వేస్తోస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవికి కన్నా పేరు వినిపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు సత్తిబాబునే తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశమూ లేకపోలేదన్న వాదన విన్పిస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమయితే పీసీసీ పీఠాలు ఎవరికి దక్కుతాయనేది తొందరలోనే తేలుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement