అహం.. ఓ దుర్గుణం
రుజుమార్గం
గర్వం, అహంకారం అన్నవి బహు చెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏ విధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి సైతాన్ గుణాలు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత అందరూ అతనికి సజ్దా (సా ష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. ఫరిష్తా లతో సహా అందరూ ఆదిమానవుడికి సాష్టాంగ అభి వాదం చేశారు. కాని సైతాన్ చెయ్యలేదు. దైవాదేశాన్ని ధిక్కరించాడు. దీనిక్కారణం వాడిలోని అహమే అం టోంది పవిత్ర ఖురాన్.
అహం అంటే ఏమిటి? తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడ డం. సైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తన కన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి మట్టితో సృష్టించబడిన వాడి కంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్య తిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.
ఎవరి మనసులోనైతే ఇలాంటి ‘అహం’ ఉంటుం దో అలాంటి వారి మనస్తత్వం దేవుని విధేయతకు, సత్యాంగీకారానికి సిద్ధమవ్వడం అసంభవం. సత్యా న్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ‘అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదే శాలను పాలించగలగాలి. కాని అత నిలోని అహం మరెవ్వరినీ తన కన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు.
ఈ విధంగా అహంకారి సమాజంలో తనకో గొప్ప స్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ అతడు సహించలేడు. అంతా తన పెత్తనమే సాగాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ అతనిలోని ‘అహం’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అందిపుచ్చుకుంటానని భావిస్తాడు. ఎదు టివారిలోని ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీ కరించడు.
ఇలాంటి వారిని ఎవరైనా సంస్కరించడానికి ప్రయత్నిస్తే లేక ఎవరైనా తమ తప్పులు ఎత్తిచూపితే సహించలేరు. తమను తాము సంస్కరించుకోడానికి ఏ మాత్రం ఒప్పుకోరు. ఇలాంటి వారు తమ అహంకా రవైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుం టారు తప్ప మరొకటి కాదు. ఇదంతా దైవాదేశాలను కాదన్న ఫలితం. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది. కొందరు తమ వద్ద ఎలాం టి ప్రమాణం లేకపోయినా దేవుని సూక్తుల విషయం లో వితండవాదం చేస్తారు. వారి మనసులో తామేదో గొప్పవాళ్లమన్న అహంకారం తిష్టవేసుకొని ఉంటుం ది. కాని ఆ గొప్పదనానికి వారు ఎన్నటికీ చేరుకోలేరు. కనుక నీవు అల్లాహ్ శరణు వేడుకో. ఆయన అన్నీ విం టున్నాడు, చూస్త్తున్నాడు. (41-56).
గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ కాపాడాలని కోరుకుందాం.
- యండి. ఉస్మాన్ ఖాన్