‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్ర ప్రదర్శన
కళాఖండాల సృజన జరిగే తీరును కెమెరాలో బంధించిన మసురం రవికాంత్, ఆ దృశ్యాలను ‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్రంగా మలచారు. అయాకి స్టూడియో సమర్పిస్తున్న ఈ లఘుచిత్రం కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ శిబిరంలో గురువారం రాత్రి 7.00 గంటలకు ప్రదర్శించనున్నారు. ఈ లఘుచిత్రం నిడివి 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే. చూడచక్కని రంగులు, చేయితిరిగిన చిత్రకారుల హస్త నైపుణ్యం, వారి సృజనాత్మకత.. ఇవన్నీ కలగలిస్తేనే ఒక కళాఖండం తయారవుతుంది.
కళాఖండం రూపుదిద్దుకునే ప్రక్రియలో రంగులలో ముంచిన తడితడి కుంచెలు కేన్వాస్‌ను సుతారంగా ముద్దాడుతాయి. ‘ప్రతి కళాకారుడూ తన కుంచెను తన ఆత్మలో ముంచి, తన స్వభావాన్నే తన చిత్రాల్లో చిత్రిస్తాడు’ అనే హెన్రీవార్డ్ బీచర్ మాటలే ప్రేరణగా ‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్రాన్ని రూపొందించిన మసురం రవికాంత్ స్వయంగా చిత్రకారుడు కావడం విశేషం.
-సాక్షి, సిటీప్లస్