స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్ | Melody of life to make a Music frendship | Sakshi
Sakshi News home page

స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్

Published Sun, Aug 3 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్

స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్

డ్యాన్స్  బేబీ డ్యాన్స్..  లిటిల్ చాంప్స్.. ఢీ..
 పాడుతా తీయగా... రియాలిటీ షో ఏదైతేనేం టాలెంట్‌తో పాటు ఫ్రెండ్‌షిప్‌నూ పెంపొందించే ఆధునిక అడ్డాలు ఇవి!
 ఈ షోలన్నీ ఆన్‌స్క్రీన్‌లో పోటీని పెంచితే ఆఫ్ స్క్రీన్‌లో స్నేహాన్ని పంచుతున్నాయి!
 పోటీల ప్రారంభంలో అపరచితులుగా ఉన్న కాంపిటీటర్స్.. ముగింపు వచ్చేసరికి ప్రాణస్నేహితులుగా మారుతున్నారు.
 అలాంటి స్నేహ వీచికలకు వేదికగా నిలిచిన షోల్లో బోల్ బేబీ బోల్ ఒకటి !
 స్నేహానికి సంబంధించి ఆ టీమ్ సభ్యులది
 ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం..
 సీరియస్ మ్యుజీషియన్‌లోని జోవియల్ యాంగిల్
 గిటార్‌తో చెలిమి తప్ప ప్రపంచంతో పరిచయంలేని సీనియర్.. సీరియస్ మ్యుజీషియన్‌గానే కోటిని గుర్తిస్తారు చాలామంది! కానీ ఆయన్ను పిల్లల్లో పిల్లాడిగా... పెద్దల్లో పెద్దవాడిగా... మొత్తంగా అందరికీ కావాల్సిన ఆప్తుడుగా.. భరోసాగా నిలిచే సన్నిహితుడిగా చూపింది ఈ రియాలిటీ షోనే! ఈ షోలో గళం విప్పిన చిన్నారులు రాహత్, శ్రీలలిత..  సోలోగా ఎంట్రీ ఇచ్చి జంటగా మారిన హేమచంద్ర, శ్రావణ భార్గవి.. బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్ సాయివంశీ మైత్రీ బంధాన్ని ‘సిటీప్లస్’ పలకరించింది. వీరంతా కోటితో పంచుకున్న కులాసా కబుర్లు స్నేహగీతమై పల్లవించింది..
 
 లొకేషన్.. రామానాయుడు స్టూడియోస్‌లోని లాన్ బ్లూజీన్స్.. బ్లూ షర్ట్.. గాగుల్స్‌తో ఎంట్రీ ఇచ్చిన కోటిని చూసి ‘సూపర్ సర్’ అంటూ  హేమచంద్ర, శ్రావణ భార్గవి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ‘నిజంగా బాగుందా?’ కోటి. ‘బాగుందా ఏంటీ సర్.. యంగ్‌గా కనపడుతుంటే’ అన్నాడు హేమచంద్ర. ‘ఇది మా అబ్బాయి షర్ట్. అందుకే యంగ్‌గా కనిపిస్తున్నట్టున్నాను’ అని హేమచంద్ర చెవిలో జోకేశాడు కోటి! ‘సర్ మీరు మరీ..’ అంటూ నవ్వేశాడు హేమచంద్ర!
 
 గంభీరంగా కనిపించే కోటిలో సరదా కోణం అది. సినిమా ఇండస్ట్రీ అంటే యాటిట్యూడ్ ర్యాంప్ అనే భావనలో ఉండేవారికి ఆయన ప్రవర్తన ఆశ్చర్యం. ‘నాలాంటి సీనియర్ మ్యుజీషియన్.. ఇలాంటి పిల్లల (తన పక్కనే ఉన్న రాహత్, శ్రీలలితను చూపిస్తూ) దగ్గర ‘ఏం పాడావు? ఆ శ్రుతేంటి?’ అని సీరియస్‌గా అంటే పిల్లలు బిగుసుకుపోతారు. అసలా టెన్షన్‌లో లేని తప్పులు పాడేస్తారు. అలాంటి వాతావరణం ఉండకూడదనే పిల్లలతో కలిసిపోయి అదేదో యుద్ధరంగం కాదు చక్కగా ఆడుతూపాడుతూ పనిచేసుకునే ప్లేస్ అనే ఫీల్ కల్పిస్తా! ఈ పిల్లలు మహా పిడుగులు. వీళ్లు మమ్మల్ని ఆటపట్టిస్తారు.  నేర్చుకునేటప్పుడు గురువుగా చూస్తారు.. తప్పులు సరిదిద్దుతున్నప్పుడు పేరెంట్‌గా అనుకుంటారు.. అల్లరి చేస్తున్నప్పుడు స్నేహితులుగా భావిస్తారు. ఇంత కంఫర్ట్‌నెస్‌కి ఫుల్‌స్పేస్ ఇస్తాను’ అంటాడు కోటి!
 
 కోతిచేష్టలు.. కుచేలుడి స్నేహాలు
 చిలిపి పనులు.. కోతిచేష్టల కూనలు పిల్లలు. అలా ఇల్లు పీకి పందిరేసే ఆ  వేషాలే కొత్తాపాతాలేక అందరితో కలిసేలా  చేస్తాయి.. విడిపోని మిత్రులుగా మారుస్తాయి! దానికి ఈ సంభాషణే నిదర్శనం...  శ్రీలలిత (రియాలిటీ షోలో ఓ చిన్నారి)కు మనం పెట్టిన పేరేంటీ?’ శ్రీలలితను టీజ్ చేస్తూ కోటి.‘ఈలరాణి’ అని ఆన్సర్ చేశాడు రాహత్ అదే రియాలిటీ షోలో ఇంకో లిటిల్ పార్టిసిపెంట్.‘నీకూ ఓ పేరుంది తమ్ముడూ మర్చిపోయావా?’ రాహత్‌ను టీజ్ చేస్తూ శ్రావణ భార్గవి  ‘హాలిడే బాయ్’ చెప్పింది శ్రీలలిత ‘ఎప్పుడూ హాలిడే మూడ్‌లో ఉంటాడు.. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా!’ రాహత్ వెసుకున్న త్రీఫోర్త్ ప్యాంట్ వైపు చూపిస్తూ హేమచంద్ర. ‘ఆల్‌కలర్స్‌లో ఈ ప్యాంట్లు వీడి దగ్గర ఉంటాయి’ శ్రావణ భార్గవి యాడ్ చేసింది. ‘ఎవరి పాటైనా తనకు నచ్చితే సెట్ అదిరిపోయేలా ఈల వేసేది. అందుకే ఈ పిడుగుని ఈలరాణి అని పిల్చుకుంటాం. అంతేకాదు ఈమెకు ఇంకో విద్య కూడా వచ్చు. ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేస్తుంది. ఉషా ఉతుప్‌లాంటి వాళ్లతో సహా!’ చెప్పాడు కోటి శ్రీలలితను చూపిస్తూ!
 
 స్నేహం.. పరిణయం
 కొన్ని సమయాలు మైత్రిని కల్పిస్తే ఇంకొన్ని సందర్భాలు దాన్ని ప్రణయంగా మార్చి పరిణయంగా ముడివేస్తాయి. హేమచంద్ర, శ్రావణ భార్గవిల పెళ్లి అలాంటిదే! దానికి పీటవేసింది ఈ రియాలిటీ షోనే!  ‘సాయిగారూ.. (సాయివంశీ బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్) ఈ ప్రోగ్రామ్‌కి మా ఇద్దరినే యాంకర్స్‌గా సెలక్ట్ చేసుకోవడానికి కారణమేంటండి? మా ప్రేమ గురించి మీకు ముందే తెలుసా ఏంటి?’ అని అడిగింది శ్రావణ భార్గవి.
  ‘అలాంటిదేమీ లేదు.. మీరిద్దరూ  కలిసి అప్పటికి యాంకరింగ్ చేయలేదు కాబట్టి  కలిపి చేయిస్తే కొత్తదనం ఉంటుందని సెలక్ట్ చేసుకున్నానంతే!’ చెప్పాడు సాయివంశీ. ‘ఏమైతేనేం ఆ షో  చేస్తున్నప్పుడే మీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు కదా...!’ అన్నాడు కోటి.
 ‘అదొక్కటే కాదు సార్.. బిజీగా ఉన్న మా ఇద్దరికీ కలసి కొంత టైమ్ స్పెండ్ చేసే చాన్సూ ఇచ్చింది. అందరూ చూస్తారనే భయంతో అసలు బయట కలుసుకోలేకపోయేవాళ్లం. ఆ మిస్సింగ్  ఈ షోతో తీరిపోయింద’ని చెప్పింది భార్గవి!

 ఫ్యామిలీ షోలు
 ఈ షోలు పార్టిసిపెంట్లు.. జడ్జీలు.. యాంకర్స్ మధ్య అనుబంధాలనే కాదు కూడా వచ్చిన పెద్దలనూ ఒక్కటి చేస్తున్నాయి. రెండురోజుల షూట్ కోసం జరిగే పదిరోజుల రిహార్సల్స్ కూడా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొత్త స్నేహాలను చిగురింపచేస్తున్నాయి. ఈ మాట నిజమే అనిపిస్తుంది సాయివంశీ చెప్పింది వింటే...  ‘ఆఫ్ సెట్స్ రిలేషన్స్ చూస్తే రియాలిటీ షోను  ఓ ఫ్యామిలీ షో అనుకుంటారు. ఈ పిల్లల పేరెంట్స్ మధ్య  ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవడం నాకెంత ఆశ్చర్యమో అంతకు మించిన ఆనందం!  పిల్లల మధ్య పోటీ స్టేజ్ మీదే.. మా పిల్లలే గెలవాలన్న కాంక్ష పేరెంట్స్‌లో ఆ కొద్దిసేపే!

సెట్స్: దిగారంటే చాలు అందరూ కలిసిపోతారు.. ఎవరు గెలిచినా అందరూ సంతోషిస్తారు. వండర్‌ఫుల్ మూమెంట్స్! ఒక్క షో ఎంతమందిని అసలైన స్నేహితులుగా మారుస్తోంది!  రియల్లీ గ్రేట్!’ ఫ్రెండ్‌షిప్ ఫర్ ఎవర్ ఇవి రియాలిటీ షోల్లోని రియల్ అనుభూతులు.. మంచి జ్ఞాపకాలు! కాలం మారుతుంది.. కొత్తద్వారాలు తెరుచుకుంటాయి.. అదే స్నేహం ఇంకాస్త కొత్తగా ఆయువు నింపుకుంటుంది!
- సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement