ఎవరికీ అర్ధంకాని చంద్రబాబు దీక్ష
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపి భవన్లో దీక్ష ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. పలానందుకు చేస్తున్నానని ఆయనా చెప్పడంలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, 9 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా స్పష్టత లేకుండా దీక్ష చేయడం ఏమిటని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే ముందు నిన్న జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు. సమాధానాలు చెప్పడానికి తడబడ్డారు. అసహనం వ్యక్తం చేశారు. కానీ అతని ఉద్దేశం మాత్రం స్పష్టం చేయలేదు. ఈరోజు కూడా తెలుగు ప్రజలకు న్యాయం జరిగేవరకు పోరాడతానని చెప్పారు. ఆ న్యాయం ఏమిటో చెప్పలేదు.
ఆయన దీక్ష సమైక్యత కోసం చేస్తున్నారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయమని చేస్తున్నారా? త్వరగా రాష్ట్రాన్ని విభజన చేయమని చేస్తున్నారా? అనేది అర్ధం కావడంలేదు. ఆయనా చెప్పడంలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోరిక మేరకే రాష్ట్రాన్ని విభజించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు స్వయంగా తమకు లేఖ రాసి ఇచ్చినట్లు తెలిపారు. మరి ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడంలేదన్నారు.
రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఒక స్పష్టతలేకుండా దీక్ష చేపట్టడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజల క్షేమంకన్నా ఇరు ప్రాంతాలలో తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యంగా భావిస్తున్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. చంద్రబాబు చర్యల వల్ల కాంగ్రెస్‌కు తన పనిని తాను మరింత సులువుగా చేసుకుపోయే అవకాశం ఏర్పడుతోంది. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని కోరారు. ఈ రెండు విషయాల ద్వారా విభజనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక దీక్ష దేనికో ఆ పార్టీ నేతలకు కూడా అర్ధం కావడంలేదు. ఎందుకంటే వారూ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా! పార్టీ నేతలు ఇచ్చిన సలహాలకు కూడా ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నట్లు లేదు.
చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు మాత్రం తన తండ్రి దీక్షతో దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. స్పష్టమైన డిమాండ్ ఏమిటో చెప్పకుండా దీక్ష చేస్తున్న చంద్రబాబు వైపు దేశం మొత్తం వింతగా చూస్తుందన్న విషయం ఆయనకు అర్ధం కావడంలేదు.