ఇదే లేటెస్ట్ ఫ్యాషన్!
ఏ వస్తువైనా, దుస్తులైనా కొనాలంటే మార్కెట్‌కు వెళ్లడం పాత పద్దతి. ఇంట్లో నుంచి బయటకు కదలకుండా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి కొరుకున్న వస్తువును కొనుగోలు చేయడం లేటెస్ట్ ఫ్యాషన్ అయింది. సమయం సందర్భం లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా కొనుగోలు చేసే అవకాశమున్న ఆన్‌లైన్ మార్కెట్ రాకెట్ వేగాన్ని మించిపోతోంది. ఆన్‌లైన్ దెబ్బకు నిన్నటి వరకు కళకళలాడిన రిటైల్ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. దేశంలో ఆన్‌లైన్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు ఓ మోస్తరు నగరాలు, పట్టణాలకు కూడా పాకింది. ఇంటికి చేర్చే అవకాశం ఉంటే గ్రామలకు కూడా విస్తరించడం ఖాయం. త్వరలో ఆ ముచ్చట కూడా తీరుతుంది. అందరికీ ఆన్లైన్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులతో పాటు వ్యాపారం కూడా భారీస్థాయిలో విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు ఆన్‌లైన్ మార్కెట్ చేరిందని లెక్కలు చెపుతున్నాయి.
కోరుకున్న వస్తువు దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయడం కాకుండా, కొరుకున్న వస్తువును అనుకున్న చోటుకు తెచ్చే ఆన్‌లైన్ వ్యాపారంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వస్తువు ఏదైనా సరే దుస్తుల నుంచి బుక్స్ వరకు, పలక నుంచి పుస్తకం వరకు, టీవీ నుంచి ఫ్రిజ్ వరకు సమస్తం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రిటైల్ వ్యాపారాన్ని 30-50 శాతం మేర ఈ కామర్స్ మార్కెట్ షేర్ చేసుకుందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. 2016 కల్లా ఈ-కామర్స్ మార్కెట్ 93 వేల కోట్ల రూపాయలకు ఎగబాకే అవకాశముందని భావిస్తున్నారు.
2012లో ఆన్‌లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షల మంది కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3 కోట్ల 50 లక్షలకు చేరింది. 2016 నాటికి ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ సుమారు 18,600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆన్ లైన్ మార్కెట్ కస్టమర్లకు అన్నిరకాలుగా సేవలను అందిస్తుండటంతో వినియోగదారులు ఆన్‌లైన్ వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నారని రిటైల్ వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామర్స్ మార్కెట్ భవిష్యత్తులో రిటైల్ వ్యాపారం లేకుండా చేయొచ్చనే భయాందోళనలు కూడావ్యక్తం అవుతున్నాయి.
ఎలక్ట్రానిక్ మార్కెట్‌లోనూ ఈ కామర్స్ తన సత్తా చాటుతోంది. లేటెస్ట్ టెండ్ర్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను ఇప్పటికే పూర్తి స్దాయిలో తనవైపు తిప్పుకుంది. వాషింగ్మెషిన్, ఫ్రిజ్, ఏసీ లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను అన్ లైన్ మార్కెట్‌లో కాకుండా రిటైల్ మార్కెట్‌లోనే కొనడం వల్ల కస్టమర్లకు ప్రయోజకరంగా ఉంటుందని ఎలక్ట్రానిక్స్ రిటైల్ వ్యాపారస్తులు అంటున్నారు.
ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం, ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణంగా కనపడుతోంది. ఎక్కడినుంచైనా, సమయంతో సంబంధంలేకుండా షాపింగ్ చెసే వెసులుబాటు ఉండటం వల్ల ప్రధానంగా యువత ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆఖరికి తినుబండారుల కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ-కామర్స్ మార్కెట్ మరింత విస్తరిస్తే మునుముందు ఒక్క ఏంటర్‌టైన్మెంట్ కోసం మాత్రమే నగర వాసులు బయటికి వెచ్చే అవకాశం వుంటుంది.