ఫ్యాషన్ కేరాఫ్ రామ్జ్
‘రాజోలు నుంచి సినీదర్శకులు తయారవుతారంటే నమ్మొచ్చు గానీ, ఓ ఫ్యాషన్ డిజైనర్ తయారవడం నమ్మశక్యం కాని విషయం’.. ఇదీ రామ్ జీబు గురించి టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కితాబు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు కుర్రాడు రామ్ ప్రస్తుతం నగరంలో ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుకుంటున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ చంద్రికా గుప్తాతో కలసి బంజారాహిల్స్ రోడ్ నం: 14లో రామ్ నిర్వహిస్తున్న ‘రామ్జ్ డిజైన్ స్టూడియో’.. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
‘వివిధ సందర్భాలకు, వేడుకలకు తగిన డిజైన్లను ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా రూపొందిస్తున్నాం. ఫ్యాషన్ రూపకల్పన అంతా అబ్జర్వేషన్‌లోనే ఉంటుంది’ అనే రామ్, పుణేలోని మిట్‌కాన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. ఫ్యాషన్ రంగంపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో పుణేలో ఉండగానే మ్యాగజైన్ల ఫొటోషూట్స్ కోసం ఫ్రీలాన్స్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. ఇక ‘రామ్జ్’ సహ వ్యవస్థాపకురాలు చంద్రికాగుప్తా చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి నిట్‌వేర్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చెన్నై, తిరుపూరుల్లో డిజైనర్‌గా పనిచేసింది. దర్శకుడు సుకుమార్ తొలిసారిగా 2007లో తన ‘జగడం’ సినిమా కోసం రామ్‌కు అవకాశం ఇచ్చారు. ‘జగడం’ సక్సెస్‌తో రామ్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.
- సిద్ధాంతి