న్యూ స్టైల్ | NEW STYLE | Sakshi
Sakshi News home page

న్యూ స్టైల్

Published Sat, Mar 21 2015 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

న్యూ స్టైల్

న్యూ స్టైల్

ఇంతకాలం మనం ఆయిల్ పెయింటింగ్స్...గ్లాస్ పెయింటింగ్స్... ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఇలా రకరకాల పెయింటింగ్స్‌ను చూశాం. కానీ సికింద్రాబాద్ పీజీ రోడ్‌లోని బాపూబాగ్‌కాలనీకి చెందిన ప్రగ్న మెహత బ్రాస్ పెయింటింగ్‌ను ప్రవేశ పెట్టి అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరిస్తున్నారు. బ్రాస్ మెటీరియల్‌పై ప్రత్యేకమైన పెయింట్స్‌తో ఆమె వేసే చిత్రాలు అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇక తాను నేర్చుకున్న కళను మరెంతోమందికి అందించాలనే ఉద్దేశంతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్ ఆవరణలో రెండు రోజుల పాటు జరిగిన బ్రాస్ పెయింటింగ్ వర్క్‌షాప్‌లో ఔత్సాహికులు వచ్చి ఈ కొత్త కళపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక్కడ బ్రాస్ పెయింటింగ్ నేర్చుకుంటున్న  పలువురు.. తాము రూపొందించిన పెయింటింగ్స్‌ను ఇళ్లలో డెకరేషన్ కోసం వినియోగిస్తున్నారు. మరికొందరైతే చేయి తిరిగిన కళను ఉపాధికి మార్గంగా మలుచుకుంటున్నారు.
 
బయట మార్కెట్‌లో దొరికే బ్రాస్‌ను తీసుకుని వచ్చి ప్రాసెస్ చేస్తారు. అటు తర్వాత మనకు కావాల్సిన చిత్రాన్ని దానిపై గీస్తారు. అటు తర్వాత దానికి ప్రత్యేకమైన పెయింట్స్ వేసి అందమైన పెయింటింగ్స్‌ను తయారు చేస్తారు. కొద్దిగా పెయింటింగ్‌పై అవగాహన ఉంటే చాలు బ్రాస్ పెయింటింగ్‌ను సులభంగా ఆవిష్కరించవచ్చని అంటున్నారు ప్రగ్న మహత. ఆయిల్ పెయింటింగ్‌లా కాకుండా కొద్దిగా జాగ్రత్తగా దీన్ని వేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా బ్రాస్‌పై వేచిన చిత్రాలకు మంచి డిమాండ్ కూడా ఉందని రూ.3వేల నుంచి మొదలవుతుందని తెలిపారు.  
 
ఇంట్లో అలంకరణకు.. బ్రాస్ పెయింటింగ్స్‌ను ఇళ్లలో అలంకరించుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు గృహిణులు దీనినో ఉపాధి మార్గంగానూ మలుచుకుంటున్నారు. ‘చిన్నప్పటి నుంచి నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఫైన్ ఆర్ట్స్ కోర్సు కూడా చేశాను. బ్రాస్ పెయింటింగ్ కొత్తగా అనిపించడంతో నేర్చుకోవాలనే కోరిక కలిగింది. గతంలో గ్లాస్ పెయింటింగ్ చేశాను.

దానిపై అవగాహన ఉండటంతో ఇప్పుడు బ్రాస్‌పై పెయింటింగ్స్ కొద్దిగా సులభంగా ఉంది. ఇవి చాలా మంచి లుక్ ఇస్తున్నాయి’ అని చెబుతున్నారు మారేడుపల్లికి చెందిన గృహిణి రాధ. వర్క్‌షాపులో పాల్గొనడం ద్వారా కొత్త వ్యాపకం కలుగుతోందని, తద్వారా ఖాళీ సమయాన్ని ఇలా గడపడం ఆనందంగాఉందని లెర్నర్స్ అంటున్నారు. ‘పెయింటింగ్స్ నా హాబి. గతంలో ఇక్కడే జరిగిన వర్క్‌షాప్‌లో ట్రైబల్ పెయింటింగ్స్ నేర్చుకున్నాను.

తంజావూరు పెయింటింగ్స్ కూడా వచ్చు. ఇప్పుడు బ్రాస్ పెయింటింగ్స్ నేర్పిస్తున్నారంటే కొత్తగా ఉండటంతో వచ్చా. పెయింటింగ్స్ వేస్తూ మెంటల్ రిలీఫ్ పొందుతాను. ఇతర ఆలోచనలు, మాటలతో మనసు పాడుచేసుకునే బదులు పెయింటింగ్స్‌తో ఆహ్లాదాన్ని పొందుతాను’ అని అరుణగిరికిచెందిన జానకి అంటున్నారు.
దార్ల వెంకటేశ్వరరావు/ రాంగోపాల్‌పేట్
 ఫొటోలు: జి.రాజేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement