స్టార్ రిపోర్టర్@ కోటి | music director koti spend some time with traffic police | Sakshi
Sakshi News home page

స్టార్ రిపోర్టర్@ కోటి

Published Sun, Sep 21 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

స్టార్ రిపోర్టర్@ కోటి

స్టార్ రిపోర్టర్@ కోటి

ట్రిపుల్ రైడర్స్‌కు టై.. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కంట పడతామేమోనని !
ఆటోవాలాకు హడల్ .. సిగ్నల్ జంప్ చేసినందుకు చలాన్‌తో ఇరగదీస్తాడని !
సెలబ్రిటీలకు భయం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద బుక్ చే సి ఇమేజ్ ఇస్త్రీ చేసేస్తాడని!
రాంగ్ రూట్లో వెళ్లే వాళ్లు.. లెసైన్స్ ఇంట్లో మరచిపోయామని కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్లు.. పాత బండికి ఇన్సూరెన్స్ ఎందుకని అడిగేవాళ్లు.. ట్రాఫిక్ పోలీసులంటే వసూల్‌రాజాలని నెగెటివ్‌గా భావిస్తారు.


తప్పుదారిలో వెళ్తూ చిక్కిన వారికి చలాన్లు రాస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసిన వారందరూ అన్యాయంగా డబ్బులు గుంజుతున్నాడని అనుకుంటారు. నిబంధనల గీత దాటిన వారికి వాత పెడితేనే సెట్ అవుతారంటారు ట్రాఫిక్ పోలీసులు. పొల్యూషన్ పరుచుకున్న దారి.. చెవుల్లో జోరీగల్లా హారన్లు.. కంటిలో నలుసులా ధూళి.. గంటల తరబడి నిల్చుని అలసిన కాళ్లు.. సిటీ రోడ్లపై ట్రాఫిక్ సిబ్బంది పడే కష్టాలు ఇంతింత కాదు. ఇన్ని నెగెటివ్ యాస్పెక్ట్స్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులను ‘సిటీ ప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా మ్యూజిక్ డెరైక్టర్ కోటి పలకరించారు.
 
కోటి: హాయ్.. స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా ఓర్పు కావాలి. రోజుకు వేల మందిని కంట్రోల్ చేస్తుంటారు..

శ్రీనివాసులు: వందలాది మందిని కంట కనిపెట్టాలి.. పొరపాటుగా డ్రైవ్ చేస్తున్నవారిని కంట్రోల్ చేయాలి. ఒకరు సిగ్నల్ జంప్ చేస్తారు.. ఇంకొకరు రాంగ్ రూట్లో వస్తుంటారు.. అన్నీ ఓపిగ్గా చూసుకోవాలి. మా డ్యూటీనే అంత కదా సార్.

కోటి: సిటీ ట్రాఫిక్‌లో ఓ గంట ఇరుక్కుపోతేనే తట్టుకోలేం. అలాంటి ది మీరు రోజంతా దుమ్ము, ధూళిలో ఉంటారు కదా..

మీ పరిస్థితేంటి ?
ఆజామ్: ఒక్క మాటలో చెప్పాలంటే మాది రిస్కీ జాబ్ సార్. ప్రతి రోజూ ఉదయం బెల్లం, నానబెట్టిన శనగలు కలిపి తింటే డస్ట్ నుంచి ఎలర్జీ రాకుండా ఉంటుంది. మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.

సురేష్ కుమార్: ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మిగతా ఉద్యోగులతో పోలిస్తే మా లైఫ్ టైం ఐదారేళ్లు తక్కువే సార్.

కోటి: అవునా.. ఎలర్జీ రాకుండా బెల్లం, శనగలు పని చేస్తాయా..?

శ్రీనివాసులు: యస్ సార్. పీల్చిన దుమ్ముని క్లియర్ చేసే శక్తి వాటికి ఉంటుంది.
 
కోటి: గంటల తరబడి ఉండాలంటే ఓపిక కూడా బాగానే ఉండాలి కదా..!
 
ధనుంజయ్: మాలో ఓపిక పెంచడం కోసం ఏడాదికి రెండు లేదా మూడు సార్లు బీఓసీ (బిహేవియర్ ఆఫ్ ఓరియంటేషన్ కోర్స్) ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో యోగా, మెడిటేషన్ ఉంటాయి. దాంతో మాకు సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది.
 
కోటి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి గురించి చెప్పండి..?

కుమారస్వామి: నేను చిక్కడపల్లి స్టేషన్ పరిధిలో పని చేస్తాను. అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. 80 శాతం మంది రూల్స్ ఫాలో అవుతారు. అసలు చిక్కల్లా 20 శాతం మందితోనే. గల్లీల్లో కూడా తమ స్పీడ్ ప్రదర్శించాలనుకుంటారు. సిగ్నల్స్ ఫాలో అవ్వరు. ఏమైనా అంటే మమ్మల్నే టీజ్ చేస్తూ పోతారు.  
 
కోటి: ఇప్పుడు సిటీలో వెహికల్స్ పెరిగాయి. ఇంటింటికీ బైకులు, కార్లున్నాయి!
 
సురేష్‌కుమార్: సిటీలో చాలా రోడ్లు నిజాం జమానావే. ఆ కాలంలో ఉన్న వాహనాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇక మా పరిస్థితి ఊహించుకోండి.
 
కోటి: రోడ్డుపై చిన్న సంఘటన జరిగినా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది.
 
ధనుంజయ్: దానికి కారణం.. ఇరుకు రోడ్లు, పెరిగిన వాహనాలు, పద్ధతి లేని డ్రైవింగ్ అనుకోరు. మేం సరిగా పనిచేయకపోవడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందనుకుంటారు.
 
శ్రీనివాసులు: నడిరోడ్డు మీద ఏదైనా పెద్ద బండి ఆగిపోతే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అందరూ ట్రాఫిక్ పోలీసులేరని ఆవేశపడిపోతుంటారు. వాళ్లు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలోనే ఉన్నారని ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు.
 
కోటి: డ్రంక్ అండ్ డ్రైవ్‌ని ఎంత వరకూ కంట్రోల్ చేయగలుగుతున్నారు?
 
శ్రీనివాసులు: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇండియాలో చేసిన సర్వేలో.. రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగినవే ఎక్కువని తేలింది.
 
హైదరాబాద్, జలంధర్‌లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. తాగడం అనేది వారి పర్సనల్. కానీ.. తాగి డ్రైవ్ చేసే హక్కు వాళ్లకు లేదు.
 
రాజు: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్  ఏర్పాటు చేశాం. దీన్ని నగరంలో అక్కడక్కడ రోడ్డుపక్కన ఆపి ఉంచుతాం. రోడ్డు ప్రమాదాలపై సీసీ ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన ప్రోగ్రామ్స్ అందులో తిలకించవచ్చు.
 
కోటి: రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు మీరు స్పందించే తీరుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి.
 
శ్రీనివాసులు: ఉద్యోగ ధర్మంగా మాత్రమే కాదు సార్.. అలాంటి సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుంటాం. అలాగే అంబులెన్స్ వెళ్లే దారులను క్లియర్ చేయడంలో వేగంగా స్పందిస్తాం. ఆ టైంలో ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని గుర్తుంచుకుంటాం.
 
కోటి: చివరిగా ప్రశ్న.. ప్రజలందరూ అడుగుదామనుకునే ప్రశ్న. ట్రాఫిక్ పోలీసులు అనగానే చలాన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణ, అలాగే లంచాలు కూడా..
 
శ్రీనివాసులు: మేం వసూలు చేసే డబ్బులను చూస్తారు కానీ మేం ఇచ్చే చలాన్ స్లిప్ చూడరు. ఆ వాహనదారుడు చేసిన తప్పు ఎవరికీ పట్టదు. ముందు మమ్మల్ని నెగటివ్‌గా చూడ్డం మానేయాలి సార్.
 
కోటి: ట్రాఫిక్ పోలీస్ అంటే తప్పు చేయకుండా కాపు కాసే అన్న అనే భావన అందరికీ రావాలి. తప్పు చేసినపుడు మన పెద్దలు దండించినట్టే వీరు కూడా ప్రవర్తిస్తారు. ఎండనకా, వాననకా గంటల తరబడి నిలబడి మన ప్రాణాలను కాపాడుతున్న వీరికి మనం సహకరిద్దాం. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడంలో సిటీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకుందాం. ఇదే ఈ ‘కోటి’ ఆశ.
 
కోటి : నేనొకసారి కేబీఆర్ పార్కు దగ్గర అందరూ పార్కు చేశారు కదా అని నేనూ రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేశాను. వచ్చి చూస్తే కార్‌కు లాక్ వేసేశారు. పోలీసుల దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఫైన్ కట్టాను. అమెరికా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడి ట్రాఫిక్ రూల్స్ గురించి గొప్పగా చెబుతారు. అక్కడ రూల్స్ పాటించిన వారు ఇక్కడకు వచ్చేసరికి రాంగ్ పార్కింగ్‌లు, సిగ్నల్ జంప్ చేస్తారు. అమెరికాలో రెడ్ సిగ్నల్స్ పడగానే వెహికల్స్ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. గ్రీన్ సిగ్నల్ పడగానే స్టార్ట్ చేసుకుని వెళ్లాలి. అలాంటి టెక్నాలజీ మనకూ అందుబాటులోకి వస్తే పొల్యూషన్ కొంతైనా
 తగ్గుతుంది.
 
సుద్దాల పాటకు కోటి ట్యూన్
ట్రాఫిక్ పోలీసులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్‌లో  కోటి కాసేపు గడిపారు. సీసీ ఫుటేజ్  ఆధారంగా రూపొందించిన రోడ్డు ప్రమాదాల సంఘటనల వీడియోను వీక్షించారు. దానికి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ హిందీలో ఉండటాన్ని గమనించిన కోటికి.. ఆ పాట తెలుగులో ఉంటే బాగా అర్థమవుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు విషయం చెప్పగానే ఆయన లిరిక్స్ రాయడానికి ఓకే అన్నారు. పాట రాగానే తానే ట్యూన్ కట్టి సిటీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు డెడికేట్ చేస్తానని చెప్పారు కోటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement