బుజ్జయ్యకు ఇచ్చిన నకిలీ బంగారు నాణేలు
సాక్షి, పాపన్నపేట(మెదక్): ఇత్తడిని పుత్తడిగా మార్చి ఓ అమాయకుడిని ఏమార్చి రూ. 4 లక్షలతో ఓ మోసగాడు పరారైన సంఘటన పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన బాజ బుజ్జయ్య అనే వ్యక్తి స్క్రాప్ వ్యాపారం చేసుకొని జీవిస్తున్నాడు. ఇతడికి రమేష్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం పరిచయమయ్యాడు. తనది అనంతపూర్‌గా చెప్పుకున్న ఆ యువకుడు రగ్గుల వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. తన వద్ద విక్టోరియా మహారాణి చిత్రపఠంతో ఉన్న బంగారు నాణేలు ఉన్నాయని, వాటిని అసలు కన్నా తక్కువ ధరకు అమ్ముతానని చెప్పాడు. అవసరమైతే వాటి నాణ్యతను పరిశీలించాలని రెండు నాణేలు శాంపిల్‌గా ఇచ్చాడు. వాటిని బంగారు దుకాణానికి తీసుకెళ్లిన బుజ్జయ్య అవి నిజమని నిర్ధారించుకున్నాడు.
అనంతరం 5 రోజుల తర్వాత తిరిగి వచ్చిన రమేష్ 30 తులాల బంగారాన్ని రూ. 12 లక్షలకు అమ్ముతానని బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు బుజ్జయ్య వద్ద తీసుకొని బంగారు నాణేలు ఇచ్చి వెళ్లిపోయాడు. బుజ్జయ్య వాటిని తీసుకొని బంగారం షాపుకు వెళ్లగా అవి పుత్తడివి కావని, ఇత్తడివని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన బుజ్జయ్య రమేష్‌కు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ రావడంతో శుక్రవారం పోలీస్‌స్టేషలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment