డాక్టర్ ఏపీ విఠల్
సందర్భం
మోదీని గద్దెనెక్కించిన హిందుత్వ నేతలే ఒక్కొక్కరు ఒక్కో తీరున ప్రగల్భాలు పలుకుతున్నారు. మోదీ వారి చేత క్షమాపణలు చెప్పించి, సర్ది చెప్పారు. కానీ ఈ ఇంటి పోరు సెగకు మోదీ తల పట్టుకోవాల్సి వస్తోంది.
అధికార బీజేపీలోని ఇటీవలి పరి ణామాలు, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి గమనార్హమై నవి. కేంద్రంలో సొంతంగా ప్రభు త్వాన్ని నెలకొల్పగల స్థాయికి బీజేపీ ఎదగడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ది ప్రధాన భూమిక. బీజేపీ తొలి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కాస్త ఉదారవాద దృక్పథంగల నేతగా గుర్తింపు ఉండేది. ఆ కారణంగానే ఆయనను ప్రధానిని చేశారు. అయితే కరడు గట్టిన మతతత్వవాద ముద్రగల అద్వానీ, ఆయనా మౌలి కంగా ఒకే సిద్ధాంతం తానులోని ముక్కలే.
1975-77 మధ్య నాటి ప్రధాని ఇందిర దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేయడానికి ముందు ఆర్‌ఎస్‌ఎస్ ఒక హిందూ మతతత్వ ప్రచార సంస్థ స్థాయిని దాటలేదు. అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటంలో దాని రాజకీయ విభాగమైన జనసంఘ్ (నేటి బీజేపీ) ఒకప్పటి సోషలిస్టు నేతలతో జత కలిసింది. అది దానికి బాగా ఉపయోగపడింది. దానికి సైద్ధాంతిక ప్రత్యర్థిగా ఉండాల్సిన సీపీఎం ‘నియంతృత్వ వ్యతిరేక ఐక్య వేదిక’ పేరిట లోక్‌నాయక్ జయప్రకాశ్ నేతృత్వంలో, జనసంఘ్ ప్రధాన శక్తిగా ఏర్పడ్డ జనతా పార్టీతో కలసి 1977 ఎన్నికల్లో పాల్గొంది. వీటన్నిటి ఫలితంగానూ, జనతా విజయం సాధించడం వల్లనూ అత్యంత నిర్మాణ యుత శక్తిగా ఉన్న జనసంఘ్‌కు నాటి ఉదారవాద వాతావరణం ఉపయోగపడింది. ఆనాటి సీపీఎం వైఖరి పార్టీలో (1978 మహాసభ) సైద్ధాంతిక విభేదాలకు దారి తీసింది. దానితో విభేదించిన నాటి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య పదవి నుంచి తప్పుకున్నారు. 2015 సీపీఎం మహాసభల్లో ఆనాటి సంక్షోభం ప్రకంపన లను సృష్టించనున్నదని వినవస్తోంది. జనతా ప్రయోగం విఫలమైనా, అది సంఘ్ పరివార్‌కు రాజకీయంగా, నిర్మా ణపరంగా బాగా తోడ్పడింది.
జనతా వైఫల్యం తదుపరి ఏర్పడ్డ బీజేపీ నేత అద్వా నీ.. నగ్న హిందుత్వ ఎజెండాతో చేపట్టిన రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ఫలితంగా రేగిన మతకల్లో లాలు, ఉద్రిక్తతలు ఆసరాగా హిందుత్వ శక్తులు బలప డ్డాయి. అయితే మిత్రశక్తుల ఒత్తిడి వల్ల ఎన్డీఏ తొలి ప్రభు త్వానికి అద్వానీకి బదులుగా ఉదారవాది ముద్ర గల వాజ పేయిని ప్రధాని అయ్యారు. అయితే ఆ ప్రభుత్వం 2004 ఎన్నికల్లో భంగపడగా, వామపక్షాల అండతో యూపీఏ-1 అధికారంలోకి వచ్చింది. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు అసమర్థతకు ఆలవాలమయ్యాయి. కాంగ్రెస్ అవినీతికి, కుంభకోణాలకు మారుపేరుగా మారింది. దీంతో ప్రజల్లో, ప్రత్యేకించి యువతలో నిరాశ, నిరాసక్తత నెలకొని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని కోరారు. వామప క్షాలు ఆ స్థితిలో లేకపోవడంతో, బీజేపీనే వారు ప్రత్యా మ్నాయంగా ఎంచుకోక తప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్ తెలివిగా వృద్ధుడైన అద్వానీ స్థానంలో మధ్యవయస్కుడు, వాగా డంబరం, జనాకర్షణ గల మోదీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చింది. అతడిలో అత్యంత నమ్మకమైన మిత్రుణ్ణి చూసిన స్వదేశీ, విదేశీ కార్పొరేట్ గుత్తాధిపతులు అతడ్ని ప్రచారార్భాటంతో ఆకాశానికెత్తారు. మధ్యతరగతి యువతలో మోదీ పట్ల ఆరాధనా భావాన్ని రేకెత్తించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా ఊకదంపుడుతో బీజేపీ విజ యావకాశాలను పెంచారు. మోదీ తన విదేశీ పర్యటన లతో, ‘స్వచ్ఛభారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలతో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. కానీ 13 లక్షల మంది మానవ విసర్జనాలను నెత్తిన మోస్తుండగా ఎక్కడి స్వచ్ఛ భారత్? ‘మేక్ ఇన్ ఇండియా’ మన దేశ పరిస్థితులకు తగినది కాదని ఆర్‌బీఐ గవర్నరే చెప్పారు!
మోదీకి, ఆయనను గద్దెనెక్కించిన మతతత్వ శక్తులే పంటి కింది రాళ్లలా మారుతున్నాయి. ‘సంస్కృతాన్ని తప్పనిసరి చేయాల’ని, ‘మోదీని వ్యతిరేకించే వారికి దేశంలో చోటులేదు, పాకిస్తాన్ వెళ్లాల్సిందే’నని, ‘ఈ దేశంలో ఉన్నవారంతా హిందువులే’నని, ‘మోదీ దేశాన్ని హిందూ రాష్ట్రం’ చేస్తారని, అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తారని... హిందుత్వ నేతలు ఒక్కొక్కరు ఒక్కో తీరున ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక బీజేపీ ఎంపీ గాంధీజీ హంతకుడు గాడ్సేకు దేశభక్తుడని కితాబునిస్తే, ఒక కేంద్ర మంత్రిణి బీజేపీ అభ్యర్థులు రాముని సంతానం, మిగతా వారు అక్రమ సంతానం అంటూ ప్రచారానికి దిగారు. ఆ వ్యాఖ్యలు తప్పని మోదీ వారి చేత క్షమాపణలు చెప్పిం చారు, ప్రతిపక్షాలకు సర్ది చెప్పారు.
కానీ సొంత పార్టీనే నియంత్రించలేని నేతగా తన ప్రతిష్ట దెబ్బ తింటుంటే ఆయన స్థితి మింగలేక కక్కలేక అన్నట్టుంది. ఇదిలా ఉండగా, పరివార్ ముస్లింలను, క్రైస్తవులను హిందువులుగా మార్చే (‘పునఃపరివర్తన’) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఇంటి పోరు సెగకు మోదీ తల పట్టుకోవాల్సి వస్తోంది. అయితే మరో వాదన కూడా వినవస్తోంది. సంఘ్ పరివార్ తన దూకుడుతో మోదీని ఇరుకున పెడుతున్నట్టు కనిపిస్తోందేగానీ, తద్వారా ఆయన పట్ల సానుభూతిని రేకెత్తింపజేయాలని ప్రయ త్నిస్తోందని అంటున్నారు. మోదీ అంత అతి మతతత్వ వాది కాదని, ప్రధానిగా ఆయన ఉదారవాదిగా వ్యవహరి స్తున్నారని చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారి వాదన, అందులో కొంత సహేతుకత లేకపోలేదు.
తాజా కలం: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేను మాత్రం తక్కువా? అన్నట్టు ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాల’ని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ విదేశీ నేతలకు భగవద్గీతను బహూకరిస్తున్నారని, దానికి సాధికారతను కలిగించాలని మాత్రమే తాను కోరు తున్నానని ముక్తాయించారు!
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు)
మొబైల్ నం: 98480 69720