యూపీ, ఫజియాబాద్ : భారతఖండం...‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ ప్రదర్శిస్తుంది. అనాదిగా ఈ భరతభూమిలో మతసామరస్యం వెల్లివిరుస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లింలు భాయ్..భాయ్. ఇందుకు నిదర్శంగా ఓ అరుదైన సంఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం సొదరుడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల చిత్రాన్ని ముద్రించి మరోమారు హిందూ, ముస్లింలు అన్నదమ్ములనే భావాన్ని ప్రచారం చేశాడు. వివారాల్లోకి వెళ్తే యూపీ ఫజియాబాద్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లా బాగ్సరాయ్ గ్రామానికి చెందిన మహ్మద్ సలీమ్ కుమార్తె జహన బానోకు వివాహం నిశ్చయమైంది. భారతీయ మతసామరస్యానికి ప్రతీకగా తన కూతురు వివాహ వేడుక జరగాలని సలీమ్ భావించాడు. అందుకే పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయం ప్రకారం ముద్రించాడు.
ఈ పత్రికలో సీతారాములు పవిత్ర అగ్నిహోమం ముందు నిలబడి ఉన్న ఫోటోను ముద్రించారు. అంతేకాకుండా పూజ సామాగ్రి అయిన కలశం, దీపాలు, అరటి ఆకులతోపాటు పవిత్ర మంగళసూత్రం, కొబ్బరికాయ, పూలు, పండ్లు వంటి అంశాలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. అంతేకాక ఈ ఆహ్వాన పత్రిక చేతితో రాసి ఉన్నట్లు ఉండటం మరో విశేషం. సలీమ్ ఈ పత్రికను తన హిందూ స్నేహితులకు ఇచ్చినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారని తెలిపాడు సలీమ్. అలానే తన ముసల్మాను బంధువులకు ఇచ్చినప్పుడు వారు ఆనందంగా దీన్ని స్వీకరించడమే కాక తన ప్రయత్నాన్ని అభినందించారని తెలిపాడు.
అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని సలీమ్‌ను అడగ్గా ‘హిందూ, ముస్లింల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించాలనుకున్నాను, అందుకే నా కుమార్తె పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించాను. హిందూ సోదరుల మత విశ్వాసాలను, వారు కొలిచే దేవతామూర్తులను గౌరవిస్తే వారు కూడా మనస్పూర్తిగా ముస్లిం మతాన్ని గౌరవిస్తారని’ తెలిపాడు. సలీమ్ పక్కంటి వ్యక్తి రాధే శ్యామ్ ‘సలీం తన కూతురు వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల బొమ్మను ముద్రించి హిందూ మతం పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేసాడు. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అతడు చేసిన పనిని ఏ ఒక్క ముసల్మాను కూడా వ్యతిరికించలేదు. ఇది నిజంగా అభినందనీయం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment