ఆ ఆదివారం
మే 10, 1857- ఆ రోజు ఆదివారం. మీరట్ కంటోన్మెంట్‌లో ఈస్టిండియా కంపెనీ అధికారులు తీరికగా ఉన్నారు. సెలవని కొందరు ఇళ్లలో ఉన్నారు. కణకణ మండే ఆ ఎండలో ‘మారో ఫిరంగీ కో’ అని నినదిస్తూ కాల్బలానికి చెందిన మూడు దళాలు ఒక్కసారి తుపాకులు ఎక్కుపెట్టాయి. దాదాపు యాభై మంది ఆంగ్లేయులను మట్టుపెట్టాయి. జైలు నుంచి 85 మందిని, వివిధ నిర్బంధాల నుంచి మరో 800 మందిని విడుదల చేశాయి. మూడో దళానికి చెందిన కొందరు సభ్యులు వెంటనే ఢిల్లీ బయలుదేరి, మరునాడే చివరి మొగల్ చక్రవర్తి బహదూర్‌షా జాఫర్‌ను తిరుగుబాటుకు నాయకునిగా ప్రకటించారు. మార్చి 29, 1857న మంగళ్‌పాండే బ్యారక్‌పూర్ (బెంగాల్) లో పేల్చిన తుపాకీ తూటా ఇలా ప్రతిధ్వనించింది. ఈ ఉద్యమం విఫలమైంది. కానీ కంపెనీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగింది. అందుకే అది భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం.