దక్షిణ తాజ్‌మహల్
let's చూసొద్దాం రండి see
పాయిగాలు... అసఫ్‌జాహీల ప్రత్యేక సైనికదళం. సైనికులుగా ఎంత కఠినులో... అంత సృజనశీలురు పాయిగాలు. వారి కళానైపుణ్యం సమాధుల్లో సైతం ఉట్టిపడుతుంది. దక్షిణ తాజ్‌మహల్‌గా కీర్తికెక్కిన ఈ పాయిగా టూంబ్స్ చూడాలంటే ఓవైసీ సెంటర్‌కు వెళ్లాల్సిందే! సంతోష్‌నగర్ చౌరస్తా నుంచి డీఆర్‌డీఎల్ దారిలో ఒవైసీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గల్లీలో ‘పాయిగా’ సమాధులు దర్శనిమిస్తాయి!
నిజామ్‌లతో వచ్చి...
పాయిగాలు నిజామ్‌లతోపాటు వచ్చి దక్కన్‌లో స్థిరపడ్డారు. నిజాం రాజులతో సమాన హోదా, దర్పం ప్రదర్శించారు. నిజాంకాలంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వీరే. రెండవ నిజాం రాజ ్యంలో సైనికాధ్యక్షుడైన అబ్దుల్ ఫతేఖాన్‌కి నిజాం ఆస్థానంలో ప్రధానమంత్రి పదవి ఇవ్వబోతే ‘ప్రభువుల రాజ్య రక్షణ బాధ్యత తప్పించి అధికార వ్యామోహం తమకు లేదని’ ఫతేఖాన్ సున్నితంగా తిరస్కరించాడట. అలా తమ ప్రత్యేక ప్రతిపత్తిని చాటుకుంటూ నిజాంల కాలంలో న్యాయ, రక్షణ, రెవెన్యూ శాఖలను సొంతంగా నిర్వహించారు పాయిగాలు. అనేక విద్యాసంస్థలనూ ఏర్పాటు చేశారు. కళలు, క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక రంగాలను విశేషంగా ప్రోత్సహించారు.
ఫలక్‌నుమా ప్యాలెస్...
దేశ విదేశాల్లో పర్యటించిన పాయిగాలు అక్కడి కళారీతులను దక్కన్‌లో పొందుపరిచారు. నగరంలో ఇప్పుడు కనిపించే సర్ ఆస్మాన్ జా దేవిడీ, ఖుర్షుద్ జా ప్యాలెస్, వికార్-ఉల్-ఉమ్రా ప్యాలెస్, బషీర్‌బాగ్‌లో పలు భవనాలు అందుకు నిదర్శనాలు. ప్రఖ్యాతిగాంచిన ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ను పాయిగా ప్రభువైన సర్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించాడు. యూరప్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి ఆర్కిటెక్చర్‌ను పోలి ఉండేలా ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణం చేయించాడు. దీనికోసం ఆ రోజుల్లోనే సుమారు 450 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్యాలెస్ పూర్తయ్యేసరికి ఖజానా దాదాపు ఖాళీ అయ్యిందట.
దక్షిణ తాజ్‌మహల్...
పాయిగా సమాధులు ‘దక్షిణ తాజ్‌మహల్’గా కీర్తి గడించాయి. విశాలమైన ప్రాంగణంలో ఎనిమిది తరాలకు చెందిన పాయిగా ప్రభువుల సమాధులు 32దాకా ఉన్నాయి. నిర్మాణానికి తెల్లని పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. ఫక్రుద్దీన్ ఖాన్‌సమాధి పై భాగాన ఆస్ట్రేలియాలో కనిపించే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు పెద్ద సైజులో కళాత్మకంగా వేలాడుతూ నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. అలాగే సర్ ఆస్మాన్ జా సమాధికి ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఉపయోగించారు.
దీన్ని స్టోన్ ఆఫ్ సీజన్స్ అంటారు. ఈ పాలరాయి వర్షాకాలంలో ఆకుపచ్చగా, చలికాలంలో తెల్లగా, తీవ్రమైన ఎండాకాలంలో పసుపుపచ్చలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆయన పేరులో ఆకాశం ఉన్నందున సమాధి ఆకాశాన్ని చూస్తూ ఉండేలా పైకప్పు లేకుండా ఏర్పాటు చేశారు. స్త్రీ , పురుషుల సమాధులను గుర్తించేందుకు వీలుగా పురుషుల సమాధులపై 30 సెంటీమీటర్ల ఎత్తులో గోపుర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది.
ఆకట్టుకుంటున్న కళారీతులు...
బేగం ఖుర్షీద్ జా సమాధి కోసం సుమారు 110 సంవత్సరాల కిందటే 40వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ‘షాజహాన్’ సమాధిని పోలి, అత్యంత విలువైన వజ్రపు రాళ్లతో పొదిగి ఉంటుంది. అయితే ఆ విలువైన వజ్రాలేవీ ఇప్పుడు కనబడవు. నాలుగు శతాబ్దాలు పైబడినా ఈ సమాధుల గోడలు బీటలు వారలేదు. ఇసుక, సున్నంలతో నిర్మించిన ఈ గట్టి గోడలపై చెక్కిన అనేక లతలు-పూలతీగలు, ఫల- పుష్ప కళారీతులు సందర్శకులను నేటికీ ఆకట్టుకుంటున్నాయి. ‘రాజస్థానీ-హిందూ’ శిల్పశైలి నిర్మాణంతో కళలకు మతం అడ్డు కాదని ఇవి రుజువు చేస్తున్నాయి.
అలాంటి పాయిగా సమాధులు ఇప్పుడు కళావిహీనంగా మారుతున్నాయి. దుమ్ము, ధూళి, తుప్పలతో నిండిపోయాయి. వీటిపై కబ్జాదారుల కన్ను ఓవైపు... అసాంఘిక కార్యకలాపాలు మరోవైపు.. అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ఇలాగే వదిలేస్తే ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిపై దృష్టి సారించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ... పర్యాటక-పురావస్తు శాఖల మీద ఉంది.
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com