
హ్యూమరం: కుదిరితే కప్పు కాఫీ
ఢిల్లీలో సోనియాతో కీలక సమావేశం. సమస్యలపై నిలదీసైనా సరే పరిష్కారం కోరాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా మూకుమ్మడిగా వెళ్ళారు. సోనియా వస్తున్నట్టు తెలియగానే అందరిలో వణుకు మొదలైంది. అహ్మద్‌పటేల్ వచ్చి అందరికి ఉన్ని శాలువాలు కప్పాడు.
సోనియా వచ్చింది. వణుకుతూ అందరూ నిలబడ్డారు. ఎందుకైనా మంచిదని కొందరు గుంజీలు తీసారు.
‘‘చలి లేకపోయినా మీరు వణుకుతున్నందుకు సంతోషంగా ఉంది. వణకడం మన సంస్కృతి’’ అంటూ కాఫీ తెమ్మని చెప్పింది.
‘‘ఇప్పుడు మీరు తాగుతున్న కాఫీ బ్రెజిల్ నుంచి, కెటిల్ జర్మనీ నుంచి, కప్పులు బర్మా నుంచి, చెంచాలు...’’ అనగానే ఇద్దరు ముగ్గురు నాయకులు లేచి నిలబడ్డారు. ‘‘నేను చెబుతున్నది స్పూన్ల గురించి. అన్నీ విదేశాల నుంచి వస్తే మరి మనదేశం నుంచి ఏమీ రాలేదా అని మీకు అనుమానం రావచ్చు. ఈ కాఫీ తయారు చేసినవాడు మనవాడే’’ అంటూ వంటవాడిని పిలిచింది.
వంటవాడు వచ్చి ‘‘అమ్మగారూ కాఫీ మీద కవిత్వం చెప్పమంటారా?’’అని, ‘‘కాఫీ తాగినవాడికి అవుతుంది రుణమాఫీ.. డికాషన్‌తో రాదు రియాక్షన్.. ఇంటికి పైకప్పు లేకపోయినా తాగు కప్పు కాఫీ.. అన్నిటికి కాపీ రైట్ వున్నపుడు కాఫీకెందుకు లేదు కాపీరైట్’’
నాయకులంతా వహ్వావహ్వా అన్నారు.
అహ్మద్‌పటేల్ ఉత్సాహపడి తాను కూడా అందుకున్నాడు.
‘‘సూఫీ కవులు చెప్పారు కాఫీ గురించి.. కాపీ కవులు కూడా చెప్పారు.. టోపీ పెట్టేవాడు, పెట్టించుకునేవాడు ఇద్దరూ కలిసి తాగాలి కాఫీ.. అప్పుడే డెమాక్రసీకి టేకాఫ్’’
‘‘వహ్వా..వహ్వా..’’
సోనియా సంతోషపడి ‘‘ఈ కాఫీని షుగర్‌తో తాగొచ్చు, లేకుండా తాగొచ్చు.. షుగర్ వుంటే తగ్గుతుంది లేకుంటే వస్తుంది. దీన్ని డాక్టర్స్ డైలమా అంటారు’’అంది.
‘‘క్యా డైలాగ్ హై’’
చిదంబరం వచ్చి కాఫీకి పుట్టినిల్లు తమిళనాడని పొగిడి తానూ కూడా కవిత్వం చెబుతానని రంగంలోకి దిగాడు.
‘‘కాఫీ ఇనక్కుపోలే మనక్కుపోలే ఎండ్రపొంగలే దీపావళి’’ అన్నాడు.
మనవాళ్ళు వెంటనే వహ్వావహ్వా అన్నారు.
‘‘ఎన్నయ్యా వహ్వా? ఇప్పుడు నేను మాట్లాడింది తమిళం కానేకాదు. అదేం భాషో నాకు కూడా తెలియదు. ఢి ల్లీలో జరిగే ప్రతిదానికీ వహ్వా అని అని మన పార్టీని మాఫీ చేసారు మేడం ’’ అని ఇరికించాడు తమిళతంబి.
సోనియాకి కోపమొచ్చింది. నాయకులకు చలిజ్వరమొచ్చింది. అహ్మద్‌పటేల్ కంబళ్ళు తెచ్చి కప్పేసరికి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
బయట ప్రెస్‌వాళ్ళు మైకులతో చుట్టుముట్టగానే ‘‘చర్చలు వాడిగా వేడిగా జరిగాయి. కాఫీ తాగినంత సులభంగా సమస్యలను పరిష్కరిస్తానని సోనియా చెప్పారు’’అని బ్రీఫింగ్ ఇచ్చారు.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
కొరడాతో కొట్టుకున్న తెలుగుదేశం నాయకులు జనానికి శ్రమ తగ్గించారు.
తెలుగుభాషలో చిరంజీవికి నచ్చే ఒకే ఒక్క పదం?పదవి.
హరికృష్ణపై దేశం నాయకుల కామెంట్?
హరీ... ఏమిటీ కిరికిరి!
తెలుగు అంటే సోనియాకు ఎందుకు నచ్చదు?
ఇటలీతో దేన్నీ పోల్చడం ఆమెకు ఇష్టముండదు.
(తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు.)
కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్య:
స్టీరింగ్, చక్రాలు లేకుండా బండి నడపడం ముఖ్యమంత్రికే సాధ్యం.
టీకొట్టు కామెంట్ ఇంట్లో ఉల్లి లొల్లి, బయట ఢిల్లీ లొల్లి.