సారూన్.. ఇదో లుంగీ కథ | sarun is lungi story | Sakshi
Sakshi News home page

సారూన్.. ఇదో లుంగీ కథ

Published Mon, Jul 14 2014 7:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

సారూన్.. ఇదో లుంగీ కథ

సారూన్.. ఇదో లుంగీ కథ

- వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా.. అంతా ఎంతో హాయిగా..
- ఇదేదో ఏసీ యూనిట్ గురించి కబుర్లు కావు..
- ఇండోనేసియా లుంగీల కథా కమామీషు!

చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ దాటి కాస్త ముందుకెళ్లగానే పురుషుల వస్త్రధారణలో ప్రత్యేక తేడా కనిపిస్తుంది. ఇది మిగతా ప్రాంతాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ లుంగీలు ధరించి కనిపిస్తారు. వస్త్రధారణలో లుంగీ మనకు కొత్తేమీ కాదు. కానీ అక్కడివారు ధరించే లుంగీ మాత్రం కచ్చితంగా భిన్నమైందే. ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశం ఇండోనేసియాలో తయారైన ఉన్నతశ్రేణి లుంగీలు మాత్రమే ధరించటం వారి ప్రత్యేకత.
 
యెమన్ నుంచి..

కుతుబ్‌షాహీలు తమ సంస్థానంలో పోలీసు వ్యవస్థ, జమా పద్దుల నిర్వహణకు అరబ్ దేశాల నుంచి నిపుణుల్ని రప్పించారు. అలా యెమన్ దేశీయులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల హయాం వచ్చాక కూడా వీరికి ప్రాధాన్యం పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యెమన్ జాతీయులకు బార్కస్, సలాలా ప్రాంతాలను కేటాయించారు. నేటికి ఈ ప్రాంతాలు యెమన్ వంశస్తులతో నిండిపోయి కనిపిస్తాయి. వీరికి ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన లుంగీలు ధరించటం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్నే వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  
 
ఇండోనేసియా నుంచే దిగుమతి..
యెమన్లు ఇండోనేసియాలో తయారైన లుంగీలనే వినియోగిస్తారు. వాటిని వారు ‘సారూన్’ అని, ‘తైబన్’ అని పిలుచుకుంటారు. ఈ లుంగీ నాణ్యత ఉన్నత శ్రేణిలో ఉంటుంది. వస్త్రం చాలా మృదువుగా ఉండి వేసవి కాలంలో చల్లని, శీతాకాలంలో వెచ్చని అనుభూతి నిస్తుంది. ఇండోనేసియాలో ప్రత్యేక శ్రద్ధతో వీటిని తయారు చేస్తారు. యెమన్ ప్రాంతానికి ఈ లుంగీలే ఎగుమతి అవుతాయి. బార్కస్‌లో స్థిరపడ్డ వీరి పూర్వీకులు యెమన్ దేశీయులు అయినందున వీరు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. పన్నెండేళ్ల పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరూ ఈ లుంగీలను ధరించే తిరుగుతుంటారు. బార్కస్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ఇండోనేసియా లుంగీలమ్మే దుకాణాలు వెలిశాయి. ఇక సిటీలో ఎక్కడా ఈ లుంగీలు దొరకవు. ఈ లుంగీల ధర కూడా ఎక్కువే. సాధారణ లుంగీ రూ.750 ధర పలుకుతోంది. మరింత మంచివైతే రూ.2,000-3,000 వరకు ఉంటోంది. ఒక్కో లుంగీ కనీసం నాలుగేళ్లవరకు పాడవకుండా ఉంటుందని స్థానికులంటున్నారు.
 ..::గౌరీభట్ల నరసింహమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement