తిరగడమే నా పని..
కష్టాల్లో ఉన్న వారు అవెప్పుడు తీరుతాయా అని బాధపడుతుంటారు. ఇతరుల కష్టాలు చూసిన వారు కొందరు మనకెందుకులే అని ఊరుకుంటారు. ఇంకొందరు అవి తీర్చే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. గరీబుల నసీబు మార్చాలని తాపత్రయపడతారు. బానిసత్వం కోరల నుంచి అమాయకులను రక్షించాలని తపనపడతారు. ముప్పైమూడేళ్ల వయసులోనే 80 దేశాలు తిరిగిన ప్రియాంక మొటపర్తి అదే ప్రయత్నంలో ఉంది. కఫాల సిస్టం.., గల్ఫ్ దేశాల్లో కనిపిస్తున్న ఆధునిక బానిసత్వం. దీన్ని రూపుమార్చడానికి అమెరికా హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థను స్థాపించింది. అందులో పని చేస్తున్న వందలాది మంది ఔత్సాహికుల్లో ప్రియాంక ఒకరు. అమెరికాలో
పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. వలస కార్మికుల సమస్యలను అక్షరబద్ధం చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయాణంలో హైదరాబాద్ చేరుకుని ‘సిటీప్లస్’కు ఈనాటి అతిథి అయ్యింది.
- ప్రియాంక మొటపర్తి, సామాజికవేత్త
ఒంట్లో ఓపిక ఉన్నా.. పని చేసే మనసున్నా.. ఉపాధి లేక వలస బాట పడుతున్న కార్మికుల మీదే నా రీసెర్చ్. హ్యూమన్ రైట్స్ వాచ్ నాకిచ్చిన అవకాశం ఇది. ఇంతకీ మా సొంతూరు ప్రకాశం జిల్లా దెందులూరు. వెంకట అమ్మానాన్నలు ల క్ష్మీకుమారి, సోమయ్య చౌదరి మేం పుట్టక ముందే అమెరికాలో స్థిరపడ్డారు. నాన్న యూఎస్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. అమ్మ హౌజ్‌వైఫ్. నాకో తమ్ముడు నీల్. కొలొంబియా యూనివర్సిటీలో ‘లా’ పూర్తవగానే హ్యూమన్‌రైట్స్ వాచ్‌లో జాబ్ వచ్చింది. మిడిల్ ఈస్ట్ విజన్ ప్రాజెక్ట్ వర్క్స్ చూసేదాన్ని. అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియాలన్నా.. అక్కడివాళ్లతో బాగా కనెక్ట్ కావాలన్నా ఆ భాష తెలుసుండాలి. అందుకే కష్టంతో, ఇష్టంతో అర బ్బీ నేర్చుకున్నాను.
మొదటి ప్రాజెక్ట్ కార్మికులదే
నా ఫస్ట్ ప్రాజెక్ట్ కువైట్‌లోని డొమెస్టిక్ వర్కర్స్ మీద. అక్కడ వందల మంది కార్మికులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ల పని, పరిస్థితులు, సౌకర్యాలు వంటి అంశాలమీద రీసెర్చ్ చేసి 2012లో కువైట్ ఎంబసీకి ఓ రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత యూఏఈ, ఖతర్ వెళ్లి అక్కడి లేబర్స్ మీద వర్క్ చేశాను. అలా 80 దేశాలు తిరిగి.. వేలాది మంది వలస కార్మికుల స్థితిగతులపై నివేదికలు ఇచ్చాను.
చిన్నారుల హక్కుల కోసం..
కొద్ది కాలానికి ఈజిప్ట్‌లో చిల్డ్రన్స్ రైట్స్ విభాగంలో నాకు కొత్త ఉద్యోగం దొరికింది. అప్పటి నుంచి నా బస కైరోకి మారింది. ఈజిప్టే కాకుండా సిరియా, యెమెన్ లాంటి దేశాల్లోని పిల్లల మీదా చాలా వర్క్ చేశాను. ఈ ఐదేళ్ల అనుభవం నాకు ప్రపంచం ఇంకో అంచును పరిచయం చేసింది. నాలో ఓ కలను నిజం చేయాలన్న కసి రగిల్చింది. అందుకే కిందటేడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను.
దేశాలు తిరిగే జాబేంటి..?
మా పేరెంట్స్‌ది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను చేస్తున్న ఈ పని సహజంగానే వాళ్లకు అర్థం కాదు కదా..(నవ్వుతూ)! ‘హాయిగా ఆఫీస్‌లో కూర్చోనే పని చేసుకోక ఈ దేశాలు తిరిగే జాబేంటీ?’ అని అంటారు. నా పుస్తకం పూర్తయితే వాళ్లకు నా కష్టం తెలుస్తుంది.
అనుభవాలే అక్షరాలుగా..
నేను చూసిన 80 దేశాలే నాకు ప్రేరణ. ఆయా దేశాల్లో నేను పలకరించిన వలస కూలీలు, వారి బాధలు, సంతోషాలే నాకు బలం. నా కథావస్తువు వారి జీవితాలే. పుస్తక రచనలో నేను చాలా ఎన్‌జీవోలు, యాక్టివిస్ట్‌ను కలిశాను. వారి సలహాలు, సూచనలు తీసుకున్నాను. అయితే అవన్నీ వలస కూలీలను ఒకే కోణంలో చూపిస్తాయి. నేను అన్ని కోణాలు స్పృశించాలని వాళ్ల జీవనంపై అధ్యయనం చేశాను. ముఖ్యంగా ఖతర్‌లోని వలస కూలీల జీవనంపైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నాను.
మొన్న కరీంనగర్ జిల్లా అంతా చుట్టొచ్చాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంతమంది గల్ఫ్‌కి వెళ్తున్నారు..? ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? ఏ లక్ష్యంతో వెళ్తున్నారు.., వెళ్లాక వారికి ఎదురవుతున్న పరిస్థితులేంటి..? ఇవీ నా ప్రశ్నలు. అవగాహన లేమితో గల్ఫ్ బాట పడుతున్న అమాయకులకు అక్కడ ఎదురవుతున్న బాధలు, కన్నీళ్లు తుడిచే చిన్న చిన్న సంతోషాలు.. తెలుసుకోవాలనుకుంటున్నాను. వీటన్నింటి సమాహారంగా నా పుస్తకం ఉంటుంది. అది వాస్తవానికి అద్దం పడుతుందన్న నమ్మకం నాకుంది. అందుకోసం కూలీల జీవనంపై వచ్చిన ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను.
హైదరాబాద్ హోమ్ టౌన్..
ఇండియా అనగానే నాకు గుర్తొచ్చేది హైదరాబాదే. ఒకరకంగా చెప్పాలంటే ఇది నా హోమ్ టౌన్. ఇప్పటి వరకు నేనిక్కడికి ఓ పది సార్లు వచ్చుంటాను. మా పిన్ని వాళ్లు ఇక్కడే ఉంటారు. పదేళ్లలో హైదరాబాద్ చాలా మారింది. ట్రాఫిక్, వాతావరణం అన్నింట్లో మార్పులు కనిపిస్తున్నాయి.
- సరస్వతి రమ