
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితుల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సౌరభ్ భార్య, నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు దర్యాప్తు తేలింది. అలాగే, సౌరభ్‌కు నిద్ర మాత్రలు ఇచ్చిన నిద్రలోకి వెళ్లిన తర్వాత హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేసిన మాత్రల గురించి విచారణ చేపట్టినట్టు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీటర్‌లో ప్రేమించి పెళ్లాడిన సౌరభ్‌ను ప్రియుడి సాయంతో ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇక, తాజాగా ముస్కాన్ తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ ఇచ్చినట్టు తెలిసింది. వాటితో బెట్టింగ్ ఆడినట్టు వెల్లడైంది. అలా వచ్చిన డబ్బులతో వారిద్దరూ విహారయాత్రకు వెళ్లారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. భార్యా భర్తలుగా చెప్పుకుని కసోల్‌లోని ఓ హోటల్‌లో మార్చి 10న దిగారు. అక్కడే ఆరు రోజులు ఉండి 16వ తేదీన వెళ్లిపోయారు. వారితోపాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు వెల్లడించాడు.
నాలుగు రోజులు హోటల్ గదిలోనే..
అయితే, ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్‌లోనే గడిపారని, కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారని హోటల్ యజమాని పేర్కొన్నాడు. అలా చేయడం అసాధారణంగానే అనిపించిందని, కనీసం రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గది లోనికి రానివ్వలేదని చెప్పాడు. హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు.. తాము మనాలీ నుంచి వచ్చామని, యూపీకి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది.
ఫుడ్ కాదు.. డ్రగ్స్ కావాలి..
ఇదిలా ఉండగా.. ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా (Drug Addiction) మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండడంతో వేరేగా ఉంచినట్లు తెలిపారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వారిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
హత్య ఇలా..
సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment