తులా రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Libra Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (తులా రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:22 AM | Last Updated on Tue, Apr 2 2019 6:31 PM

2019 To 2020  Libra Zodiac Sign Horoscope - Sakshi

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయంలో శని కేతువుల సంచారం, తృతీయ చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. స్నేహితులను ఆదుకోవడంలో వెనుకా ముందూ ఆలోచించరు. క్రీడలపట్ల ఆసక్తి, సాహస క్రీడలపట్ల మరింత ఆసక్తి ఉంటుంది. భార్యవైపు బంధువులు పెత్తనం చలాయిస్తారు. ఆస్తి కోసం కనిపెట్టుకుని ఉంటారు. చాలా సందర్భాలలో మంచివాళ్ళను చేరదీయలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జీవితంలో అది వెలితిగా అనిపిస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. లిఖితపూర్వక విషయాలలో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవీ మీ విషయంలో ఆచరణలో పెట్టరు. షేర్స్‌ బిజినెస్‌ ప్రమాదకరం, జాగ్రుత్తగా ఉండండి. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్‌ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలను మరువకండి. ఇతరులు చేసిన మేలు గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది. ఇష్టంలేని వ్యక్తులతో సహజీవనం చేస్తారు. రాజీలేని మీ భావాలకు, పనితనానికి కఠినమైన సవాళ్ళు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  ప్రయోజనాలు, కీర్తి పరిత్యాగం చేస్తారు. ఎదుటివాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. ప్రతిష్ఠ కాపాడుకుంటారు.

రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యలు సృష్టిస్తారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా వుంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. పాదాలు, మోకాళ్ళనొప్పులు, వెన్నునొప్పి మొదలైన కీళ్ళ రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలం అవుతాయి. కీలక సమయంలో బంధువర్గం సహాయ సహకారాలు నామమాత్రంగా లభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చుని అదుపులో పెట్టడంలో విజయం సాధిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, వివాహం కానివారికి వివాహప్రాప్తి కలుగుుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు. మీ వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మీకు మేలు జరిగే పత్రాలు, డాక్యుమెంట్స్‌ మొదలైనవి ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దూర ప్రయాణాలు, దూరప్రాంత విద్యాసంబంధమైన విషయాలు కష్టంమీద ఫలిస్తాయి. పోటీపరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు రావచ్చు. సంతానాన్ని గారాబం చేయడం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడుపడవు. బంధువులలో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చోరభయం పొంచివుంది. కొంతమందితో సిద్ధాంతపరమైన విభేదాలు వస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్ళను రక్షించవలసిన పరిస్థితి వలన సంవత్సరాంతంలో మీ పరపతి దుర్వినియోగం అవుతుంది.

గతంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు ఈసారి అమలులోకి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. విద్యాసంబంధంగా నూతన కోర్సులను అభ్యసిస్తారు. సంవత్సర మధ్యంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధవహించవలసి ఉంటుంది. శత్రువర్గం బలపడి ఉండటం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. బినామీ పేర్లతో చేసే వ్యాపారాలలో లాభపడతారు. టీవీ, సినీరంగంలోని వారికి, యాంకర్లకు, కళాకారులకు నూతన అవకాశాలు కలిసివస్తాయి. ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. మీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు, సేవాసంస్థలకు, సాంస్కృతిక సంస్థలకు పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టపడటంలోని ఆనందాన్ని గుర్తిస్తారు. మీరు చెప్పే మంచి మాటలు, బోధనలను అందరూ ఆచరిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ మాటలు రుచించవు. పూర్వీకులు వ్రాసిన డాక్యుమెంట్లు, వీలునామాల్లోని లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి. ఫ్యాన్సీ షాపులవారికి, ఎలక్టాన్రిక్‌ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారస్థులకు, బ్యూటీపార్లర్స్‌ వారికి, చేతివృత్తుల పనివారికి, సుగుంధద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్‌ కౌంటర్స్‌వారికి, హోల్‌సేల్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. చెప్పుడు మాటలు విని అయినవాళ్ళని దూరం చేసుకొని నష్టపోతారు. తనఖాలు, మొండిబాకీలు వంటి ఆర్థికఅంశాలపై దృష్టి సారిస్తారు. కొంత పురోభివృద్ధి ఉంటుంది. ప్రజాజీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. వివాదాస్పద అంశాలలో మధ్యవర్తి పరిష్కారాల వల్ల బయటపడతారు. ఒకచోట నష్టపోయినా మరోచోట లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానాన్ని చదువు కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు చాలా మందికి నచ్చదు. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణం అవుతుంది. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారిపట్ల మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. నిష్కారణమైన తగాదాలు, స్పర్థలు చోటుచేసుకోవడం ప్రారంభమవుతుంది. విదేశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది.

విదేశాలలో సంపాదించిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట విని బాగుపడటం మీ బంధువులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.  స్విమ్మింగ్, పిక్నిక్‌లు, బైక్‌రైడింగ్‌లకు దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి దొర్లిన పొరపాటును రహస్యంగా చక్కబెడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల విమర్శలు ఎదుర్కొంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో భాగస్వామ్య వ్యాపారాలలో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మకద్రోహులను సాగనంపుతారు. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది.  స్త్రీలతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి, మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం పనిచేస్తారు. వాళ్ళకు మీరు సన్నిహితులు అవుతారు. మీకు మేలు జరిగే పత్రాలు అధికారుల సుముఖానికి ఆలస్యంగా చేరుతాయి. మీ రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది. ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. ముఖ్యమైన సభలకు ఆహ్వానాలు అందుతాయి. మీ ఉపన్యాసాలు, అనుభవం అందరితో శ్లాఘించబడతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్‌  బిల్స్‌ చేతికి అందుతాయి. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగుున్నాయి.


స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యాసంబంధమైన విషయాలలో తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. వైద్యవిద్యకు సంబంధించిన కృషి ఫలిస్తుంది. ఎంతో కష్టతరమైన కార్యక్రమాలను ఒంటరిగా పోరాడి సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మొండిగా ఉన్న సంతానాన్ని మెల్లగా మంచి మాటలతో దారిలో పెట్టగలుగుతారు. జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. కొందరి విషయంలో జీవితభాగస్వామితో విసిగిపోయి విడిపోవడం సంభవిస్తుంది. మీ నిజాయితీ వెలుగు చూస్తుంది. గోరంతలు కొండంతలుగా చేసి మీమీద అపవాదులు ప్రచారం చేసిన వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. బ్యూటీపార్లర్లు, అలంకార సంబంధమైన వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. వ్యాపార విషయాలలో రొటేషన్‌ బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. స్వల్పంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఉన్నతాధికారుల, రాజకీయనాయకుల అండదండలు లభిస్తాయి. మీ పేరుమీద ఉన్న ఓ స్థిరాస్తి విలువ పెరుగుుతుంది. అనవసరమైన ఆలోచనలతో, అపోహలతో మోసగాళ్ళకు జీవితంలో తావు ఇవ్వకండి. పెద్దల నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తే అప్పుగా ఇవ్వొద్దు, దానంగా ఇవ్వండి. రాజకీయ వాతావరణంలో ప్రవేశించవలసి వస్తుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృద్ధులపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. డాక్టర్లకు, చార్టర్డ్‌ అకౌంటెంట్లకు, ఇంజనీర్లకు, విద్యాసంస్థలు నడిపేవారికి, హోటల్‌ వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో దొర్లిన పొరపాట్లు మరల జరగకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థినీవిద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సంగీత సాహిత్య రంగాలలో అవార్డులు, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. యోగా, మెడిటేషన్‌ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దికాలం గైనిక్‌ సమస్యలతో బాధపడతారు. అవివాహితుౖలకు వివాహకాలం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. సహోదర సహోదరీ వర్గాన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటివాళ్ళ ముందు ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి నిద్రాహారాలను లెక్క చేయకుండా శ్రమించి ఫలితాలను సాధిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement