ఈ రోజుల్లో.. రైతు బతుకు చిత్రం... | Sakshi stop reporter for this week Maruthi | Sakshi
Sakshi News home page

ఈ రోజుల్లో.. రైతు బతుకు చిత్రం...

Published Sun, Feb 1 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

ఈ రోజుల్లో.. రైతు బతుకు చిత్రం...

ఈ రోజుల్లో.. రైతు బతుకు చిత్రం...

ఎండ, చలి, వాన.. కాలాలతో పనిలేదు. మట్టిని నమ్ముకుని బతికే భూమిపుత్రులు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట... అమ్ముడుపొయ్యేదాకా సవాలక్ష సమస్యలు. ప్రకృతి ఆటుపోట్లు ఓవైపు... దళారులు నిర్ణయించే రేట్లు మరోవైపు. ఇంకోపక్క- కొసరి కొసరి బేరమాడే వినియోగదారులు.. కసురుకుంటే అసలుకే ఎసరు వస్తుందేమోనని భయం!. దిగుబడి ఉంటే ధర ఉండదు.. ధర ఉన్న సమయంలో దిగుబడి రాదు. ఇవి రెండూ బాగున్నప్పుడు వారి ముఖాల్లో నవ్వుంటుంది. బాగా లేకపోతే దిగులు మేఘమొకటి కమ్ముకుంటుంది. అలాంటి పున్నమి, అమావాస్యలాంటి జీవితాలతో సాగుతున్న రైతుల జీవితాలను ‘సాక్షి రిపోర్టర్’గా పలకరించారు యూత్‌ఫుల్ సినిమాల డైరెక్టర్ మారుతి. ఎర్రగడ్డ రైతుబజార్‌లో వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారిలా...
 
మారుతి: ముందురోజు పొలాల్లో ఉన్న కాయగూరలు.. ఇప్పుడిక్కడ రాశులుగా కనిపించడం వెనక రైతుల కష్టం చాలా ఉంది. దీనికి తోడు మార్కెట్ తిప్పలు.. మిమ్మల్ని సాక్షి స్టార్ రిపోర్టర్‌గా పలకరించడం హ్యాపీగా ఉంది. చెప్పమ్మా.. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కూరలు పండిస్తావు?
యాదమ్మ: నేను తుప్రాన్ దగ్గర కొనాయిపల్లి కాడికెల్లి వచ్చిన సారు. నేనెప్పుడు ఆక్కూరలే పెడతా.
 మారుతి: ఏమేం కూరలు?
 యాదమ్మ: పాలకూర, చుక్కకూర, పుదీనా.
 మారుతి: పాలకూర ఎన్ని రోజులకొకసారి వస్తుంది.
 యాదమ్మ: కూర పీకేయ్యం సార్. కట్ చేస్తాం. మళ్ల నీళ్లుపెట్టి, మందేస్తే నెలకే వస్తుంది.
 మారుతి: మరి ఈలోగా మీకు ఆదాయం?
 యాదమ్మ: ఇంకో కూర అమ్ముకుంటం. అదొక్కటే ఏస్తే చిగుర్లెప్పుడు వస్తయా? పెద్దగెప్పుడు అయితదా అని ఎదురుచూస్తం.
 మారుతి: ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు?
 సత్తెమ్మ: రాత్రి ఎనిమిది గంటలకే ఈడికి వచ్చేస్తం సార్.
 మారుతి: ఎలా?
 సత్తెమ్మ: సాయంత్రం యాలనే కూరలు సంచులకు కట్టుకుని షేరాటోలల్ల వస్తం. ఈడ మా జాగల పండుకుని తెల్లారి నాలుగు గంటలకు లేచి కూరలు మూటలిప్పుకుని పరుచుకుని కూసుంటం.
మారుతి: ఈ చలిలో ఇక్కడ పడుకుంటారా?
 సత్తెమ్మ: బిల్డింగ్‌లల్ల పండుకునేటోళ్లకు చలిగాని మా అసొంటోళ్లకేముంటది సార్.
 యాదమ్మ:  రైతులకు ఎండ, వానా, చలి అని ఏముండదు సార్. కాని గీ...చలికి గదేదో సైన్‌ఫ్లూ అని ఒక జబ్బొచ్చిందంట కదా సార్. అందరు ముక్కులకు, మూతులకు గుడ్డముక్కలు కట్టుకుని వస్తున్నరు. మాకు అస్వంటిదేమీ తెల్వదు.
 లక్ష్మి: రోగమొచ్చినా చేసేదేంది సార్. ఏదయ్యేదుంటే అదే అయితది.
 మారుతి: నువ్వేం పండిస్తావమ్మా?
 కమలమ్మ: టమాటాలు సార్.
 మారుతి: టమాట... మార్కెట్‌లో రారాజు. ఒకోసారి రెండు రూపాయలుంటుంది. ఒకోసారి యాభై ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉందమ్మా?
 కమలమ్మ: తొమ్మిది రూపాయలుంది సార్.
 మారుతి: గిట్టుబాటు ధరేనా?
 కమలమ్మ: ఏం గిట్టుబాటు సార్. పూర్వం పశువుల ఎరువులేసి పండించేటోళ్లం. ఇప్పుడు పైసలెరువులేసి పండిస్తున్నం. గీ రేటుకి పెట్టుబడులు కూడా రావు సార్. అట్లా అని పారబోసుకోలేం కదా! ఒక్కోరోజు రేటు బాగుంటుంది. ఆ పొద్దు నవ్వుకుంట ఇంటికిపోతాం.
 మారుతి: ఏం తాత...కాలిఫ్లవర్లు తాజాగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చావు?
 పెంటయ్య: షామీర్‌పేట సార్.
 మారుతి: సొంత పొలమా పెంటయ్య?
 పెంటయ్య: అవును సార్. ఐదెకరాలు. నేనొక్కడ్నే సాగుచేసుకుంట. రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడితే మార్కెట్ల నా చేతిలో పడే పైసలు నాలుగొందలు, ఐదొందల దాకా ఉంటయి.
 మారుతి: పల్లీకాయలు బాగున్నయి భయ్యా? ఈ రోజు మాలేనా?
 నర్సయ్య: ఔ సార్.
 మారుతి: కిలో ఎంత?
 నర్సయ్య: నలభై రూపాయలు.
 మారుతి: రోజుకి ఎంత సంపాదిస్తావ్?
 నర్సయ్య: ఇవి యాభై కిలోలదాకా ఉంటయి సార్. అన్ని అమ్ముడువోతే ఎనిమిది వందలకెల్లి వెయ్యి దాకా వస్తయి.
 మారుతి: మార్కెట్‌లో బాగానే ఉంది. మరి పంట సాగు బాగానే ఉంటుందా?
 నర్సయ్య: ఒక్కోసారి మొక్క నాలుగు రెమ్మలెయ్యంగనే ఏదో ఒక రోగమొస్తది సార్. అనుమానమొచ్చిన మొక్కను తీస్కవొయ్యి వ్యవసాయాధికారికి చూపిస్తే ఆయనేదో జబ్బని చెప్తడు. ఏముంది అంతా పీకి బయటపడేసి వేరే పంటేసుకోవాలి.
 మారుతి: అమ్మో అలాగయితే చాలా కష్టం కదా! సరే ఆ అబ్బాయి పేరేంటి?
 నర్సయ్య: కృష్ణ సార్.
 మారుతి: చూడ్డానికి చిన్న కుర్రాడిలా ఉన్నాడు. మీరు పిల్లలతో కూడా కూరలమ్మిస్తారా?
 నర్సయ్య: ఏమో సార్. ఆయన గురించి తెల్వదు.
 మారుతి: హాయ్ కృష్ణ. ఏంటి దోసకాయల మధ్య హీరోలా కూర్చున్నావ్. నువ్వు కూడా రైతేనా?
 కృష్ణ: కాదు సార్. నేను, అన్నయ్య రైతుల దగ్గర సరుకు కొనుక్కుని ఇక్కడ అమ్ముకుంటాం.
 మారుతి: మరి ఎలా ఉంది వ్యాపారం?
 కృష్ణ: అంతా ధరలపై ఆధారపడి ఉంటుంది సార్.
మారుతి: నువ్వు చదువుకోకుండా ఇదేంపని?
 కృష్ణ: చదువుకుంటే కూలి ఇవ్వరు కదా సార్.
 మారుతి: పచ్చిమిరపకాయలు చూడ్డానికి చాలా తాజాగా ఉన్నాయి. తింటే ఘాటుగా ఉంటాయనుకోండి. పాపం పెద్దావిడ చాలా సీరియస్‌గా అమ్ముకుంటుంది. హాయ్ పెద్దమ్మా...ఏ ఊరు మీది.
 లింగమ్మ: వికారాబాద్ బిడ్డా.
 మారుతి: ఈ మిరపకాయల్ని నువ్వే పండిస్తావా?
 లింగమ్మ: నేను, మా ఆయన.
 మారుతి: ఓ... ఆయనెక్కడ?
 లింగమ్మ: ఆయనిక్కడుంటే పొలంల పనెవరు చూసుకుంటరు. ఆయన అక్కడ చూసుకుంటే...నేనిక్కడ చూసుకుంట.
 మారుతి: బాగానే ఉందా కూరల అమ్మకం?
లింగమ్మ: ఏదో ఉంటది సార్. చలికి ఎవ్వరొస్తలేదు. ఎండకాలమైతే ఐదింటికే జనం సంచులవట్టుకుని ఉరికొస్తరు. పొయిన నెల, ఈ నెలా ఏడు దాటినా పిట్ట కనిపిస్తలేదు.
మారుతి: ఏం తాత... నువ్వేం తెచ్చావ్?
 బాలయ్య: మొక్కజొన్నకంకులు.
మారుతి: నీ వయసెంత?
బాలయ్య: ఉంటయి డెబ్బైదాకా.
మారుతి: పంట కూడా నవ్వే పండిస్తావా?
బాలయ్య: ఐదెకరాల సొంతం పొలముంది సార్. కంకులతో పాటు వంకాయ, కాలిఫ్లవర్ కూడా ఏస్త. రోజూ ఆటో కట్టించుకుని ఈడికి తీసుకొచ్చి దళారులకు అమ్మేసి పోతా.
మారుతి: దళారులంటే ఎలాంటి వారు?
 బాలయ్య: అగో ఆడ డీసీఎంలు చూస్తున్నరు కదా వాళ్లకి.
 మారుతి: హాయ్ భయ్యా...మీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?
 బందయ్య: మేం రంగారెడ్డి జిల్లా అట్నాపూర్‌కెల్లి వచ్చినం సార్. మేమంతా సంచార రైతుబజార్లను నడుపుతాం. అంటే మొబైల్ మార్కెటన్నమాట. ఇగో డీసీఎంలను చూస్తున్నరు కదా! వీటి వెనకవైపు అన్ని రకాల కూరగాయలను పెట్టుకుని సిటీల అపార్టుమెంట్లకు పోయి అమ్ముతం.  
 మారుతి: మీ దగ్గర రేట్లెలా ఉంటాయి?
 బందయ్య: మార్కెట్ రేటుకు ఒక్క రూపాయి అటు, ఇటు ఉంటయి. ఎందుకంటే మాల్ బాగా మిగిలిపోతుంది.
 మారుతి: మీకు లెసైన్సులు వంటివి ఉంటాయా?
 శ్రీనివాస్: ఆ ఉంటయి సార్. మార్కెట్ అధికారులు ఇస్తరు.
 మారుతి: విన్నారు కదండి. వయసుతో పనిలేదు, ఆడా మగా తేడా లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. చలికి భయపడేది లేదు. గిట్టుబాటు ధర లేకపోయినా పదుల కిలోమీటర్లు దాటుకుని మా పట్నం మధ్యలో కూరల రాశులు పోసి అగ్గువ ధరలకు అమ్ముకుని తిరిగెళుతున్న రైతుల కబుర్లు. పంటలు బాగా పండి, గిట్టుబాటు ధరుంటే నవ్వుతూ ఇంటికెళతామని చెబుతున్న వీరికి ప్రతిరోజు అలాంటి రోజే కావాలని కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement