
‘సిక్స్ టు సిక్స్‌టీన్’
పిల్లలకు పుస్తక జ్ఞానం సరిపోతుందా? మరి లోకజ్ఞానం సంగతేంటి? ఇల్లు, స్కూలు కాకుండా బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు వారి పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబుగా వెలసిందే ‘సిక్స్ టు సిక్స్‌టీన్’. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసు పిల్లలకు బయటి ప్రపంచం గురించి బోధించడం ఈ సంస్థ ప్రత్యేకత.
పదోతరగతి పిల్లలకు బయట ప్రపంచం గురించి ఎంతవరకూ తెలుసు? అనే అంశంపై రమణి రెండేళ్లపాటు పరిశోధన చేశారు. చాలా విషయాలు తెలియవని తేలింది. వ్యవసాయం గురించి తెలియదు, వాతావరణ కేంద్రం గురించి తెలీదు, ఫొటోగ్రఫీ అంటే తెలీదు, పొటాటో పంట ఎలా ఉంటుందో తెలీదు....వీటి సంగతి పక్కన పెడితే ఒక రెస్టారెంటుకి వెళితే ఎలా ప్రవర్తించాలో తెలీదు.
ఇలాంటి విషయాలు స్కూల్లో నేర్పరు. స్కూల్ లైఫ్ అయ్యాక నేర్పినా నేర్చుకోరు. పిల్లల కోసం ప్రత్యేకంగా పనిచేయాలనుకున్న రమణి మెదడుని ఈ ప్రశ్నలే తొలిచేశాయి. ఓ హెచ్‌ఆర్ కంపెనీ అధినేత అయిన ఆమె స్కూలు విద్యార్థులకు ఎడ్యుకేషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో సిక్స్ టు సిక్స్‌టీన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీనికి రమణి పెట్టిన మరో పేరు ఎడ్యుటైన్‌మెంట్.
నెలకోసారి...
‘‘డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఎడ్వంచర్ల వరకూ పిల్లలకు అన్ని విషయాలు తెలయాలన్నది నా ఉద్దేశం. మొదట్లో చాలామంది ‘సమయమొచ్చినపుడు వాళ్లే నేర్చుకుంటారు...దానికి ప్రత్యేకంగా బోధనెందుకు’ అన్నారు. కానీ...ఈ జనరేషన్ పిల్లలకు చదువుకే సమయం సరిపోవడం లేదు...మిగతావాటికి సమయమెక్కడుంటుంది? అందుకే చదువుతోపాటు మిగిలిన జ్ఞానం కూడా వంటబట్టించాలనుకున్నాను. నెలలో రెండో ఆదివారం మా కార్యక్రమం ఉంటుంది.
కొన్ని స్కూళ్ల నుంచి ఆసక్తి ఉన్న పిల్లల్ని ఒక్కోసారి ఒక్కోచోటికి తీసుకెళతాం. ఉదాహరణకు...మొన్నీమధ్య వాతావరణ శాఖ దగ్గరికి తీసుకెళ్లి వెదర్ ఎలా ఫోర్‌కాస్ట్ చేస్తారో చూపించాం. అలాగే నాలుగు నెలల క్రితం టూర్‌లో పట్టుపురుగు నుంచి సిల్క్‌ని ఎలా సేకరిస్తారో వివరించాం. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఐదు బ్యాచ్‌లుగా విభజించి ఎవరికి ఏం నేర్పించాలో నిర్ణయించుకుని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పటివరకూ నగరంలోని 18 పాఠశాలల్లోని 500 మంది పిల్లలు సిక్స్ టు సిక్స్‌టీన్‌లో చేరారు’’ అని చెప్పారు రమణి.
110 అంశాలపై...
గత పదకొండు ఏళ్లలో దాదాపు 110 అంశాలపై పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించారు. వీటిలో సాగర్‌లో పడవ నడపడం, నగర శివార్లలో కొండలెక్కడం, పొలాల్లోకి వెళ్లి పంటలు చూడ్డం వంటి ఆసక్తికరమై అంశాలెన్నో ఉన్నాయి. ‘‘మేం తీసుకెళ్లే ప్రాంతాన్ని బట్టి, అంశాన్ని బట్టి చార్జ్ చేస్తాం. మేం పిల్లల్ని ఏరోప్లేన్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లినపుడు వారు తెలుసుకున్న విషయాలను స్కూల్లో టీచర్లతో చెప్పినప్పుడు ఆయా స్కూల్స్ టీచర్ల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టేబుల్ మ్యానర్స్, డ్రెస్సింగ్ సెన్స్ వంటి విషయాల గురించి నేర్పించినపుడు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇప్పుడున్న స్టడీ మెటీరియల్ వల్ల టీచర్లకు ఇతర విషయాలు చెప్పే తీరిక లేకుండా పోయింది. అలాగే ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులకు బేసిక్స్ నేర్పించే ఓపిక లేకుండా పోతోంది. ఈ లోటుని మా సిక్స్ టు సిక్స్‌టీన్ భర్తీ చేయగలుగుతోందని నేను గర్వంగా చెప్పగలను’’ అని వివరించారు రమణి. పన్నెండుమంది సిబ్బందితో వందలమంది విద్యార్థులకు లోకజ్ఞానాన్ని నేర్పిస్తున్న ఈ సంస్థ మరింత వినూత్నంగా పనిచేయాలని కోరుకుందాం.
..:: భువనేశ్వరి