ఎన్‌ఆర్‌ఐ సేవ | NRI youth trying to give counselling for Juvenile home children | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ సేవ

Published Wed, Jul 30 2014 1:25 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఎన్‌ఆర్‌ఐ సేవ - Sakshi

ఎన్‌ఆర్‌ఐ సేవ

సేవకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు ఆ ఎన్‌ఆర్‌ఐ కుర్రాళ్లు. ఇక్కడకు వచ్చి మరీ మన దేశంలోని జువెనైల్ హోమ్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అమెరికాలో చదువుకునే అనీష్ పటేల్ అనే కుర్రాడికి వచ్చిన ఆలోచన నుంచి ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా’ పుట్టింది. అక్కడి స్కూళ్లలో సేవను సామాజిక బాధ్యతగా బోధిస్తారు. దీనిని అనీష్ పటేల్ ప్రాజెక్టుగా మలచుకున్నాడు.
 
 ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా’ సభ్యులు ఏటా సెలవుల్లో భారత్ వచ్చి, ఇక్కడి జువెనైల్ హోమ్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్లను మోటివేట్ చేస్తారు. తొలి ఏడాది వీరు గుజరాత్‌లోని వడోదరా జువెనైల్ హోమ్‌ను ఎంచుకున్నారు. గత ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లారు. ఈసారి హైదరాబాద్ వచ్చారు. అపర్ణ అనే ఆర్గనైజర్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది పిల్లలు ఇటీవల హైదరాబాద్ వచ్చారు. సైదాబాద్‌లోని జువెనైల్ హోమ్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ముందు ఇక్కడి టీచర్లతో శిక్షణ తీసుకున్నారు. రెండు వారాల్లో తమ నుంచి వారెంత నేర్చుకున్నారో, వారి నుంచి తామూ అంతే నేర్చుకున్నామని చెబుతున్న ఎన్‌ఆర్‌ఐ పిల్లల అనుభవాలు వారి మాటల్లోనే...
 
 గ్రేట్ ఆపర్చునిటీ...
 న్యూజెర్సీలో హెల్త్ మేనేజ్‌మెంట్‌లో వర్క్ చేస్తుంటా. ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా’ పిల్లల ద్వారా ఇక్కడి బాల నేరస్తులకు చేతనైన సాయం చేయడం నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ పిల్లలకు అక్కడ సమ్మర్ వెకేషన్. వెకేషన్‌లో సోషల్ వర్క్ చేయడం తప్పనిసరి. కాలేజీలో ఈ ప్రాజెక్ట్ వాళ్లకు ప్లస్ అవుతుంది. హైదరాబాద్‌లోని జువెనైల్ హోమ్ ఎంచుకోవడం ఇదే మొదటిసారి. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రేమగా ఎలా ఉండాలి? వంటి తొమ్మిది అంశాల్లో ఈ పిల్లలు జువెనైల్స్‌కు కౌన్సెలింగ్ ఇస్తారు. మా పిల్లలకూ ఇక్కడి పరిస్థితులు అర్థమవుతున్నాయి.
     -అపర్ణ, ఆర్గనైజర్
 
 పేరెంటింగ్ వాల్యూ తెలిసొచ్చింది
 ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా’ ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో పనిచేస్తున్నాను. ఇక్కడి జువెనైల్స్ పరిస్థితి చూశాక, వీళ్లు నిర్లక్ష్యానికి గురైన వైనం విన్నాక మేం ఎంత అదృష్టవంతులమో అర్థమైంది. పేరెంటింగ్ వాల్యూ తెలిసొచ్చింది.
 - రమన్, డిగ్రీ ఫస్టియర్, న్యూయార్క్
 
 షాకింగ్‌గా అనిపించింది
 మా అమ్మమ్మ వాళ్లు ఇక్కడే ఉంటారు. ప్రతి వెకేషన్‌కు ఇక్కడకొస్తుంటాను. అయితే, ప్రాజెక్ట్ వర్క్ మీద జువెనైల్ హోమ్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి పిల్లలది ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరీ. అమ్మా నాన్నల పోట్లాటల్లో దెబ్బలు తిన్నవాళ్లు కొందరైతే, ఫ్యామిలీ గొడవల్లో అమ్మ వెనుక ఉండి యాసిడ్ దాడికి గురైన వారు ఇంకొందరు. అవన్నీ వింటుంటే చాలా షాకింగ్‌గా అనిపించింది. పది రోజుల్లో పిల్లలు మాతో పెంచుకున్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ తలచుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
 - రాధిక, లెవెంత్ స్టాండర్డ్, న్యూజెర్సీ
 
 కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
 రెండు వారాల వెకేషన్ తర్వాత ఎన్‌ఆర్‌ఐ పిల్లలు శనివారం అమెరికా వెళ్లిపోయారు. అయితే, జువెనైల్ హోమ్‌లోని బాల నేరస్తులకు కౌన్సెలింగ్ కొనసాగేందుకు ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా’ తగిన ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఆసక్తిగల ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకుంటుంది. ఈ సంస్థకు వెబ్‌సైట్ (www.uplifthumanityindia.org) ఉంది.  ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో పంపే అప్లికేషన్లను పరిశీలించి, ఇంటర్వ్యూ ద్వారా చిత్తశుద్ధి గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడి జువెనైల్ హోమ్‌లోని పిల్లలకు కావలసిన ల్యాప్‌టాప్‌లు, షూస్, కొత్త బట్టలు వంటి వాటి బాధ్యత సంస్థదే. దానికి కార్పొరేట్ ఫండింగ్ ఉంటుంది. అయితే, అక్కడి పిల్లలు ఇండియా రావడానికి మాత్రం ఎవరి ఫ్లైట్ ఖర్చు వారు పెట్టుకోవాల్సిందే.
 - సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement