యువతులు చెప్పుకోలేరని తెగబడుతున్నారు | Women gagged with fear of disgrace, rape incidents on spurt | Sakshi
Sakshi News home page

యువతులు చెప్పుకోలేరని తెగబడుతున్నారు

Published Tue, Oct 22 2013 7:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

యువతులు చెప్పుకోలేరని తెగబడుతున్నారు - Sakshi

యువతులు చెప్పుకోలేరని తెగబడుతున్నారు

తనపై అత్యాచారం జరిగితే ఏ ఆడపిల్ల బయటకు చెప్పుకోలేదనే ధైర్యంతో కామాంధులు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాప్ట్వేర్ యువతి కిడ్నాప్, అత్యాచారం కేసులో ఈ విషయం స్పష్టమైంది. యువతుల బలహీనతను ఆసరాగా చేసుకొని కామాంధులైన యువకులు రెచ్చిపోతున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు చెప్పిన విషయాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.

బెంగళూరుకు చెందిన ఓ యువతి(22) మాదాపూర్‌లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేటు మహిళా హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 18 తేది శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌లో షాపింగ్ పూర్తి చేసుకుంది.  రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గౌలిదొడ్డి వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది. అరగంట గడిచినా బస్సు రాకపోవడంతో అటుగా వచ్చిన క్యాబ్ ఎక్కింది.   అయితే క్యాబ్ దారిమళ్లిందని గమనించిన ఆమె వెంటనే సెల్‌ఫోన్ ద్వారా తన స్వస్థలంలో ఉంటున్న స్నేహితునికి సమాచారమిచ్చింది. అతను ఆ విషయాన్ని నగరంలో ఉంటున్న తన మిత్రునికి తెలియజేశాడు.  అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈలోగా  జరగవలసినదంతా జరిగిపోయింది. ఆ ఇద్దరు అతి కిరాతకంగా ఆ యువతిపై అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగేసరికే  ఇద్దరు కామాంధులు ఆమెను హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయారు

సీసీ కెమెరాలలోని  దృశ్యాల ఆధారంగా నిందితులను  సతీష్, వెంకటేశ్వర్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు వారిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా  నిందితుడు వెంకటేశ్వర్లు జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. సంఘటన వివరాలు అతని మాట్లల్లోనే.... నాకు అత్యాచారం చేయాలన్న ఉద్దేశం లేదు. నా స్నేహితుడు సతీష్  బలవంతపెట్టడం వల్లే  సాప్ట్వేర్ యువతిపై  అత్యాచారం చేశాను.  సతీష్ ఆ యువతిని వోల్వా కారులో ఎక్కించుకున్నాడు. నేను కూడా ఆ కారులోనే ఉన్నాను.  ఆమె చెప్పినవైపు కారు పోనివ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్డు, నాచారం, కోకాపేట వైపు  తీసుకువెళ్లాడు.  అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడు, దిగాడు. చాలా సమయం అలాగే తిప్పాడు.  చివరకు మెదక్ జిల్లా తెల్లాపూర్ సమీపంలో అడవి లాంటి ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు. మనుషులు ఎవరూ కనిపించడంలేదు. కారును అక్కడ ఆపాడు. ఆ అమ్మాయిని పాడుచెయ్యమని అడిగాడు. నాకు భయం వేసింది. అందుకు నేను అంగీకరించలేదు. ఆ అమ్మాయి పోలీసులకు చెబితే వారు కొడతారని చెప్పాను. అతను వినలేదు. ఆడపిల్లలు పరువు పోతుందని, ఇటువంటి విషయాలను బయటకు చెప్పరు, నీకు ఏం భయంలేదు అని నన్ను ప్రోత్సహించాడు. అయినా నేను వినలేదు. దాంతో అతను కారు లోపలకు వెళ్లి తాళం వేసుకున్నాడు. ఆ అమ్మాయి అరుపులు పెడుతున్నా వినకుండా అత్యాచారం చేశాడు.

ఆ తరువాత అతను బయటకు వచ్చి నన్ను కూడా ఆ అమ్మాయిని పాడుచెయ్యమని కోరాడు. నేను చేయనని చెప్పాను. నాకు భయం అన్నాను. అయినా అతను వినలేదు. భయపెట్టాడు. బెదిరించాడు. ''ఇప్పుడు నేను ఒక్కడినే తప్పు చేసినవాడిని అవుతాను. నువ్వు కూడా చేయాలి. లేకపోతే నిన్ను చంపుతాను.'' అని బెదించాడు.

ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు బాధితురాలికి 'అభయ' అని పేరు పెట్టి  నిర్భయ చట్టం కింద అత్యాచారం కేసు  నమోదు చేశారు. ఢిల్లీలో సంఘటన తరువాత అత్యంత సంచలనం సృష్టిచిన ఈ కేసు ఛేదించడం కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులపాటు దర్యాప్తు చేశారు. నగరంలోని  వోల్వా కారుల సమాచారం మొత్తం సేకరించారు. అత్యంత వేగంగా పరిశోధన పూర్తి చేసి  నిందితులను పట్టుకోగలిగారు.

ఒంటరి ఆడపిల్లలు - వారు పరువు గురించి ఆలోచించడం వల్ల కామాంధులు ధైర్యంగా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు  అర్ధమవుతోంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు యువతులు ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పవలసిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది. ఆడవారు పరువుకోసం ప్రాకులాడకుండా బయటకు చెబితే ఇటువంటివారు కొంతవరకు భయపడే అవకాశం ఉంటుంది. ఒంటిరిగా ఉద్యోగాలకు వెళ్లే యువతులు, మహిళలు  జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఉద్యోగులు తమ కంపెనీకి చెందిన క్యాబ్‌లలోనే ఎక్కాలని, షేరింగ్ క్యాబ్‌లలో ఎక్కడం అంత మంచిది కాదని  సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్  సూచించారు.  

ఒక్క హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో క్యాబ్ డ్రైవర్లు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముంబై, బెంగళూరు, పూనే... లలో ఇటువంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యువతులు జాగ్రత్తగా ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement