
ఆవిష్కరణం : తాళం ఎప్పుడు వేశారు?
బహుశా ప్రపంచంలో అతి ప్రాచీనకాలం నుంచి ప్రాథమిక అవసరాల్లో ఏ మాత్రం ప్రాధాన్యం కోల్పోనిది తాళమే. ఇంటిని మనం ఉన్నంత సేపు మనం కాపాడుతాం, మనం లేనపుడు తాళం కాపాడుతుంది.
బహుశా ప్రపంచంలో అతి ప్రాచీనకాలం నుంచి ప్రాథమిక అవసరాల్లో ఏ మాత్రం ప్రాధాన్యం కోల్పోనిది తాళమే. ఇంటిని మనం ఉన్నంత సేపు మనం కాపాడుతాం, మనం లేనపుడు తాళం కాపాడుతుంది. మనిషి బుద్ధి తప్పు దారి పట్టడమే దీని ఆవిష్కరణకు పునాది కావచ్చు. లేకపోతే అది కనిపెట్టాల్సిన అవసరం ఏముంది? జంతుజాలం కోసమే అనుకుంటే గొళ్లెం చాలు తాళం అవసరం లేదు. అంటే ఇతర ఉత్పత్తులు అన్నీ నాగరికతలో భాగంగా అభివృద్ధి సృష్టించినవి అయితే తాళం మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్!
సుమారు నాలుగువేల సంవత్సరాల క్రితం తాళాన్ని కనిపెట్టారు. మెసపటోమియా నాగరికతలో మొట్టమొదట దీన్ని వాడినట్టు చరిత్రలో నమోదైవుంది. మొదట్లో చెక్క తాళాలు ఉండేవి. వాటికేమీ తాళం చెవి ఉండదు. కొన్ని రంధ్రాలు, వాటిలో అమర్చతగ్గ కొన్ని చిన్న చెక్క ముక్కలు ఓ పద్ధతిలో వాడే వారట. ఆ తర్వాత మధ్య యుగాల నాటికి తాళాలు ఇనుముతో తయారయ్యాయి. ఇవి చెక్క తాళాలకు భిన్నంగా చోరులు చేధించడానికి అనువుగా లేకుండా ఉండేవి. 870-900 సంవత్సరాల మధ్య మొదటి లోహపు తాళం రూపొందించారు. ఆ తర్వాత అది అత్యంత ప్రాథమిక అవసరం కావడంతో అతి వేగంగా అందులో అనేక రకాల ఆవిష్కరణలు వచ్చాయి. 1778లో రాబర్ట్ బేరన్ సులువుగా వేసి, సులువుగా తీయగల మొదటి తాళం కనిపెట్టారు. దాంతో ఆధునిక తాళాలు తయారవడం మొదలైంది. ఇపుడు మనం వాడుతున్నది ఇదే ఇంజినీరింగ్. అయితే, దీన్ని 1818లో జెరెమియా చబ్ మరింత సున్నితంగా తయారుచేశారు. ఆ తర్వాత డోర్‌లాక్‌లు వచ్చినా టెక్నాలజీ అదే. కాకపోతే తాళం డోర్‌లో ఇమిడి ఉంటుంది. ఇపుడు ఎలక్ట్రానిక్ తాళాలు, సెన్సార్‌లతో ఓపెన్ అయ్యే తాళాలు వచ్చాయి.