సారే మహాన్ సే ఇచ్ఛ
సినిమాల్లో బ్రహ్మాజీ ఓ ఆవేశపరుడు.. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. సిద్ధాంతాల కోసం పోరాడే జర్నలిస్ట్.. నమ్మిన బంటు.. హాస్యాన్ని కూడా పండించగల నటుడు. మేకప్ తీసేస్తే.. బ్రహ్మాజీ ఒక కామన్ సిటిజన్ మాత్రమే కాదు.. బుద్ధిజంతో తనను తాను మరింత ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలోనే బ్రహ్మాజీకి ఇచ్ఛతో దోస్తీ కుదిరింది. అక్కడి పసిమనసులతో ఆప్యాయత పెరిగింది. ఇంతకీ బ్రహ్మాజీ తన ఇచ్ఛ ఎలా నెరవేర్చుకుంటున్నాడో ఆయన మాటల్లోనే..
ప్రజెంటేషన్: భువనేశ్వరి
స్పందించే గుణముంటే.. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడతామని మధు టుగ్నైడ్‌ని చూస్తే అనిపిస్తుంటుంది. ఎంచక్కా భర్త భారత నేవీలో కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొడుకు ఎమ్ టీవీలో ఉద్యోగి. ఏ బాధలు, బాధ్యతలూ లేవు. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో అనాథపిల్లలు.. అదీ ఆరోగ్యంగా లేని పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంది. నా భార్య శాశ్వత బెస్ట్ ఫ్రెండ్ మధు. ఓసారి శాశ్వతతో కలసి మధు స్థాపించిన ఇచ్ఛా ఆశ్రమానికి వెళ్లాను. జస్ట్ విజిటింగ్ కోసం వెళ్లినవాణ్ని.. రోజు గడిచినా అక్కడ నుంచి కదల్లేకపోయాను.
బుద్ధిజంలో చేరాక..
‘ఇచ్ఛ' అంటే కోరికని అర్థం. తన కోరిక మేరకు మధు స్థాపించిన ఆశ్రమం వెనుకున్న ఆశయం.. సాయపడాలన్న కోరిక తీర్చుకోవడమే. మధుకి సేవ చేయాలన్నది చిన్ననాటి నుంచి ఉన్న కోరిక. భర్త ఉద్యోగం మేరకు వైజాగ్‌లో స్థిరపడ్డారు. ఇక మా శాశ్వత, మధులది పదిహేనేళ్ల స్నేహం.
మేం బుద్ధిస్టుల అసోసియేషన్ సోకా గక్కాయ్ ఇంటర్నేషనల్‌లో సభ్యులం. ఈ అసోసియేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిని కలిసే అవకాశం దొరికింది. ఇదే క్రమంలో సేవాభావం ఉన్న వ్యక్తులను కలిశాను. బుద్ధిజంలో చేరాక నా జీవితంలో చాలా మార్పు చూశాను. మధుతో స్నేహం కూడా సోకా గక్కాయ్ పుణ్యమే. కొడుక్కి ఉద్యోగం వచ్చి ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత మధు మనసు సేవపైకి మళ్లింది. వైజాగ్‌లోని అనాథపిల్లలుండే శిశువిహార్‌కి వెళ్లినపుడు అక్కడ ఇద్దరు పిల్లలు ఆమె చెయ్యిపట్టుకుని వదల్లేదట. అంతే.. తన ‘ఇచ్ఛ' తీర్చుకునే సమయం వచ్చిందనుకుంది. వైజాగ్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామం దగ్గర ‘ఇచ్ఛ’ ఆశ్రమం నెలకొల్పింది.
ఆ పిల్లల ప్రత్యేకత...
గత ఏడాది నేను, నా భార్య మొదటిసారి ‘ఇచ్ఛ' ఆశ్రమానికి వెళ్లాము. పచ్చని చెట్ల మధ్య చెక్కతో నిర్మించిన ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా తోచింది. ఆశ్రమంలో కనిపించిన అమాయక పసి హృదయాలు మరింత ప్రశాంతతను పంచాయి. నేను వెళ్లినపుడు ఓ పదిమంది పిల్లలున్నారు. అందరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవారే. కొందరు మానసిక వికలాంగులు, ఇంకొందరు శారీరక వికలాంగులు. ఒకమ్మాయి అయితే తలను నిలబెట్టలేదు, నిలబడలేదు, నడవలేదు, కూర్చోలేదు.
ఏడాది వయసుంది. కానీ చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో! ఆ అమ్మాయిని ఎత్తుకున్నంతసేపు నా మనసు ఎంత తేలికగా అనిపించిందో. నాకు ఆ భగవంతుడ్ని పూజించిన భావన కలిగింది. నా చుట్టూ చేరిన పిల్లల్లో.. అమాయకంగా కొందరు, ఆయోమయంగా ఇంకొందరు నవ్వుతుంటే.. అర్థంకానట్టు నన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోయింది. ఎందుకంటే వారికి అన్నం పెట్టగలం, వైద్యం చేయించగలం కానీ మనలాంటి జీవితాన్ని మాత్రం ఇవ్వలేం కదా అనిపించింది.
నేనే బ్రాండ్ అంబాసిడర్‌ని...
ఏదో ఫ్రెండ్ సేవను చూడ్డానికి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లాక నా మనసులో బోలెడన్నీ ఆశయాలు పుట్టేశాయి. నేను ఊహించినదానికంటే నా మనసు ఎక్కువగానే స్పందించింది. ‘ఇచ్ఛ’కి నాలుగు రూపాయల ఆర్థికసాయం చేసి ఊరుకుంటే సరిపోదు. ఇంకా ఏదో చేయాలనిపిచింది. నా భార్య శాశ్వత మాత్రం ఏడాదిలో వీలైనన్నిసార్లు ఆ ఆశ్రమానికి వెళ్లి ఆ పిల్లలకు సేవ చేయాలనుకుంది. మరి నేను.. అని అలోచించుకుంటే ‘ఇచ్ఛ’కి కావాల్సిన ప్రచారం చేయాలనుకున్నాను.
సేవాప్రచారం కూడా సేవే కదా అనుకున్నాను. ఇండస్ట్రీలో నాకున్న స్నేహితులందరికీ మధు చేస్తున్న సేవ గురించి చెప్పి వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆర్థికసాయం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను.
ఐ లవ్ మధు
మధు ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా రకరకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వారికి ఆమె ఇంతన్నం పెట్టి ఊరుకోవట్లేదు. అవసరమైన వైద్యం నుంచి ఫిజియోథెరపీ వరకూ ఏదీ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తోంది. మేం ఒకరోజంతా ఉన్నామక్కడ. మధు చేస్తున్న సేవ నన్ను, బ్రహ్మాజీని బాగా కదిలించింది. మాకు వీలైనంత సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్.
- శాశ్వత
వారి రాకతో..
బ్రహ్మాజీ, శాశ్వత వాళ్లిద్దరూ నా ఆశ్రమానికి రావడం మొదలుపెట్టాక మా చట్టుపక్కల ప్రజల నుంచి మంచి స్పందన రావడం మొద లైంది. నటుడిగా బ్రహ్మాజీకున్న పేరు నా ఆశ్రమం మనుగడకు చాలా
ఉపయోగపడుతోంది.
- మధు