భద్రాద్రి రామయ్యకు.. ముస్లింల సన్నాయి సేవ | two muslims serve lord rama in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామయ్యకు.. ముస్లింల సన్నాయి సేవ

Published Fri, Jan 30 2015 6:26 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

నాదస్వరం ఊదుతున్న మౌలాసాహెబ్,  తాళం వాయిస్తున్న కాశింబాబు - Sakshi

నాదస్వరం ఊదుతున్న మౌలాసాహెబ్, తాళం వాయిస్తున్న కాశింబాబు

నిత్యం భద్రాద్రి రామయ్య వీరి నాదస్వరంతోనే మేల్కొంటాడు. వీరి తియ్యని ‘నాద’స్వరంతో రామాలయ ప్రాంగణం పరవశించిపోతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ముస్లింలు.. కౌసల్యా, సుప్రజా, రామ...అని వేకువజామున వినిపించే సుప్రభాత సేవ నుంచి రాత్రి నిర్వహించే పవళింపు సేవ వరకు వీరు రామయ్య సన్నిధిలోనే గడుపుతారు.
 
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల కాలంగా ఇద్దరు ముస్లింలు మంగళవాయిద్య బృందంలో నాదస్వరం (సన్నాయి), తాళం వాయించే కళాకారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నల్గొండ జిల్లా మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ మౌలాసాహెబ్ 2000 సంవత్సరం నుంచి భద్రాద్రి రామాలయంలో నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తన తాతగారైన పల్నాడు నాదస్వర విద్వాంసులు హుస్సేన్ వద్ద నాదస్వర వాయిద్య నేర్చుకున్నాడు. మొదట్లో రామాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు మౌలాసాహెబ్‌ను పిలిపించేవారు. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి దేవస్థానం ఆస్థాన నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇతని పెద్ద కుమారుడు బాషా కూడా భద్రాద్రి ఆలయంలోనే పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు హుస్సేన్ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం దీపారాధన చేసి రామయ్య సేవకు ఉపక్రమించటం మౌలాసాహెబ్‌కు నిత్యకత్యమైంది. దేవస్థానంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. అయితే రంజాన్, బక్రీద్ పండగల సమయంలో మసీద్‌లకు వెళ్లి నమాజు చేస్తాడు. రామయ్య దయ వల్లే తన కుటుంబం సంతోషంగా ఉందని, జీవితాంతం రాములోరి సేవలోనే తరిస్తానని ఆనందంగా చెపుతున్నాడు.

కృష్ణా జిల్లా తిరువూరు మండలం గోసవీడుకు చెందిన షేక్ కాశిం బాబు కూడా సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన వారే. ఈయన తండ్రి హసన్ సాహెబ్ 1953 నుంచి భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. అయితే తన చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్న కాశిం బాబు కూడా ఉత్సవాల సమయంలో రామయ్య సేవలో తరించేవాడు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడే మంగళవాయిద్య బృందంలో పనిచేస్తున్నాడు. ఈయన నాదస్వరంతో పాటు, తాళం వాయించటంలోనూ దిట్ట. కుల, మత భేదం లేదని, మనసు స్వచ్ఛంగా ఉంటే ఏ దేవుడైనా చల్లగా చూస్తాడని, తాము రామయ్య సన్నిధిలో హాయిగా బతుకుతున్నామని చెపుతున్నారు.
 -వి.శివకుమార్, భద్రాచలం రూరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement