శిఖరం నుంచి పాతాళానికి..
లలిత్ మోడీ.. భారత క్రికెట్లో ఓ సంచలనం. విజయాలకే కాదు వివాదాలకూ అతనో చిరునామా. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కర్త, కర్మ, క్రియ అన్నీ మోడీనే. ఈ ఈవెంట్ను అత్యంత విజయవంతం చేసిన ఘనత అతనిదే. ఐపీఎల్ ఆరంభ చైర్మన్గా మోడీ తన వ్యాపార తెలివితేటలతో లీగ్ను కొత్త పుంతలు తొక్కించాడు. అయితే ఇదంతా గతం. నేడు అదే మోడీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇంతకుముందు ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శిఖరాగ్రం నుంచి పాతాళానికి పడిపోయాడు. ఇదంతా 49 ఏళ్ల మోడీ స్వయం కృతాపరాధం.
2008లో ఆరంభమైన ఐపీఎల్ను మోడీ సర్వం తానై నడిపించాడు. లీగ్లో కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ ప్రముఖులను భాగస్వాముల్ని చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ క్రికెటర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిమానులకు వినోదాన్ని అందించాడు. బీసీసీఐకి కాసుల పంట పండింది. దీంతో మోడీ పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోయింది. లీగ్కు సమాంతరంగా అతనికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో భద్రత కారణాల రీత్యా ఐపీఎల్ రెండో సీజన్ నిర్వహణకు అనుమతి దక్కలేదు. అయినా పట్టువీడని మోడీ పోటీలను దక్షిణాఫ్రికాలో నిర్వహించాడు.
ఐపీఎల్ ఆరంభమయ్యాక తొలి రెండేళ్లు విజయవంతంగా నెట్టుకొచ్చిన మోడీకి 2010 తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఈ సీజన్కు కొత్తగా రెండు టీమ్లు పుణె, కోచి అరంగేట్రం చేశాయి. కోచి భాగస్వాముల వివరాలను మోడీ వెల్లడించడం పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలో కేంద్ర మంత్రి పదవికి శశిథరూర్ రాజీనామా చేయగా, ఆనక మోడీ కూడా చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాననే ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఫ్రాంచైలీ వేలంలో తనకు కావాల్సిన వారి కోసం నిబంధనలను అతిక్రమించి అనుకూలంగా వ్యవహరించాడనే విమర్శల్ని మూటగట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి అతణ్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన మోడీ భారత్లో తనకు ప్రాణ హాని ఉందంటూ అక్కడే ఉండిపోయాడు. మోడీపై వచ్చిన ఆరోపణలపై విచారించిన బీసీసీఐ క్రమశిక్షణ సంఘం ఇటీవల నివేదిక సమర్పించింది. మోడీపై జీవితకాల నిషేధం విధించాలని నివేదించింది. తాజాగా సమావేశమైన బోర్డు మోడీపై వేటు వేసింది. దీంతో ఒకప్పడు విజయవంతమైన అధికారిగా మన్ననలందుకున్న లలిత్ మోడీ నేడు దోషిగా ముద్ర వేయించుకుని బోర్డుకు శాశ్వతంగా దూరమయ్యాడు.