స్మార్ట్ స్వాప్ | they started moswap company | Sakshi
Sakshi News home page

స్మార్ట్ స్వాప్

Published Thu, Nov 6 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

స్మార్ట్ స్వాప్

స్మార్ట్ స్వాప్

అర్బన్ యూత్‌కి.. నేడు నచ్చింది రేపు నప్పదు. కొత్త లుక్, సరికొత్త ఆప్షన్స్‌తో రోజుకో రకం అప్‌డేటెడ్ గాడ్జెట్స్ మార్కెట్‌లోకి వచ్చిపడుతున్నాయి. న్యూ వెర్షన్స్ ఇలా రిలీజయ్యాయో లేవో.. అప్పటి వరకూ సేవలందించిన స్మార్ట్‌ఫోన్ పాత చింతకాయ పచ్చడిలా తోస్తుంది. ఇంకేముంది క్రెడిట్ కార్డు గీకేసి.. కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవడం సిటీ యువతకు కామన్.

పాత ఫోన్‌ను రేటు రాకున్నా ఎవరికైనా అమ్మేసి నయా ఫోన్‌తో ఎంజాయ్ చేసేస్తుంటారు. కానీ, పాత ఫోన్‌ను ఎవరికి, ఎలా, ఎక్కడ అమ్మాలో తెలియదు. రూరల్ కుర్రాళ్లకు.. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త ఫోన్లు చూసి మురిసిపోవడం తప్ప.. కొనడం కష్టమైన పని. అలాగని సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వేలకు వేలు పెట్టి ఫోన్ కొనే సాహసం చేయలేరు. అక్కడంతా మోసమనే టాక్ వెళ్లనివ్వదు. సిటీలోని నయాట్రెండ్‌ను.. గ్రామాల్లోని కొత్త ఆశలకు లింకప్ చేస్తూ.. ముగ్గురు కుర్రాళ్లు ఓ సొల్యూషన్ కనిపెట్టారు. దాని పేరు మోస్వాప్.
 
కొత్త ఫోన్ వచ్చింది కదా అని పాతఫోన్‌ను ఎవరికో ఉచితంగా ఇవ్వలేం. ల్యాప్‌ట్యాప్, టాబ్లెట్ల పరిస్థితీ అంతే. కార్తీక్ ఆనంద్‌రెడ్డి దీని గురించి బాగా ఆలోచించారు. అతనికి ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్ అచ్యుత్‌రెడ్డి, యోగేశ్వర్ జత కలిశారు. దేశం మొత్తమ్మీద ఈ సమస్యకు లోకల్‌గా ఉన్న సెకెండ్‌హ్యాండ్ మార్కెట్లు తప్ప మరో పరిష్కారం లేదని గ్రహించి.. మోస్వాప్ కంపెనీని స్థాపించారు.

కార్తీక్ సరోజినీదేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ కె.నర్సారెడ్డి ఏకైక కుమారుడు. ఢిల్లీలో ఎన్‌ఈసీ కంపెనీలోఆరంకెల జీతాన్ని కాదని మోస్వాప్ స్థాపనకు సిద్ధపడ్డాడు. అచ్యుత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో జాబ్‌ను పక్కన పెట్టాడు. యోగేశ్వర్ కూడా అంతే. వీరి ప్రయోగం ఇంట్లో వారిని ఆందోళనలో పడేసినా లెక్కచేయకుండా సెకండ్‌హ్యాండ్‌కి ఫస్ట్‌క్లాస్ పరిష్కారం కనుక్కున్నారు.

అంతా ఆన్‌లైనే...
మోస్వాప్ కంపెనీ పేరుతో ఉన్న వెబ్‌సైటే వీరిని సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమ్మేవారి దగ్గరకి చేరుస్తోంది. ‘మా వెబ్‌సైట్  ఠీఠీఠీ.ఝౌటఠ్చీఞ.జీలో లాగిన్ అయ్యాక అందులో ఐదు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. సెల్‌ఫోన్స్, టాబ్లెట్స్, ఐపోడ్స్, మ్యాక్, ల్యాప్‌టాప్స్.. ఇందులో మీది ఏ ఆప్షనో సెలక్ట్ చేసుకుంటే వెంటనే అందులో వెరైటీలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మోడల్, వెర్షన్ వంటి వివరాలన్నీ సెలక్ట్ చేసుకుని సబ్‌మిట్ చేస్తే వెంటనే మేం మీకు ఫోన్ చేసి మీ ఇంటికొచ్చి మీరు అమ్మాలనుకుంటున్న వస్తువును తీసుకుంటాం.

మాకు మీరు వస్తువును అప్పగించినట్టు ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేసి ఇస్తాం. ఆ వస్తువు పనితీరును గమనించాక దానికి తగ్గ ఖరీదుని మీకు అందజేస్తాం. ఒకవేళ మేం ఆఫర్ చేసిన ప్రెస్ నచ్చకపోతే వెబ్‌సైట్ ప్రైస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ద్వారా మీ ధర అంచనా కూడా చెప్పొచ్చు’ అంటూ తన కంపెనీ ప్రత్యేకతను వివరించారు కార్తీక్. నిజమే!..ఈ-సర్వీస్ సిటీ యూత్‌కు చాలా అవసరం.

స్మార్ట్ మార్కెటింగ్
సిటీలో సేకరించిన స్మార్ట్ గాడ్జెట్స్‌ను మార్కెటింగ్ చేయడంలోనూ వీరు హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యారు. ‘మాది నల్గొండ జిల్లా మోత్కూరు. ఊరికెళ్లినపుడు అక్కడ నా స్నేహితులు నా చేతిలోని ఫోన్ చూసి ఖరీదెంత, ఫీచర్లేంటని ఆరాలు తీస్తున్నారు. వారికి కూడా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లను వాడాలని ఉంటుంది.

కానీ గ్రామాల్లో ఫోన్లకు పాతికవేలు పోస్తామంటే ఇంట్లోవాళ్లు కొట్టడం ఒక్కటే తక్కువ. పైగా అంత స్థోమత కూడా ఉండదు. అలాంటి చోట ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఫోన్లకు భలే గిరాకీ ఉంటుందని తెలుసుకుని దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాం. మెడికల్ షాపులు నడిపేవాళ్లను, స్టూడెంట్లను ఎంపిక చేసి వారికి కమీషన్ బేసిస్‌పై ఈ మార్కెటింగ్‌ని అప్పగించాం. దాంతో మా సేల్స్ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి’ అంటూ తమ మార్కెటింగ్ సీక్రెట్ చెప్పారు అచ్యుత్‌రెడ్డి.

మౌత్‌టాక్...
ఈ ఏడాది జనవరిలో స్థాపించిన మోస్వాప్ కంపెనీ ఇప్పటి కి మూడు వేల ట్రాన్‌సాక్షన్లు చేసింది. వీటిలో తొంభైశాతం గ్రామాల్లోనే చేసింది. ఈ పది నెలల్లో వీరి కొనుగోళ్లు, అమ్మకాలన్నీ మౌత్‌టాక్ ద్వారానే నడిచాయి. అయితే ఈ కంపెనీకి ఫోన్లు అమ్ముతామంటూ ఢిల్లీ, చెన్నై వంటి సిటీలను నుంచి మెయిల్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఏజెంట్లను పెట్టుకునే ప్రయత్నంలో ఉంది మోస్వాప్. ‘ఇప్పటికే ముంబైలో మోస్వాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. న గరాల్లో ఉండే ప్రతి ఒక్కరికి మా కంపెనీ గురించి తెలియాలనేదే మా టార్గెట్. వారు వద్దనుకున్న వస్తువులను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు’ అని  చెప్పారు కార్తీక్.
 
భువనేశ్వరి, bhuvanakalidindi@gmail.com
ఫొటోలు: సృజన్ పున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement