అతడు, ఆమె.. ఓ లవర్!
సమాజంలో పతనమవుతున్న నైతిక విలువలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. నీతిబాహ్య సంబంధాలు నవనాగరిక మానవుడికి పరీక్ష పెడుతున్నాయి. విచ్చలవిడి అనైతిక సంబంధాలు వివాహ వ్యవస్థ పవిత్రతను మంటగలుపుతున్నాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న విలువల క్షయం అభిమాన ధనుల పాలిట శరాఘాతంగా మారుతోంది. సున్నిత మనస్కులను బలి కోరుతోంది.
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మరొకరితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక ఓ అమాయక భర్త తన ప్రాణాలు తీసుకున్నాడు. కట్టుకున్న దాన్ని తన దగ్గరికి చేర్చాలని వేడుకున్నా ఖాకీలు కనికరించకపోవడంతో తానే కడతేరిపోయాడు. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఉరిపోసుకుని ఆయువు తీసుకున్నాడు. తన చావుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలుపుతూ 18 నిమిషాల నిడివివున్నవీడియాను సెల్ఫోన్తో రికార్డు చేశాడు. 'సూసైడ్ నోట్'గా వీడియోను వినియోగించడం ఇదే మొదటిసారి భావిస్తున్నారు.
సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల డ్రైవర్ సునీల్ అగ్డీ మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తీసిన వీడియో చూడాలని చిన్న కాగితంపై మరాఠీలో రాసి చనిపోయాడు. తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహబ్ అలియాస్ ఛోటు కారణమని అందులో పేర్కొన్నాడు. ప్రియుడితో లేచిపోయిన తన భార్యను తిరిగి తీసుకురావాలని అగ్రిపడా సబ్-ఇన్స్పెక్టర్ అజిత్ కదం కోరనుగా తనను హేళన చేశాడని, చర్యలేమీ తీసుకోలేదని తెలిపాడు. తనకు చావు తప్ప మరోసారి కనిపించలేదని వీడియాలో సునీల్ వాపోయాడు. సీనియర్ పోలీసు అధికారులు ఈ వీడియో చూసి న్యాయం చెప్పాలని వేడుకున్నాడు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. సునీల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అనురాధ, ఛోటును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు పురిగొల్పడం, నేరానికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కు తరలించారు. తన కోడలు పెడదారి పట్టడడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సునీల్ తల్లి వాపోయింది. ఛోటుతో అనురాధ ఏడేళ్లుగా సంబంధం కొనసాగిస్తోందని అతడి భార్య హీరా తెలిపింది.మొత్తానికి వివాహేతర బంధం రెండు కుటుంబాలను క్షోభ పెట్టింది.